సిమెంట్, ఇసుక ధరలు అందుబాటులో ఉంచండి : భట్టి విక్రమార్క

సిమెంట్, ఇసుక ధరలు అందుబాటులో ఉంచండి  : భట్టి విక్రమార్క
  • మండల స్థాయిలో ధరల నిర్ణయ కమిటీలు ఏర్పాటు చేయండి: భట్టి విక్రమార్క 
  • ఎల్‌‌ఆర్‌‌‌‌ఎస్‌‌ దరఖాస్తులను పెంచేందుకు భూముల బేసిక్ విలువ పెంపుపై ప్రతిపాదనలు
  • సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలు ప్రతిరోజు సమీక్షించాలని  డిప్యూటీ సీఎం ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా సామాన్యులకు సిమెంట్, స్టీల్, ఇటుకలు, ఇసుక వంటి నిర్మాణ సామగ్రి ధరలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. మండల స్థాయిలో ధరల నిర్ణయ కమిటీలు ఏర్పాటు చేసి, స్థానిక ధరలను పర్యవేక్షించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌‌ఆర్‌‌‌‌ఎస్‌‌) దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపైనా మంత్రుల బృందం చర్చించింది. 

సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో భూముల బేసిక్ విలువను పెంచితే దరఖాస్తుదారులు ముందుకొచ్చే అవకాశం ఉంటుందని అధికారులు అభిప్రాయపడ్డారు. సోమవారం సెక్రటేరియెట్‌‌లో జరిగిన రెవెన్యూ రిసోర్స్ మొబలైజేషన్ సబ్‌‌ కమిటీ సమావేశంలో భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సామాన్యులకు ఇసుకను అందుబాటులోకి తేవడానికి అధికారులు ఇప్పటికే 20 విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అలాగే, మార్కెట్ యార్డులు, ప్రభుత్వ స్థలాల్లో కూడా ఇసుక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా గిరిజనులే ఇసుక క్వారీలను నిర్వహించేందుకు చేపట్టిన చర్యలపైనా సమావేశంలో చర్చించారు. 

ఆదాయం పెంచండి..

ప్రజలపై పన్ను భారం మోపకుండా ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించాలని సబ్‌‌ కమిటీ చైర్మన్ అధికారులను భట్టి ఆదేశించారు. రెవెన్యూ రిసోర్స్ మొబలైజేషన్ సబ్‌‌ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ప్రతిరోజు సమీక్ష నిర్వహించాలని చెప్పారు. సబ్‌‌ కమిటీలో చర్చించిన విషయాల్లో ప్రగతి కనబరచాలని, అధికారులకు ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైతే తనను నేరుగా సంప్రదించి, సమస్యను పరిష్కరించుకోవచ్చని వెల్లడించారు. 

అలాగే, హైదరాబాద్‌‌లోని కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌‌‌‌ఆర్‌‌‌‌) వెలుపలకు తరలించే కార్యక్రమంపై పారిశ్రామిక వాడల వారీగా సబ్‌‌ కమిటీ అధికారులతో సమీక్ష నిర్వహించింది. మైన్స్ , జియాలజీ శాఖలో అమల్లో ఉన్న వన్‌‌ టైం సెటిల్‌‌మెంట్ ప్రగతిని సబ్‌‌ కమిటీ సభ్యులు సమీక్షించారు. కమర్షియల్ ట్యాక్స్ విభాగానికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ మెరుగైన స్థితిలో ఉందని సబ్‌‌ కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు.