జయశంకర్ సార్ను.. తెలంగాణ జాతిపితగా గుర్తించాలి

జయశంకర్ సార్ను.. తెలంగాణ జాతిపితగా గుర్తించాలి

తెలంగాణ అనే ప్రాంతానికి ఆలోచనల  రక్తం నింపినవాడు  ప్రొఫెసర్  కొత్తపల్లి  జయశంకర్  సార్.  తెలంగాణ రాష్ట్ర కల సాక్షాత్కరించి  పదకొండేళ్లు  దాటినా అధికారికంగా ఆయనను ‘తెలంగాణ జాతిపిత’గా  గుర్తించని పరిస్థితి మనది.  ఆయన పేరు వాడారు.  సభలలో వేదికలపై  ఫొటో  పెట్టారు. కానీ, ఆయన భావజాలాన్ని పాలనలోకి తీసుకురాలేదు.  ఇప్పుడు, దాన్ని సరిచేసే సమయం వచ్చింది.  ‘జయశంకర్ సార్’ అంటే మాట కాదు ఆలోచన.  తెలంగాణ అంటే కేవలం వేర్వేరు జిల్లాల సమాహారం కాదు.  ఒక ప్రాంతీయ గౌరవం. ఆ భావనకు తలమానికం ప్రొఫెసర్ జయశంకర్.  ఆయన 1952లోనే  విద్యార్థిగా ఉండగానే  నిజాం  పరిపాలనపై  తిరుగుబాటు చేసి ‘వందేమాతరం’ అంటూ  పాడి నిజాం నిరంకుశత్వంపై  నిరసన  జెండా ఎగరేశాడు. ఆ రోజు తెలంగాణ  గొంతు మొదలైంది.  ఆ తర్వాత కాలంలో ఆ గొంతు వేదికలపై, ఉద్యమాల్లో మార్మోగింది. ఆయన రచించిన ‘రీజినల్​ డిస్పరిటీస్​ అండ్​ డిమాండ్​ ఫర్​ తెలంగాణ స్టేట్​’   అనే పత్రం భారతదేశంలో ఏ రాష్ట్ర ఉద్యమానికైనా దారిదీపంగా నిలిచేస్థాయి ఉన్నటువంటిది.

జాతిపితగా ప్రకటించాలి

ఉద్యమ సమయంలో ఆయన్ని భుజాలపై ఎక్కించుకున్నారు.  కానీ, రాష్ట్రం వచ్చిన తరువాత ఆయనను పక్కన పెట్టారు. ఆయన గౌరవార్థంగా పేరు పెట్టిన వ్యవసాయ విశ్వవిద్యాలయం మినహా మరే గౌరవమైన బహుమతి లేదు. ఆయన భావజాలాన్ని విద్యావ్యవస్థ నుంచి తొలగించారు. ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇప్పుడు  రాష్ట్ర పాలన మళ్లీ ప్రజల దగ్గరికి వస్తోంది. ప్రజా భవన్  ప్రజల కోసం మళ్లీ తెరుచుకుంది.  బీసీ జనగణనలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు.  ఇప్పుడు, తెలంగాణకు జాతిపితను ప్రకటించాల్సిన సమయమిది. ప్రొఫెసర్ జయశంకర్  సార్​ని  ‘తెలంగాణ జాతిపిత’గా  గుర్తించాల్సిన చారిత్రక బాధ్యత ప్రభుత్వానికి ఉంది.

తెలంగాణ కల్చరల్ ఫౌండేషన్ ప్రతిపాదనలు

తెలంగాణ కల్చరల్ ఫౌండేషన్ తరఫున  ప్రభుత్వానికి 20 ప్రతిపాదనలు చేస్తున్నాం. వాటిలో ప్రధానమైనవి.. ప్రొఫెసర్ జయశంకర్ గారిని ‘తెలంగాణ జాతిపిత’గా అధికారికంగా గుర్తించాలి.  ఆగస్టు 6ను  ‘జాతిపిత స్మృతి దినోత్సవం’గా  ప్రభుత్వం ప్రకటించాలి. హైదరాబాద్​ ట్యాంక్ బండ్​పై  లేదా మరి ఏదైనా ముఖ్య కూడలిలో అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఆయన విగ్రహాలు నెలకొల్పాలి.  కళాకేంద్రాలు, గ్రంథాలయాలు, సాహిత్య పురస్కారాలు జయశంకర్ సార్ పేరు మీద ఏర్పాటు చేయాలి.  ఆయన రచనలు పాఠ్యగ్రంథాల్లో చేర్చాలి.  జయశంకర్ తెలంగాణ ‘ఐడియాలజీ రీసర్చ్​ సెంటర్​’ను స్థాపించాలి.  బీసీ, ఎస్సీ, ఎస్టీ  యువతకు  ‘జయశంకర్​ పబ్లిక్​ పాలసీ  ఫెలోషిప్​’  ఇవ్వాలి.  ‘వాటర్​ జస్టిస్​ ఎండోమెంట్​’,  ‘కల్చరల్​ అవార్డ్​’,   ‘డాక్యుమెంటరీ ఫెలోషిప్​’ వంటి రాష్ట్రస్థాయి అవార్డులు ప్రారంభించాలి. 

స్మృతి వనాన్ని నిర్మించాలి

ఆయన స్వగ్రామమైన అక్కంపేటను మోడల్ తెలంగాణ విలేజ్​గా అభివృద్ధి చేయాలి.  హైదరాబాదులో ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఆయన  స్మృతి వనాన్ని నిర్మించాలి.  ఈ ప్రతిపాదనలు ఎలాంటి రాజకీయ కోణంలో చేయలేదు. ఇవి తెలంగాణ భావజాలం కోసం, భావితరాల తెలంగాణ కోసం చేసినవి. తెలంగాణ కోసం జీవించి, పదవులు పట్టించుకోని జయశంకర్ సార్ ను  ‘జాతిపిత’గా గుర్తించడం అంటే ఓ సత్యాన్ని గౌరవించడమే.   సీఎం రేవంత్​రెడ్డి చరిత్రలో నిలబడే నేత.  దశాబ్దాల తెలంగాణ చరిత్రలో ఉద్యమాన్ని ఉర్రూతలూపిన అందెశ్రీ గీతం జయ జయహే తెలంగాణకు రాష్ట్ర గీతంగా గౌరవం ఇచ్చిన మీరు,  సగటు తెలంగాణ మాతృమూర్తి రూపంలో తల్లి తెలంగాణకు ప్రభుత్వ గుర్తింపు ఇచ్చిన మీరు.. ఈ నిర్ణయం కూడా తీసుకుంటే  తెలంగాణ మీరు గుర్తించే చరిత్ర కాదు.. తెలంగాణ 
మిమ్మల్ని గుర్తించే చరిత్ర అవుతుంది.

 పురుషోత్తం నారగౌని
అధ్యక్షుడు, తెలంగాణ కల్చరల్ ఫౌండేషన్