Devi Sri Prasad: తెలుగు, తమిళ్ స్టార్ హీరోలందరి చూపు దేవి శ్రీ ప్రసాద్ వైపే

Devi Sri Prasad: తెలుగు, తమిళ్ స్టార్ హీరోలందరి చూపు దేవి శ్రీ ప్రసాద్ వైపే

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్(Devi Sri Prasad).. ఈ పేరు వింటేనే థియేటర్స్ అన్నీ ఊగిపోతాయి. తన ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజిక్ తో సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లడం మనోడి స్టైల్. సినిమా ఏదైనా, హీరో ఎవరైనా, భాష ఏదైనా తను అందించే మ్యూజిక్ లో మాత్రం తేడా ఉండదు. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా పోస్టర్ పై దేవి పేరుందంటే మ్యూజికల్ హిట్ అవ్వాల్సిందే. అంతలా తన మ్యూజిక్ తో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు దేవి శ్రీ ప్రసాద్. ప్రస్తుతం సౌత్ లో టాప్ అండ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కోనసాగుతున్న దేవి చేతిలో సౌత్ టాప్ స్టార్ హీరోల క్రేజీ సినిమాలున్నాయి. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

లిస్టులో ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ కు దేవి నే సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ లో తన నెక్స్ట్ బీజీఎమ్ తో అదరగొట్టేశాడు దేవి. గబ్బర్ సింగ్ తరువాత హరీష్, పవన్, దేవి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. 

తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప2 సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నారు దేవి. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. పుష్ప పార్ట్ 1లో దేవి అందించిన సంగీతం ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరల్డ్ వైడ్ గా ఉన్న టాప్ స్టార్స్ సైతం దేవి మ్యూజిక్ కి ఫిదా అయ్యారు. దీంతో పుష్ప పార్ట్ 2పై మంచి అంచనాలే ఏర్పడుతున్నాయి.

అక్కినేని నాగ చైతన్య హీరోగా వస్తున్న తండేల్ సినిమాకు కూడా దేవి మ్యూజిక్ అందిస్తున్నాడు. కార్తికేయ ఫేమ్ చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా.. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్నారు. ఇటీవల తండేల్ నుండి విడుదలైన గ్లింప్స్ వీడియోకి, ఆ వీడియోలో దేవి మ్యూజిక్ కి మంచి స్పందన వచ్చింది. 

ఇక తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో వస్తున్న కంగువ సినిమాకు కూడా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పాన్ వరల్డ్ లెవల్లో దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు దేవి మ్యూజిక్ మెయిన్ హైలెట్ కానుంది. రీసెంట్ గా విడుదలైన కంగువ టీజర్ చూస్తే ఆ విషయం క్లియర్ గా అర్థమవుతుంది. ఈ టీజర్ లో దేవి ఇంటెన్స్ మ్యూజిక్ ఆడియన్స్ కు గూస్ బంప్స్ తెప్పించింది అనడంలో ఎలాంటి సందేహంలేదు. 

మరో తమిళ హీరో విశాల్ ప్రధాన పాత్రలో వస్తున్న మాస్ ఎంటర్టైనర్ రత్నం సినిమాలో కూడా దేవి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేయనున్నాడు. మాస్ చిత్రాల దర్శకుడు హరి తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన డోంట్ వర్రీ.. డోంట్ వర్రీ రా మచ్చ అనే సాంగ్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే రేంజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఉండటం కన్ఫర్మ్ గా అనిపిస్తోంది. 

హీరో ధనుష్, దర్శకుడు శేఖర్ కమ్ముల వంటి క్రేజీ కాంబోలో వస్తున్న సినిమా కుబేర. అక్కినేని నాగార్జున కీ రోల్ చేస్తున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. సరికొత్త కథా, కథలనతో వస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాకు కూడా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మధ్యే లాంఛనంగా మొదలైన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 

మరో తమిళ స్టార్ అజిత్ కుమార్ హీరోగా, తెలుగు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాకు కూడా దేవినే మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవలే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన ఈ సినిమా వచ్చేఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరి భాషతో సంబంధం లేకుండా వరుసగా క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న దేవి శ్రీ ప్రసాద్ కు ఈ సినిమాలు ఎలాంటి విజయాన్ని అందిస్తాయో చూడాలి.