చకచకా సాగుతున్న టూరిస్టు స్పాట్ల అభివృద్ధి పనులు

చకచకా సాగుతున్న టూరిస్టు స్పాట్ల అభివృద్ధి పనులు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీలో మానేరు రివర్ ఫ్రంట్ పేరిట చేపట్టిన టూరిస్టు స్పాట్ల అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయి. ఆగస్టు 15లోగా పనులు పూర్తి చేసి ప్రారంభించాలని మంత్రి గంగుల కమలాకర్ నిర్ణయించడంతో పనుల్లో స్పీడ్ పెంచారు. ప్రస్తుతం రిటెయినింగ్ వాల్ నిర్మాణం, బండ్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. మెయిన్ రోడ్డు నుంచి రివర్ ఫ్రంట్ కు వెళ్లే రోడ్లు 15 నుంచి 30 ఫీట్ల వరకే ఉండడంతో రోడ్ల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణం కోసం భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రివర్ ఫ్రంట్ లో మౌలిక వసతుల కల్పించడం, రెస్ట్ అండ్ రిక్రియేషన్ సెంటర్ కోసం అదనంగా 2.26 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఇందులో 621 సర్వే నంబర్ లో 14 గుంటలు, 622 లో 2.07 ఎకరాలు, 627లో 5 గుంటలు సేకరించనున్నట్లు నోటిఫికేషన్ పేర్కొన్నారు. ఆయా సర్వేనంబర్లలో సుమారు 40 మందికి చెందిన ఓపెన్ ప్లాట్లు ఎఫెక్ట్ కానున్నాయి. 

3.75  కిలో మీటర్లు మేర థీమ్ పార్కులు 

మానేరు తీరాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు మొత్తం రూ.410 కోట్లతో ప్రభుత్వం మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ రూ.310 కోట్లు, టూరిజం డిపార్ట్ మెంట్ రూ.100 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో నదికి ఇరువైపులా 3.75 కిలోమీటర్ల మేర ల్యాండ్ స్కేపింగ్, హార్డ్ స్కేపింగ్, స్ట్రీట్ స్కేపింగ్, థీమ్ గార్డెన్స్, గెజిబోస్, స్ట్రీట్ ఫర్నిచర్, ఆకట్టుకునే శిల్పాలు, వాటర్ ఫ్రంట్ ప్రాంతం చుట్టూ ఫెన్సింగ్, వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ నిర్మాణం, మల్టీమీడియా షో, లేజర్ షోలు, మ్యూజికల్ ఫౌంటెన్స్, ఓపెన్ ఎయిర్ థియేటర్లు, జిప్ లైన్, రాక్ క్లైంబింగ్, జిప్ సైక్లింగ్ తదితర అడ్వెంచర్ యాక్టివిటీస్, పిల్లలకు ఇండోర్, అవుట్ డోర్ ప్లే గ్రౌండ్స్, పార్టీ జోన్, యోగా, ధ్యానం చేసేందుకు వెల్ నెస్ జోన్, ఫుడ్ కోర్టులు, వాష్ రూమ్ కాంప్లెక్స్ లు, స్విమ్మింగ్ పూల్, ఫ్లోటింగ్ జట్టీలు, వాటర్ స్పోర్ట్స్, బోటింగ్ ఏర్పాటు కానున్నాయి. ఈ ఏరియాను అడుగడుగునా సీసీ టీవీ కెమెరాలతో కవర్ చేయనున్నారు. 

హైలెట్ గా నిలవనున్న ఫౌంటెన్, కేబుల్ బ్రిడ్జి.. 

మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా నదిలో ఏర్పాటు చేయబోయే వాటర్ ఫౌంటెన్, కేబుల్ బ్రిడ్జి హైలైట్ గా నిలవబోతుంది. దక్షిణ కొరియాలోని సియోల్ లో,  చైనాలోని షాంఘైలో అతి పెద్ద ఫౌంటెన్ల తర్వాత అతి పెద్ద ఫౌంటెన్ కరీంనగర్ లోనే ఏర్పాటు అవుతుండడం గమనార్హం. నీటి మీద 100 మీటర్ల ఎత్తున నిర్మించనున్న ఈ ఫౌంటెన్ రాత్రి పూట కలర్ ఫుల్ లైటింగ్ తోపాటు,  మ్యూజిక్ కు అనుగుణంగా 200 మీటర్ల ఎత్తులో నీళ్లు ఎగిసిపడడం టూరిస్టులను ఆకట్టుకోనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జిపై కిలోమీటర్ దూరంలో ఉన్న వారికి కూడా కనిపించేలా నాలుగు భారీ ఎల్ ఈడీ స్ర్కీన్లను ఏర్పాటు చేయనున్నారు.