డెంగ్యూ డేంజర్ బెల్స్.. ఆరు రోజుల్లో 13 కేసులు

 డెంగ్యూ డేంజర్ బెల్స్.. ఆరు రోజుల్లో 13 కేసులు
  • పేషెంట్లతో కిక్కిరిసిపోతున్న హాస్పిటళ్లు

కరీంనగర్, వెలుగు:కరీంనగర్ జిల్లాలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ లో వైరల్ ఫీవర్​తో పాటు డెంగ్యూ లక్షణాలతో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఈ ఏడాది ఇప్పటి దాకా 77 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. వీటిలో 13 కేసులు గడిచిన ఆరు రోజుల్లోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ ఏడాది డెంగ్యూ కేసుల సంఖ్య 600 దాటినట్లు లెక్కలు చెప్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఇండ్ల మధ్య నీళ్లు చేరి..  పారిశుధ్య లోపం కారణంగా డెంగ్యూ కారక దోమలు పెరిగాయి. దీంతో ప్రజలు వైరల్ ఫీవర్ బారినపడుతున్నట్లు డాక్టర్లు చెప్తున్నారు. ఇటీవల పెద్దపల్లి జిల్లాకు చెందిన యువకుడు డెంగ్యూ లక్షణాలతో చనిపోయాడు. 

తాజాగా కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వెల్దిలో మరో యువకుడు డెంగ్యూ లక్షణాలతోనే శుక్రవారం మృతి చెందాడు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆఫీసర్లు మాత్రం జిల్లాలో ఇప్పటి దాకా డెంగ్యూ మరణాలు నమోదు కాలేదని చెప్తున్నారు.

ఔట్ పేషెంట్లు డబుల్

కరీంనగర్ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్​కు నెల రోజుల కింద వరకు జ్వరంతో వచ్చేవాళ్ల సంఖ్య 350లోపే ఉండేది. పది రోజులుగా ఆ సంఖ్య 600 నుంచి 700 దాటింది. దీంతో ఔట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్లతో హాస్పిటల్ కిక్కిరిసిపోతున్నది. ఓపీకి శుక్రవారం 736 మంది పేషెంట్లు వచ్చారు. ఈ నెల 1న 644 మంది, 2న 744 మంది, 6న 741 మంది, 7న 578 మంది పేషెంట్లు ఓపీకి వచ్చారు. ప్రైవేట్ హాస్పిటల్స్​లోనూ పేషెంట్ల రద్దీ ఎక్కువగానే ఉంటున్నది. జ్వరం తీవ్రంగా ఉన్న పేషెంట్లు అడ్మిట్ అవుతున్నారు. తీవ్ర జ్వరంతో పాటు దగ్గు, జలుబు, గొంతు నొప్పి లక్షణాలతో వస్తున్న పేషెంట్ల సంఖ్య ఎక్కువగా ఉంటున్నదని డాక్టర్లు చెప్తున్నారు.

లక్షలు దండుకుంటున్న ప్రైవేట్ హాస్పిటళ్లు

జ్వరంతో బాధపడుతూ ప్రైవేట్ ఆస్పత్రుల​కు వెళ్తే.. ప్లేట్ లెట్స్ పడిపోయాయని డాక్టర్లు భయపెడ్తున్నారు. లక్షల రూపాయలు ఫీజులు దండుకుంటున్నారు. 105 డిగ్రీల జ్వరం, తలనొప్పి, అలసట, వికారం, మోషన్స్, జలుబు, కీళ్ల నొప్పులు, టేస్ట్ కోల్పోవడం డెంగ్యూ లక్షణాలని డాక్టర్లు చెప్తున్నారు. ఇలాంటి లక్షణాలుంటే హాస్పిటల్​కు వెళ్లాలని సూచిస్తున్నారు. జ్వరం ఎక్కువైతే బ్లడ్​లో వైట్ ప్లేట్​లెట్స్ సంఖ్యతగ్గి ప్రాణాలమీదకు వస్తుందంటున్నారు