ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో.. మేనేజ్ మెంట్ సీట్ల దందాకు చెక్ పడేనా?..

ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో.. మేనేజ్ మెంట్  సీట్ల దందాకు  చెక్ పడేనా?..
  • ఇంజినీరింగ్ బీ కేటగిరి సీట్లను ఆన్​లైన్ లో భర్తీ చేయాలని కోరుతున్న పేరెంట్స్ 
  • అనుమతి ఇవ్వాలని గతేడాదే సర్కారుకు టీజీసీహెచ్ఈ లేఖ 
  • ఇప్పటికే కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్ల అమ్మకాలు షురూ
  • త్వరగా స్పష్టత ఇవ్వాలంటున్న స్టూడెంట్లు, తల్లిదండ్రులు


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేటు ఇంజినీరింగ్  కాలేజీల్లో మేనేజ్ మెంట్  కోటా సీట్లను ఆన్​ లైన్​లో భర్తీ చేయాలనే డిమాండ్  రోజురోజుకూ పెరుగుతోంది. కొన్నేండ్లుగా నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వాళ్లకే మేనేజ్ మెంట్  సీట్లను కాలేజీలు అమ్ముకుంటున్నాయి. ఈ దందాకు చెక్  పెట్టేందుకు హయ్యర్  ఎడ్యుకేషన్  అధికారులు రెడీగా ఉన్నా.. సర్కారు పర్మిషన్  లేకపోవడంతో వెనక్కి తగ్గారు. త్వరలోనే బీటెక్  అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో.. దీనిపై ప్రభుత్వం త్వరగా స్పష్టత ఇవ్వాలని పేరెంట్స్  కోరుతున్నారు. రాష్ట్రంలో 157 ప్రైవేటు ఇంజినీరింగ్  కాలేజీలు ఉండగా, వాటిలో లక్ష వరకూ సీట్లు ఉన్నాయి. దీంట్లో 70 శాతం సీట్లను ఈఏపీ సెట్  ర్యాంకుల ద్వారా భర్తీ చేస్తుండగా, మిగిలిన 30 శాతం సీట్లను మేనేజ్ మెంట్  కోటా కింద నింపుతారు. ఈ కోటాలోనే నాన్ రెసిడెంట్ ఇండియన్ (ఎన్ఆర్ఐ) కోటా ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు. అయితే, ఎప్ సెట్ ద్వారా నింపే సీట్లన్నీ ప్రభుత్వమే నిబంధనల ప్రకారం.. విద్యార్థులకు వచ్చిన ర్యాంకుల ఆధారంగా రిజర్వేషన్లకు అనుగుణంగా నింపుతున్నారు. కానీ, మేనేజ్ మెంట్  కోటా (బీ కేటగిరి) సీట్లను మాత్రం మేనేజ్ మెంట్లు భర్తీ చేసుకునేలా ప్రభుత్వం అనుమతులు ఇస్తోంది. ఇది మేనేజ్ మెంట్లకు వరంగా మారింది. బీ– కేటగిరి సీట్లను ఎప్ సెట్ ర్యాంకు, జేఈఈ ర్యాంకు, ఇంటర్  మార్కుల ఆధారంగా భర్తీ చేయాలనే నిబంధనలు ఉన్నా దాదాపు ఏ కాలేజీ కూడా ఈ విధానాన్ని అమలు చేయడం లేదు. మేనేజ్ మెంట్  కోటా సీట్లకు కంప్యూటర్  సైన్స్, దాని అనుబంధ బ్రాంచులకు రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ దందాకు చెక్  పెట్టాలని  కొన్నేండ్లుగా పేరెంట్స్ విజ్ఞప్తులు చేస్తున్నారు. అయితే, గత బీఆర్ఎస్  ప్రభుత్వం దీన్ని పక్కన పెట్టగా.. రాష్ట్రంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వంపై పేరేంట్స్, స్టూడెంట్లు ఆశలు పెట్టుకున్నారు. 

గతేడాదే ప్రతిపాదనలు..

ఇంజినీరింగ్  కాలేజీల్లో మేనేజ్ మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా సీట్ల భర్తీని ప్రభుత్వమే చేపట్టాలని పేరెంట్స్, స్టూడెంట్ యూనియన్ల నుంచి భారీగా డిమాండ్లు, వినతులు వస్తున్నాయి. ఈ డిమాండ్లకు అనుగుణంగా గతేడాది హయ్యర్ ఎడ్యుకేషన్  కౌన్సిల్ అధికారులు.. బీ కేటగిరి సీట్లను కౌన్సెలింగ్  ద్వారానే భర్తీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సర్కారుకు లేఖ రాశారు. ఎంబీబీఎస్  తరహాలో బీటెక్  సీట్లనూ ఆన్​లైన్​లో భర్తీ చేస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. అయితే, అప్పట్లో దానిని ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ఏడాది బీటెక్ లో కొత్త ఫీజులు అమలు కాబోతున్నాయి. ఇప్పటికే ఎప్ సెట్ ఫలితాలు విడుదలైనా, ఇంకా అడ్మిషన్ల నోటిఫికేషన్  రాలేదు. ఈ టైమ్​లోనే బీ కేటగిరి సీట్ల భర్తీ విధానంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని పేరెంట్స్, స్టూడెంట్లు కోరుతున్నారు. ఆన్ లైన్​లో మేనేజ్ మెంట్  సీట్లను నింపితే.. కాలేజీల అక్రమ దందాకు చెక్ పెట్టినట్లు అవుతుందని చెప్తున్నారు. 

మొదలైన సీట్ల అమ్మకాలు..

ప్రైవేటు కాలేజీల్లో మేనేజ్ మెంట్  కోటా సీట్ల అమ్మకాలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. ఎప్ సెట్ ర్యాంకు, విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా స్టూడెంట్ల నుంచి కాలేజీల మేనేజ్ మెంట్లు డబ్బులు వసూలు చేస్తున్నాయి. ముందస్తు సీట్ల రిజర్వు పేరుతో 30 నుంచి 50 శాతం ఫీజును పేరెంట్స్  నుంచి తీసుకుంటున్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొత్తం ఫీజు వసూలు చేసేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఒకవేళ ప్రభుత్వమే ఎప్ సెట్ బీ– కేటగిరి సీట్లను ఆన్​లైన్ లో నింపితే.. పేరెంట్స్ కట్టిన డబ్బులు రిటర్న్  ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీంతో పేరెంట్స్ లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం బీ కేటగిరి సీట్ల భర్తీపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.