కోతులు ఎన్ని ఉన్నాయోనని లెక్కకడుతున్న వ్యవసాయశాఖ

కోతులు ఎన్ని ఉన్నాయోనని లెక్కకడుతున్న వ్యవసాయశాఖ
  • లెక్క చెప్పాలంటూ ఏఈవోలకు వ్యవసాయ శాఖ ఆదేశం
  • క్రాప్ బుకింగ్ సైట్ లో నమోదు చేయాలని ఆర్డర్ 
  • కోతుల లెక్కలెట్ల తీసుడని ఏఈవోల పరేషాన్

హైదరాబాద్‌‌, వెలుగు:  వ్యవసాయ శాఖ ముఖ్యమైన పనులు పక్కనవెట్టి, ఇతర పనులు ముంగటేసుకుంది. వ్యవసాయ పనులు మరిచి కోతుల లెక్కలు తీస్తోంది. ఇప్పటికే యాసంగి సీజన్ ప్రారంభమైనా కనీసం పంటల ప్రణాళికను రూపొందించలేదు. ప్రతి సీజన్ లో పంటల లెక్కలూ సరిగ్గా తీయడం లేదు. రైతు బీమా నమోదులోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు ఇవన్నీ వదిలేసి పల్లెల్లో కోతులు ఎన్ని ఉన్నయో లెక్కలు తీయాలని ఏఈవోలను ఆదేశించింది. ఇందుకోసం అగ్రికల్చర్ క్రాప్ బుకింగ్ వెబ్ సైట్ లో ప్రత్యేకంగా మంకీ మెనస్ సర్వే పేరుతో ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది. ప్రతి ఊరిలోనూ సర్వే చేసి, అందులో వివరాలు అప్ లోడ్ చేయాలని హుకుం జారీ చేసింది. గ్రామాల్లో కోతుల బెడద ఎక్కువైందని, వాటితో పంటలకు నష్టం జరుగుతోందని ఈ సర్వే చేపట్టింది. 
సర్వేలో భాగంగా ఐదు ప్రశ్నలు ఇచ్చారు. మొదటిది గ్రామంలో ఎన్ని కోతులు ఉన్నాయి? వాటిలో ఎన్ని గుంపులు ఉన్నాయి? అనేది చెప్పాలి. రెండోది పల్లెల్లో కోతుల వల్ల జరిగిన పంట నష్టం ఎంత అనేది అంచనా వేయాలి. మూడోది.. సాధారణంగా గ్రామాల్లో కోతులు ఎక్కడ ఉంటున్నాయి? చెట్ల మీదనా, పాడుబడిన బిల్డింగుల్లోనా, గుట్టల మీదనా, అడవుల్లోనా, రోడ్డు పక్కనా, ఇతర ప్రాంతాల్లోనా అనేది గుర్తించాలి. నాలుగోది.. ఆ గ్రామానికి దగ్గర్లో ఏదైనా టూరిస్టు ప్లేసు ఉందా? అనేది నమోదు చేయాలి. ఐదోది.. ఆయా గ్రామాల్లో కోతులను కంట్రోల్ చేసేందుకు రైతులు వినియోగిస్తున్న పద్ధతులేంటో చెప్పాలి. నైలాన్‌‌‌‌‌‌‌‌ నెట్లు, మంకీ గన్‌‌‌‌‌‌‌‌లు, సోలార్‌‌‌‌‌‌‌‌ ఫెన్సింగ్‌‌‌‌‌‌‌‌, దిష్టిబొమ్మలు, కొండముచ్చులు.. ఇలా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో నమోదు చేయాల్సి ఉంటుంది. 
ఏఈవోలకు తప్పని ఇబ్బందులు...  
ఇప్పటికే రైతుల ప్రమేయం లేకుండా పంట నమోదు చేపట్టాలని ఆదేశించడంతో ఏఈవోలు ఇబ్బందులు పడుతున్నారు. పంటల నమోదుకు ఒక్కో ఏఈవోకు 10 వేల నుంచి 15 వేల ఎకరాలు అప్పగించడంతో.. ఫీల్డ్ లెవల్ లో పంటలను పరిశీలించడం వీలుకాక అందాద లెక్కలు వేస్తున్నారు. పని భారం ఎక్కువ కావడంతో పంటల లెక్కలే సరిగ్గా నమోదు చేయలేకపోతున్నామని ఏఈవోలే చెబుతున్నారు. మరోవైపు రైతు బీమా విషయంలోనూ ఏఈవోలకు ఇబ్బందులు తప్పడం లేదు. తక్కువ టైమ్ ఇచ్చి, గడువులోనే పూర్తి చేయాలంటే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. ఈ పనుల పరిస్థితే ఇట్లుంటే, ఇగ ఇప్పుడు కోతుల సర్వే అప్పజెప్పారని... వాటి లెక్కలు తామెట్ల తీసేదని పరేషాన్ అయితున్నారు. వ్యవసాయాన్ని బాగు చేసేందుకు డిగ్రీలు, పీజీలు చేసి వస్తే డేటా ఎంట్రీ పనులు చేయిస్తున్నారని వాపోతున్నారు.