మూడో లిస్ట్​ వచ్చినా ఇంకా మూడు పెండింగే

మూడో లిస్ట్​ వచ్చినా ఇంకా మూడు పెండింగే
  • సంగారెడ్డి, సిద్దిపేట, హుస్నాబాద్ స్థానాల్లో ఖరారు కాని అభ్యర్థులు
  • ఆశావహుల్లో కొనసాగుతోన్న టెన్షన్
  • ఉమ్మడి మెదక్ ​జిల్లాలో బీజేపీ టికెట్ల తీరు 

మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు: బీజేపీ హైకమాండ్​మూడో లిస్ట్​రిలీజ్ చేసినప్పటికీ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇంకా మూడు స్థానాల్లో టికెట్లు కన్ఫర్మ్​ కాలేదు. సంగారెడ్డి, సిద్దిపేట, హుస్నాబాద్ స్థానాలకు క్యాండిడేట్లను ప్రకటించలేదు. మెదక్​ జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాలు ఉండగా  రెండో లిస్ట్​లో నర్సాపూర్​అభ్యర్థిగా మున్సిపల్​ చైర్మన్​ మురళీ యాదవ్​కు టికెట్​ కేటాయించారు.

మెదక్​ టికెట్ కోసం పార్టీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్​, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందు జనార్ధన్​రెడ్డి, తాళ్లపల్లి రాజశేఖర్​, కరణం పరిణిత, పంజా విజయ్​ కుమార్​ అప్లై చేసుకున్నారు. అయితే ఫస్ట్​, సెకండ్​ లిస్ట్​లో ఇక్కడ అభ్యర్థిత్వం పెండింగ్​లో ఉంచగా మూడో లిస్ట్​లో బీఆర్​ఎస్​కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్​ కుమార్​కు టికెట్​ కేటాయించింది. 

సిద్దిపేట జిల్లాలో..

జిల్లాలోని సిద్దిపేట, హుస్నాబాద్   సెగ్మెంట్ల  బీజేపీ అభ్యర్థులు ఎవరనే దానిపై  సస్పెన్స్​ కొనసాగుతోంది.  మూడో జాబితాను ప్రకటించినా రెండు స్థానాలకు సంబంధించి అభ్యర్థును ఖరారు చేయక పోవడంతో పార్టీ శ్రేణుల్లో సస్పెన్స్​ కొనసాగుతోంది. మూడో జాబితాలో తమకు టికెట్ ఖరారవుతుందని భావించిన సిద్దిపేట, హుస్నాబాద్ ఆశావహుల్లో ఆందోళన నెలకొంటోంది.

ఇప్పటికే ఈ రెండు స్థానాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేయడంతో వారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. సిద్దిపేట బీజేపీ టికెట్ కోసం 21 మంది అప్లై చేసుకోగా, హుస్నాబాద్ టికెట్ కోసం 9 మంది అప్లై చేసుకున్నారు. జనసేన తో పొత్తు కారణంగా ఈ రెండింట్లో ఏదైనా ఒక సీటును వారికి కేటాయించ వచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

జనసేన హైకమాండ్​  పొత్తు చర్చలు ప్రారంభం కాక ముందే  హుస్నాబాద్ నుంచి పోటీ చేస్తామని ప్రకటించగా లేటెస్ట్ గా సిద్దిపేట సీటును వారికే కేటాయించ వచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. సిద్దిపేట, హుస్నాబాద్ సెగ్మెంట్లలో మెజార్టీ ఓటర్లు బీసీలే ఉండడంతో సీటు బీసీలకే కేటాయించే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతోంది. సిద్దిపేట టికెట్ కోసం జిల్లా బీజేపీ అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి, నాయిని నరోత్తం రెడ్డి, విద్యాసాగర్, భైరి శంకర్ ముదిరాజ్, ఉడుత మల్లేశం యాదవ్, టి. వెంకటేశం, పత్తి శ్రీనివాస్, కొత్తపల్లి వేణుగోపాల్ , హుస్నాబాద్ బీజేపీ టికెట్ కోసం  బొమ్మ శ్రీరాం చక్రవర్తి, జన్నపు రెడ్డి సురేందర్ రెడ్డి, లక్కిరెడ్డి తిరుమల, మంజుల రెడ్డి పోటీ పడుతున్నారు. 

సంగారెడ్డి జిల్లాలో..

సంగారెడ్డి జిల్లాలో నాలుగు చోట్ల బీజేపీ క్యాండిడేట్లను ప్రకటించిన బీజేపీ హైకమాండ్​ఒకచోట పెండింగ్ పెట్టింది. గురువారం ప్రకటించిన మూడో జాబితాలో సంగారెడ్డి మినహా జహీరాబాద్, ఆందోల్, నారాయణఖేడ్ అసెంబ్లీ సెగ్మెంట్లలో క్యాండిడేట్లను ప్రకటించింది. జహీరాబాద్ నియోజకవర్గం నుంచి రాంచందర్ రాజనర్సింహ, ఆందోల్ నుంచి బాబు మోహన్, నారాయణఖేడ్ సెగ్మెంట్ నుంచి జనవాడే సంగప్ప పేర్లను ఖరారు చేసింది.

ALSO READ : నిర్మల్ జిల్లాను తెచ్చిందే ఇంద్రకరణ్ రెడ్డి : కేసీఆర్

ఆందోల్​ స్థానంలో బాబుమోహన్​ పోటీకి విముఖత చూపినప్పటికీ టికెట్​ కేటాయించడం గమనార్హం. పటాన్ చెరు నుంచి మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ పేరును ఫస్ట్ లిస్టులోనే ప్రకటించగా, ఇపుడు నాలుగు సెగ్మెంట్లలో బీజేపీ అభ్యర్థులు ఖరారయ్యారు. సంగారెడ్డి స్థానంలో  రాజేశ్వర్ రావు దేశ్​ పాండే, పులిమామిడి రాజుతో పాటు విఠల్ పేర్లు పరిశీలనలో ఉండగా హైకమాండ్​ అభ్యర్థిత్వాన్ని పెండింగ్​లో ఉంచింది. నామినేషన్లు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటివరకు సంగారెడ్డి అభ్యర్థిని ప్రకటించకపోవడం పట్ల కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు.