తెలంగాణలో సంపద సృష్టిస్తాం.. ప్రజలకు పంచుతాం : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

తెలంగాణలో సంపద సృష్టిస్తాం.. ప్రజలకు పంచుతాం : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

ఆమనగల్లు, వెలుగు : రాష్ట్రంలో సంపద సృష్టించి ప్రజలకు పంచుతామని, పదేండ్లు రాష్ర్టాన్ని పాలించి అభివృద్ధి చేయని బీఆర్ఎస్ నాయకులకు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. సోమవారం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల, నియోజకవర్గంలోని ఎనిమిది విద్యుత్ సబ్ స్టేషన్లకు ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన భూమిపూజ చేశారు. అనంతరం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో రూ.70 వేల కోట్లు ఖర్చు చేసి సంక్షేమ పథకాలు చేపడుతుంటే ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ విమర్శించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 

బీఆర్ఎస్ పాలనలో పథకాలు, ఉద్యోగాలు, ఉపాధి లేక ప్రజలు నాటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేశారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ దయ్యాల నుంచి ప్రజలు విముక్తి కోరుకొని కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారని తెలిపారు. ఇక కేసీఆర్ ఆటలు సాగవని, ఇంటి దయ్యాలతోనే ఆయనకు నష్టమని వ్యాఖ్యానించారు. ధనిక రాష్ట్రంలో మీరు చేయని అభివృద్ధిని.. అప్పుల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకుల బెదిరింపులకు లొంగమని, తెలంగాణను దేశంలో ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఉచిత కరెంట్, మద్దతు ధర, బోనస్, ఇన్సూరెన్స్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, ఉచిత బస్సు, సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని వివరించారు. 

ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ మూడు నెలల్లో రూ.45 వేల కోట్లు రైతుల సంక్షేమానికి ఖర్చు చేసిందని పేర్కొన్నారు. తలకొండపల్లి మండలానికి 133 కేవీ సబ్ స్టేషన్ మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, వంశీకృష్ణ, కార్పొరేషన్ చైర్మన్లు నరసింహారెడ్డి, వెన్నెల, ఒబేదుల్లా కోత్వాల్, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వంశీచందర్ రెడ్డి, నాయకులు బాలాజీసింగ్, రామ్ రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.