
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న నిత్యాన్నప్రసాద వితరణకు ఓ భక్తుడు రూ.25 లక్షల విరాళం అందజేశారు. హైదరాబాద్ కొండాపూర్ కు చెందిన భూపతిరాజు సూర్యనారాయణ రాజు తన మనవడు అనంత్ ఇషాన్ పేరు మీద అన్నప్రసాద వితరణకు విరాళం సమర్పించారు. సోమవారం యాదగిరిగుట్ట ఆలయానికి వచ్చిన ఆయన.. విరాళానికి సంబంధించిన చెక్కును ప్రధానాలయ ముఖ మండపంలోని స్వామివారి ఉత్సవమూర్తుల పాదాల చెంత పెట్టి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఈవో క్యాంపు ఆఫీసులో ఆలయ ఈవో వెంకటరావు చేతుల మీదుగా ఆలయానికి విరాళం చెక్కును అందజేశారు. తర్వాత ఫ్యామిలీతో కలిసి దాత గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని తరించారు. అర్చకులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. ఆశీర్వచన మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేసి లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు.