ఓదెల మల్లన్నకు దక్కని ఆదరణ..ఆలయానికి ఏటా రూ. కోటి దాకా ఆదాయం

ఓదెల మల్లన్నకు దక్కని ఆదరణ..ఆలయానికి ఏటా రూ. కోటి దాకా ఆదాయం
  • అయినా ఆలయం అభివృద్ధిపై అంతులేని నిర్లక్ష్యం
  • సౌకర్యాలు లేకపోవడంతో భక్తుల అవస్థలు 

పెద్దపల్లి, వెలుగు: ఉత్తర తెలంగాణలో ఓదెలలోని భ్రమరాంబిక మల్లికార్జునస్వామి ఆలయానికి ప్రత్యేకత ఉంది. ఏటా ఉగాది టైంలో ఇక్కడకు భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు. కానీ ప్రస్తుతం ప్రతీ బుధ, ఆదివారాల్లోనూ రద్దీ ఉంటోంది. ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో వేములవాడ, కొండగట్టు, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయాలతోపాటు ఓదెల మల్లన్న ఆలయం కూడా ప్రత్యేకమైంది. ఆలయానికి సర్కార్ గుర్తింపున్నా సరైన సౌకర్యాలు, రవాణా కల్పించడంలో అంతులేని నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇటీవల ఏర్పాటైన కొత్త దేవాలయ పాలకవర్గం రెండేళ్లలో సమస్యలను సీఎం రేవంత్​రెడ్డి దృష్టికి తీసుకుపోయి పరిష్కరిస్తామంటున్నారు. 

ప్రభుత్వ గుర్తింపున్నా పట్టించుకోలే 

ఓదెల మల్లన్న ఆలయాన్ని పదిహేనేళ్ల క్రితమే ప్రభుత్వం గుర్తించింది. కానీ అభివృద్ధి విషయంలో అప్పటి నుంచి నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. పెద్దపల్లి జిల్లాలోనే ఉన్న ఏకైక అతి పెద్ద శైవక్షేత్రం ఓదెల మల్లన్న గుడి. ఈ ఆలయాన్ని ఏడాది పొడుగునా 60 లక్షలకు పైగా భక్తులు దర్శించుకుంటున్నారు. తెలంగాణతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్ర చంద్రపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి భక్తులు వస్తుంటారు. కానీ దైవదర్శనానికి వచ్చిన భక్తులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

ఆలయానికి ఏటా దాదాపు రూ.కోటి ఆదాయం ఉన్నా సౌకర్యాల కల్పించడంలో దేవాదాయ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఉగాది రోజు మొదలైన వేడుకలతో గుడి  ప్రతీ బుధ, ఆదివారాల్లో భక్తులతో కిటకిటలాడుతుంది. ప్రతీ ఏటా దాదాపు 50 వేలకు పైగా పట్నాలు వేసి బోనాలు సమర్పిస్తారు. ఈ వేడుకలు జూలై వరకు కొనసాగి పెద్ద పట్నంతో ముగుస్తాయి.

సౌకర్యాలు నిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

ప్రతీ రెండేళ్లకోసారి వచ్చే సమ్మక్క జాతరకు ముందు ఓదెల మల్లన్న దేవాలయం భక్తులతో కిక్కిరిస్తుంది. దీంతోపాటు ప్రతీ ఆది, బుధవారాల్లో వచ్చే భక్తులు అదనం. భక్తులకు సౌకర్యాల్లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ వసతి గృహాలు లేకపోవడంతో చెట్లకిందనే వండుకు తినాల్సిన పరిస్థితి. మహిళలకు టాయిలెట్స్​ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాత్రూంలు లేక సమీపంలోని పొలాల వద్ద ఉన్న బోర్ల వద్ద స్నానాలు చేయాల్సిన పరిస్థితి. దేవాలయ మండపాలు శిథిలావస్థకు చేరాయి. కోనేరు నిర్మాణం కూడా పూర్తి కాలేదు. బస్సుల సౌకర్యం పెంచితే ఇంకా భక్తులు పెరిగే చాన్స్​ ఉంటుంది.

ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం 

ఓదెల మల్లన్న ఆలయ అభివృద్ధికి నూతన పాలకమండలి కట్టుబడి ఉంది. దేవస్థానంలోని సమస్యలను గుర్తించాం. ఎమ్మెల్యే విజయరమణారావు ఆధ్వర్యంలో మాస్టర్​ ప్లాన్​ రెడీ చేస్తున్నాం. జిల్లాకు చెందిన మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, ఎమ్మెల్యేలు రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఠాకూర్​సహకారంతో ముందుకు సాగుతాం. ఆలయంలో నిత్యాన్నదానానికి ఏర్పాట్లు చేస్తున్నాం. - చీకట్ల మొండయ్య, ధర్మకర్తల మండల చైర్మన్​, ఓదెల దేవస్థానం