డెంగ్యూ కలకలం.. వైరల్​ ఫీవర్​తో జనం బేజారు

డెంగ్యూ కలకలం.. వైరల్​ ఫీవర్​తో జనం బేజారు
  • వైరల్​ ఫీవర్​తో జనం బేజారు
  • అపరిశుభ్ర పరిసరాలతో వ్యాధుల వ్యాప్తి
  • ఇప్పటికే జిల్లాలో 65 కేసుల గుర్తింపు

నిజామాబాద్, వెలుగు : జిల్లాలో డెంగ్యూ, వైరల్ ​ఫీవర్ కేసులు రోజురోజుకూ అధికమవుతున్నాయి.​ పల్లె, పట్టణం తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో వ్యాధులు వ్యాపిస్తున్నాయి. దీంతో బాధితులు దవాఖానాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 65 డెంగ్యూ కేసులు నమోదైనట్లు మెడికల్​ అండ్​హెల్త్​ ఆఫీసర్లు పేర్కొన్నారు. గడిచిన పదిరోజుల్లోనే 15 డెంగ్యూ కేసులు నమోయ్యయాయి. రెండు రోజుల కింద ఎడపల్లి మండల కేంద్రంలో సంపత్​కుమార్​గౌడ్​(24) అనే యువకుడు డెంగ్యూతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. వైరల్​ఫీవర్​ బాధితుల సంఖ్య వందల్లో ఉంది. 

హాస్పిటిళ్ల కిటకిట.. 

జిల్లా కేంద్రంలోని జీజీహెచ్ ​హాస్పిటల్​లో డైలీ 1500 ఓపీలను పరీక్షిస్తారు. డెంగ్యూ విస్తరణ నేపథ్యంలో ఇన్​ పేషెంట్ల కోసం వంద బెడ్లను ప్రత్యేకంగా కేటాయించారు. ప్రస్తుతం ఇక్కడ నలుగురు డెంగ్యూ ట్రీట్​మెంట్​పొందుతున్నారు. నగరంలోని వివిధ ప్రైవేట్​హాస్పిటల్స్​లో 61 మంది ట్రీట్​మెంట్​ పొందుతున్నారని మెడికల్​ఆఫీసర్లు నిర్ధారించారు. అధిక జ్వరం, భరించలేని ఒళ్లు నొప్పులు, రక్తంలో ప్లేట్​లెట్లు పడిపోవడం తదితర డెంగ్యూ లక్షణాలతో చికిత్సలు చేయించుకుంటున్నారు. 

వైరల్​ఫీవర్ ప్రజలను మరింత బేజార్ ​చేస్తోంది. పీహెచ్ సీలు, సబ్​సెంటర్లకు వస్తున్న ప్రతీ వంద మందిలో 30 మంది వైరల్​ఫీవర్​తో బాధపడుతున్నారు. గ్రామాల్లో ఆర్ఎంపీ, పీఎంపీల వద్ద ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నవారూ అదే సంఖ్యలో ఉన్నారు. దీంతో హాస్పిటళ్లు కిటకిట లాడుతున్నాయి. నవీపేట మండలం సుభాష్​నగర్​ఏరియాలో అనేక మంది వైరల్​జ్వరాలతో బాధపడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లోనూ పరిస్థితి తీవ్రంగా ఉంది.

భారీ వర్షాల తర్వాత ఇంక్యూబేషన్..​  

నగరం, మున్సిపాలిటీ, పల్లెల్లో మురికి కాలువలు నిండిపోతున్నాయి. వీటిని వారాల తరబడి క్లీన్​చేయకుండా అలాగే ఉంచడం, వర్షం నీటితో నిండిన గుంతలు, ఓపెన్​ప్లాట్లలో నిలిచిన నీటితో దోమల వ్యాప్తి చెందుతున్నాయి. వర్షం నీరు రెండు వారాలకు మించి గుంతలో ఉంటే దోమలకు స్థావరం అవుతుంది. దీన్ని వైద్య పరిభాషలో ఇంక్యూబేషన్​ పీరియడ్ అంటారు. దోమల వ్యాప్తి లేకుండా స్ర్పే మందు పిచికారీ చేయాలి. 

లార్వా వ్యాప్తిని అరికట్టే గంబుసియా చేపలను డ్రైనేజీల్లో వదలాలి. మత్స్య శాఖ నుంచి వీటిని పొందేవీలుంది. నీటిగుంటల్లో ఆయిల్​బాల్స్​ జారవేయడంతో కూడా ప్రయోజనం ఉంటుంది. పట్టణాల్లో ఓపెన్​జాగాలున్న ఉన్న ఓనర్లు బరంతి మట్టి పోసుకునేలా నోటీసులు ఇస్తామని కొత్తగా వచ్చిన నగర పాలక కమిషనర్ మకరంద్ ​నెల కింద చెప్పారు. కానీ ఇంకా అమలు కాలేదు.

వ్యాధుల కాలం..అప్రమత్తత అవసరం

జ్వరాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఎలీసా టెస్ట్​ చేయించుకొని నిర్ధారించుకోవాలి. ప్రైమరీ స్టేజ్​లో  ట్రీట్​మెంట్​ తీసుకుంటే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. గవర్నమెంట్​ హాస్పిటల్స్​లో ఇందుకు ట్రీట్​మెంట్​ ఉంటుంది, ప్రైవేటుకు వెళ్లొద్దు. డిసెంబరు వరకు సీజనల్​వ్యాధుల ప్రబలే అవకాశాలు అధికంగా ఉంటాయి. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, జాగ్రత్తలు పాటించాలి.

– తుకారాం రాథోడ్, జిల్లా మలేరియా అధికారి