పవర్ సెక్టార్‌‌‌‌ను ముంచేశారు: భట్టి విక్రమార్క

పవర్ సెక్టార్‌‌‌‌ను ముంచేశారు: భట్టి విక్రమార్క
  • పవర్ సెక్టార్‌‌‌‌ను ముంచేశారు
  • పీకల్లోతు అప్పుల్లో విద్యుత్ సంస్థలు: భట్టి విక్రమార్క
  • తొమ్మిదిన్నరేండ్లలో రూ.1.10 లక్షల కోట్ల బకాయిలు
  • గత ప్రభుత్వం చెప్పిన లెక్కలు ఆందోళనకరం
  • ఇప్పుడున్న బీటీపీఎస్​తో ఆర్థిక భారం తప్ప ప్రయోజనం లేదని విమర్శ
  • మణుగూరులోని భద్రాద్రి పవర్ ప్లాంట్ సందర్శించిన డిప్యూటీ సీఎం

భద్రాద్రి కొత్తగూడెం / మణుగూరు, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం పవర్ సెక్టార్‌‌‌‌ను నిండా ముంచేసిందని, వారు చేసిన తప్పిదాల వల్ల విద్యుత్ సంస్థలు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాయని డిప్యూటీ సీఎం, విద్యుత్ మంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని భద్రాద్రి పవర్ ప్లాంట్(బీటీపీఎస్) ను ఆయన శనివారం సందర్శించి, పరిశీలించారు. ప్లాంట్ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. పవర్ ప్లాంట్ పనులు జరుగుతున్న తీరును, విద్యుత్ తయారీ, కోల్ సప్లై వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గత ప్రభుత్వం చెప్పిన అంకెలు, లెక్కలు ఆందోళనకరంగా, ఆశ్చర్యకరంగా ఉన్నాయి. గత ప్రభుత్వాన్ని ఏం చేయాలో అర్థం కావడం లేదు. రాష్ట్ర విభజన నాటికి విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి రూ.7,259 కోట్ల బకాయిలుండగా.. బీఆర్ఎస్ గవర్నమెంట్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో బకాయిలు దాదాపు రూ.1.10 లక్షల కోట్లకు పెరిగాయి. పవర్ ప్లాంట్ల పేర గత ప్రభుత్వం రూ.81,516 కోట్ల అప్పులు చేసింది. డిస్కమ్స్‌‌కు గవర్నమెంట్ ద్వారానే రూ.28,842 కోట్ల బకాయిలు ఉన్నాయి. విద్యుత్ కొనుగోలు బకాయిలు రూ.59,580 కోట్లకు చేరాయి. ఒక్క సింగరేణికే దాదాపు రూ.19,431 కోట్ల బకాయిలు ఉన్నాయి. పవర్ పర్చేజ్ కోసం గత ప్రభుత్వం దాదాపు రూ.30,406 కోట్లు ఖర్చు పెట్టింది’’ అని చెప్పారు.

30 ఏండ్ల భారం

భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల కోసం ఇష్టారాజ్యంగా గత ప్రభుత్వం అప్పులు చేసిందని భట్టి విక్రమార్క విమర్శించారు. 24 గంటల కరెంట్ పేర రాబోయే కొన్ని తరాలను బీఆర్ఎస్ గవర్నమెంట్ తాకట్టు పెట్టిందని ఆరోపించారు. తాము చెప్పేవన్నీ గాలి లెక్కలు కాదని, రికార్డుల్లో ఉన్నవే చెప్తున్నామని అన్నారు. వీటిని ప్రజల దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని తిరిగి ట్రాక్​లో పెట్టాలంటే లోతుగా అధ్యాయనం చేస్తూ సమస్యలను అధిగమిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలిపారు.

 ‘‘భద్రాద్రి పవర్ ప్లాంట్‌‌ను సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించాల్సి ఉన్నప్పటికీ గత ప్రభుత్వం సబ్​ క్రిటికల్ టెక్నాలజీ విధానంలో నిర్మించడంతో కాలుష్యంతో పాటు పర్యావరణానికి హాని కలుగనుంది. ఇప్పుడున్న బీటీపీఎస్​తో చాలా ఇబ్బందులున్నాయి. పచ్చని ప్రకృతి, అమాయకులైన గిరిజనులు, సహజ సిద్ధమైన వనరులున్న ఈ ప్రాంతంలో సబ్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి పవర్ ప్లాంట్‌‌ను నిర్మించడంతో మరో 30 ఏండ్ల వరకు ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మోయాల్సి ఉంది. సబ్ క్రిటికల్ పద్ధతితో రా మెటీరియల్ కాస్ట్ పెరుగనుంది. కాలుష్యం ఏర్పడనుంది. పక్కా ప్రణాళికతో కాలుష్యాన్ని, ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు మేం ప్రయత్నిస్తాం” అని తెలిపారు. గత ప్రభుత్వ అప్పులపై ఇప్పటికే శ్వేతపత్రం రిలీజ్ చేశామని చెప్పారు.

పనులు స్పీడ్​గా పూర్తిచేయాలి

బీటీపీఎస్‌‌ను సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో పూర్తి చేస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. ‘‘భద్రాద్రి పవర్ ప్లాంట్ వ్యయం 10,515.84 కోట్లు. ఇప్పటి వరకు 8,295.53 కోట్లు ఖర్చు చేశారు. 4,952 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది” అని తెలిపారు. రైల్వే వ్యాగన్ టిల్లర్ పనులు, రైల్వే ట్రాక్ పనులు నిర్మాణ దశలో ఉన్నాయని ప్లాంట్ ఆఫీసర్లు భట్టి దృష్టికి తీసుకువచ్చారు. రైల్వే లైన్ పూర్తి కాకపోవడం వల్ల మణుగూరు నుంచి టిప్పర్ల ద్వారా బొగ్గు తీసుకుంటున్నట్టు వారు పేర్కొన్నారు. రైల్వే లైన్​కు సంబంధించి 30 శాతం పనులు జరిగాయని, భూ సేకరణ ప్రక్రియ జరుగుతున్నదని తెలిపారు. 

జిల్లా స్థాయిలో కో ఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని పనులు స్పీడ్​గా అయ్యేలా చర్యలు తీసుకోవాలని భట్టి సూచించారు. విద్యుత్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అలీ ముర్తజా రిజ్వీ, డిప్యూటీ సీఎం ఆఫీస్ స్పెషల్ ఆఫీసర్ కృష్ణ భాస్కర్, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, రాందాస్, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య తదితరులు పాల్గొన్నారు.