‘మహా’ ట్విస్టులు: మూడు రోజుల్లోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా

‘మహా’ ట్విస్టులు: మూడు రోజుల్లోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా

మహారాష్ట్ర రాజకీయంలో పూటకో మలుపు తిరుగుతోంది. తమకు 170 మంది ఎమ్మెల్యేల బలం ఉందని ప్రకటించిన బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ మూడు రోజుల్లోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. సుప్రీం కోర్టు బుధవారమే బలనిరూపణ చేసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టిన ఆయన ఈ విషయాన్ని చెప్పారు. మీడియా సమావేశం ముగిశాక గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖను అందిస్తానని చెప్పారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల డిప్యూటీ సీఎం పదవికి అజిత్ పవార్ రాజీనామా చేసినట్లు తనతో చెప్పారని ఫడ్నవిస్ తెలిపారు. అజిత్ తప్పుకున్నాక తమకు బలం లేనందున తాను సీఎం పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పారాయన.

తాము ఎమ్మెల్యేల కొనుగోలు లాంటి పనులకు విరుద్ధమని, ఏ పార్టీనీ తాము బ్రేక్ చేయాలని అనుకోలేదని అన్నారు ఫడ్నవిస్. కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన మూడు పార్టీలు కలిసి ఏర్పాటు చేయబోతున్న త్రీవీల్ ప్రభుత్వం స్థిరంగా ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. ఆ పార్టీల మధ్య సిద్ధాంతపరమైన తేడాలు ఉన్నాయన్నారు. అయితే బీజేపీ సమర్థంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందన్నారు. ప్రజల సమస్యలపై పోరాడుతామని చెప్పారు. కానీ, బీజేపీని అధికారానికి దూరం చేయాలన్నదే ఆ పార్టీల ఏకైక లక్ష్యమని అన్నారు. కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేది ఉత్త కంటితుడుపు చర్చ అని చెప్పారు ఫడ్నవిస్.

శివసేన ముందే చెప్పింది

సీఎం పదవి ఎవరు ఇస్తే వారితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని.. ఎన్నికల ఫలితాలు వచ్చే ముందే శివసేన తమకు చెప్పిందన్నారు దేవేంద్ర ఫడ్నవిస్. ఎన్నికల్లో తమ రెండు పార్టీలూ పోటీ చేయగా, బీజేపీకే 70 శాతం అంటే 105 సీట్లు వచ్చాయని అన్నారు. ప్రజలు బీజేపీనే కావాలని  కోరుకున్నారని చెప్పారాయన. మహారాష్ట్ర ఓటర్లు తమ రెండు పార్టీలకు కలిపి తీర్పు ఇచ్చారని, శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తాము ఎదురుచూశామని చెప్పారు ఫడ్నవిస్.  కానీ, శివసేన నుంచి ఎటువంటి స్పందన లేదని ఆరోపించారు. పైగా ఎనాడూ ఠాక్రే గడప కూడా తొక్కని కాంగ్రెస్, ఎన్సీపీ నేతలతో చర్చలు జరిపి వారితో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సిద్దపడిందని అన్నారు. అధికార దాహంతో శివసేన.. సోనియా గాంధీతోనూ పొత్తుకు సిద్ధమైందన్నారు. శివసేన తన హిందుత్వ నినాదాన్ని కూడా ఆమె వద్ద తాకట్టు పెట్టిందని అన్నారు.

MORE NEWS: 

చంద్రయాన్ ఫెయిల్ అయినా.. ఈ సూర్యుడి విజయంపై ధీమా

ఎముకల్లో బలం పెరగాలంటే ఇవి తినాల్సిందే

ఎక్కిళ్లు.. ఎందుకొస్తాయి? సైన్స్ ఏం చెబుతోంది?: రెమిడీ ఏంటీ!

శనివారం ఉదయం 5.47 గంటలకు సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్‌లతో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యరీ ప్రమాణం చేయించిన విషయం తెలిసిందే. బల నిరూపణకు నవంబరు 30 వరకు సమయం ఇచ్చారు గవర్నర్. అయితే అజిత్ పవార్ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లారంటూ ఆయనను శాసనసభాపక్ష నేత పదవి నుంచి తొలగించింది ఎన్సీపీ. బీజేపీకి బలం లేకపోయినా ప్రమాణస్వీకారం చేయించారని, వెంటనే బల నిరూపణకు ఆదేశించాలని మూడు పార్టీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం బుధవారమే బల నిరూపణకు ఆదేశించింది. దీంతో బలపరీక్షకు ముందే ఫడ్నవిస్, అజిత్ పవార్ తమ పదవులకు రాజీనామా చేశారు.