
దేవరకొండ, వెలుగు : 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ కోరారు. గురువారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని కోల్ ముంతల్ పహాడ్ గ్రామపంచాయతీ పరిధిలోని బాబూజీ నగర్ లో నిర్మించిన డ్రింకింగ్ వాటర్ పైప్‌లైన్‌ను ప్రారంభించారు. జేబీ, అంబేద్కర్ కాలనీలో అండర్ గ్రౌండ్ పనులకు శంకుస్థాపన, సాయి కృప ఫంక్షన్ హాల్ లో లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ ఆమోదించాలన్న డిమాండ్‌తో సీఎంతో సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చే నెల 5, 6,7 తేదీల్లో ఢిల్లీకి వెళ్లి పోరాడనున్నట్లు తెలిపారు. అనంతరం పీఏ పల్లి మండల పరిధిలోని వైష్ణవి ఫంక్షన్ హాల్ లో రేషన్ కార్డులు పంపిణీ చేశారు. చింతపల్లి మండల కేంద్రంలోని షిరిడి సాయిబాబా దేవాలయంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తో కలిసి పూజలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవరెడ్డి, పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహ, పీఏసీఎస్ చైర్మన్ వేణుధర్ రెడ్డి, ఆర్డీవో రమణారెడ్డి, మండలాధ్యక్షుడు వేమన్ రెడ్డి, ఎల్లయ్య యాదవ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యేని అడ్డుకున్న గుడిపల్లి రైతులు
దేవరకొండ(గుడిపల్లి) : గుడిపల్లి మండల కేంద్రంలో గురువారం రైతులు దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ని అడ్డుకున్నారు. గుడిపల్లి మండల పరిధిలోని కేశినేనిపల్లి నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించడానికి వెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలో ఎమ్మెల్యేను అడ్డుకొని, గుడిపల్లి గ్రామానికి 7బి కెనాల్ వాటర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.