- వానల టైంలో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించడంపై హైడ్రా ఫోకస్
- జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, శివారు మున్సిపాలిటీల అధికారులతో త్వరలో మీటింగ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీతోపాటు శివారు ప్రాంతాల్లో చిన్నపాటి వర్షం పడినా రోడ్లపై వరద నిలుస్తోంది. గంటల తరబడి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు హైడ్రా ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు ఉన్నతాధికారులతోపాటు హైడ్రా పరిధిలోకి వచ్చే శివారు మున్సిపాలిటీల కమిషనర్లతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ త్వరలో మీటింగ్నిర్వహించనున్నారు.
వర్షాలు పడినప్పుడు రోడ్లపై నీరు చేరడానికి కారణాలు, తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఏవైనా పనులు చేయాల్సి వస్తే పెట్టాల్సిన ఖర్చు ఎంత ? ఎంత టైం పడుతుంది? అన్న అంశాలపై మాట్లాడనున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలోని వాటర్లాగింగ్పాయింట్ల వద్ద లక్ష, 5 లక్షలు, 10 లక్షల లీటర్ల కెపాసిటీతో 18 చోట్ల 23 హోల్డింగ్ స్ట్రక్చర్లు నిర్మిస్తోంది. ఇవి నిండిపోగానే ఎప్పటికప్పుడు మోటార్లతో స్ట్రామ్ వాటర్ డ్రైన్ లోకి తరలిస్తారు. వీటిపై కూడా హైడ్రా చర్చించనుంది. ఇంకెక్కడైనా అవసరమైతే నిర్మించేందుకు ప్లాన్ చేయనుంది.