దేశంలో లక్షకు చేరువైన డెంగ్యూ కేసులు.. రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం

దేశంలో లక్షకు చేరువైన డెంగ్యూ కేసులు.. రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం

దేశంలో డెంగ్యూ రోజురోజుకు విజృంభిస్తోంది. ఈరోజు వరకు డెంగ్యూ కేసులు దాదాపు లక్షకు చేరువయ్యాయి. దీంతో  అన్ని రాష్ట్రాలకు  కేంద్రం అలర్ట్ జారీ చేసింది.  డెంగ్యూ నివారణ, నియంత్రణ మార్గదర్శకాలు  పాటించాలని కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను  ఆదేశించారు.

2023లో 95 వేల కేసులు

 ఈ సంవత్సరంలో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 95 వేల డెంగ్యూ కేసులు నమోదవ్వగా.. 91 మంది మరణించారు.  పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, జార్ఖండ్ లో  డెంగ్యూ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.  ముంబైలో గత మూడునెలల్లో 3 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.  

తెలంగాణలో డెంగ్యూ కేసులు రోజురోజుకు పెరుగుతుండడం ఆందోళన కల్గిస్తోంది. నెల వయసున్న చిన్నారుల నుంచి వయోవృద్దుల దాకా డెంగ్యూ బారిన పడుతున్నారు. దీంతో ఆస్పత్రులకు జనం క్యూ కడుతున్నారు.

డెంగ్యూ లక్షణాలు ఇవే.. 

డెంగ్యూ జ్వరం దోమల ద్వారా సంక్రమించే వైరల్‌ వ్యాధి. ప్రధానంగా ఈడిస్‌ దోమల ద్వారా వ్యాపిస్తుంది. డెంగ్యూ సోకిన సమయంలో అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కీళ్లు, కండరాల నొప్పి, దద్దుర్లు, ఫ్లూ వంటి లక్షణాలుంటాయి. డెంగ్యూ సోకిన సమయంలో అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కీళ్లు, కండరాల నొప్పి, దద్దుర్లు, ఫ్లూ వంటి లక్షణాలుంటాయి. తీవ్రమైన సందర్భాల్లో.. డెంగ్యూ హెమరేజిక్ జ్వరానికి దారితీస్తుంది. ఇది ప్రాణాంతక పరిస్థితని తలెత్తుతుందని వైద్యులు పేర్కొంటున్నారు.

జాగ్రత్తలు తప్పనిసరి

మనం నివసించే ప్రాంతాల్లో.. దోమలు పెరగకుండా చూసుకోవాలి. దోమలు నిలకడగా ఉన్న నీటిలో సంతానోత్పత్తి చేస్తాయి. పూల కుండీలు, కుండీలు, బకెట్‌లు వంటి వాటిలో నీటిని నిల్వలేకుండా చూసుకోవాలి. అలాగే దోమల బెడదను తగ్గించకునేందుకు ఇంటి పరిసరాల్లో ఎలాంటి నీటి నిల్వకుండా చేసుకోవాలి. దోమలు వ్యాప్తిచెందకుండా ముఖ్యంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.