ఉచిత విద్య, వైద్యంతోనే పేదల అభివృద్ధి సాధ్యం

ఉచిత విద్య, వైద్యంతోనే పేదల అభివృద్ధి సాధ్యం

అంతర్జాతీయ స్థాయిలో ఆఫీసులు, కట్టడాలు నిర్మించడం కాదు.. ప్రభుత్వ విద్య, వైద్యాన్ని అంతర్జాతీయ స్థాయికి పెంచినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. అమెరికా లాంటి దేశాల్లో 1 నుంచి12 వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పిల్లలను పంపాలి. యూరప్ లాంటి దేశాల్లో ఎల్​కేజీ నుంచి పీజీ వరకు ఉచితం. కానీ మనదేశంలో, మన రాష్ట్రంలో నాణ్యమైన విద్య కావాలంటే ఎల్​కేజీ నుంచి పీజీ వరకు లక్షల రూపాయలు ఖర్చు చేసి విద్యను కొనుక్కోవాలి. తెలంగాణలో 2021–22 వ సంవత్సరానికి బడ్జెట్ లో 7 శాతం మాత్రమే ప్రభుత్వం విద్యకు నిధులు కేటాయించింది. ఇది దేశంలో గల అన్ని రాష్ట్రాల కన్నా తక్కువ. రాష్ట్రంలో సుమారు 26 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉంటే, వాటిల్లో దాదాపు 22 వేల టీచర్​పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  

ఎంఈవోలు, డిప్యూటీ డీఈవోలు, డీ ఈవోలు లేరు. యూనిఫామ్ లు లేవు, పుస్తకాలు రావు,  చాక్ పీసులు ఉండవు, తాగు నీళ్లు, టాయిలెట్ల సౌకర్యం ఉండదు. ఇలా ప్రభుత్వ విద్య పూర్తిగా సమస్యలకు నిలయంగా మారితే.. నాణ్యమైన విద్య పిల్లలకు ఎలా అందుతుంది. విద్య ప్రాథమిక విద్యార్థిలో దాగి ఉన్న జ్ఞానాన్ని వెలికి తీయడం, అందరికీ నాణ్యమైన విద్యను ప్రభుత్వమే అందించాలని భారత రాజ్యాంగం చెబుతున్నది. కానీ పాలకులు విద్యను నిర్లక్ష్యం చేస్తున్నారు. 

పేరుకే సర్కారు వైద్యం

పేదలు ఇంకా పేదలుగానే మిగిలిపోవడానికి గల కారణం ఆరోగ్య సమస్యలు, వాటి కోసం వెచ్చిస్తున్న డబ్బులే. నాణ్యమైన ఆరోగ్య సేవలు ఉచితంగా అందితే.. పేదవారు వృద్ధి చెందే ఆస్కారం ఉంటుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నా.. నాణ్యమైన వైద్యం కోసం ప్రైవేటుకు వెళ్లాల్సిందే. కరోనా మహమ్మారి ప్రజారోగ్య వ్యవస్థ పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యం, నిధుల కేటాయింపులో ఉన్న లోటు పాట్లను స్పష్టంగా బయట పెట్టింది. సర్కారు హాస్పిటల్స్​లో ఎక్కడా మెరుగైన సేవలు అందక, ప్రైవేటులో చేరితే.. లక్షలకు లక్షలు ఫీజుల దోపిడీకి పాల్పడ్డాయి కార్పొరేట్​హాస్పిటల్స్. డబ్బులు పూర్తిగా కట్టనిదే శవాన్ని కూడా బయటకు ఇవ్వని దారుణాలు ఎన్నో వెలుగుచూశాయి. కరోనా తర్వాత అయినా, హాస్పిటల్స్​లో మౌలిక సదుపాయాలు పెంచాలని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు సూచిస్తే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అరకొర వసతులతోనే నడిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి బడ్జెట్ లో కేటాయించే నిధులు నాలుగైదు శాతం దాటడం లేదు.  పేదలు తమ రోగాలను నయం చేసుకోవడానికి ప్రభుత్వ దవాఖానల చుట్టూ తిరుగుతుంటారు. డాక్టర్లు ఉంటే మందులు ఉండవు, మందులు ఉంటే సిబ్బంది ఉండరు, సిబ్బంది ఉంటే వసతులు ఉండవు. ఇలాంటి పరిస్థితిని ఇప్పటికైనా మార్చాలి. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు తెచ్చినా, దాని వల్ల ప్రైవేటు వైద్య రంగ సంస్థలు లాభపడ్డాయే గానీ, పేదలకు జరిగిన మేలు తక్కువే. ఇప్పుడు వీధికో ప్రైవేటు హాస్పిటల్, గల్లీకో డయాగ్నిస్టిక్ సెంటర్ లు వెలిశాయి. టెస్టుల పేరుతో విపరీతమైన ఫీజులు వేస్తూ.. పేదవారి జేబు గుల్ల చేస్తున్నాయి. ప్రభుత్వం ప్రభుత్వ హాస్పిటల్స్​లో సరిపోను మానవ వనరులను, వసతులను సమకూర్చడంతోపాటు, ప్రైవేటు హాస్పిటళ్ల ఫీజులను నియంత్రించాలి. 

ఎన్నికల హామీలు కావాలి

నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందించడం అన్ని పార్టీ ఎన్నికల ప్రణాళికలో భాగం కావాలి. ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చే ప్రభుత్వం వాటిని అమలు చేసి తీరాలి. ఎంతసేపూ, రాజకీయ లబ్ధి కోసమే కాకుండా ప్రజా సంక్షేమం, పేదల అభివృద్ధి కోసం పాటుపడే రోజులు రావాలి. ప్రజలు, యువత, పౌర సమాజం కూడా ఏ పార్టీ ఉచిత విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇస్తుందో వారికే మద్దతు ఇచ్చేలా చైతన్యం పొందాలి. అప్పుడే సమసమాజ స్థాపన సాధ్యపడుతుంది.

- నారగోని ప్రవీణ్ కుమార్ఉచిత విద్య, వైద్య సాధన సమితి