
- ధర్మదర్శనానికి 2 గంటలు, స్పెషల్ దర్శనానికి అరగంట
- ఆదివారం ఒక్కరోజే రూ.35.40 లక్షల ఆదాయం
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. భక్తుల రద్దీ కారణంగా దర్శన, ప్రసాద క్యూలైన్లు, ప్రధానాలయ ప్రాంగణాలు కిటకిటలాడాయి. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు.. కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించి, సత్యనారాయణ వ్రతాలు నిర్వహించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. రద్దీ కారణంగా స్వామివారి ధర్మదర్శనానికి రెండు గంటలు, స్పెషల్ దర్శనానికి అరగంట సమయం పట్టింది.
భక్తులు జరిపించిన నిత్య పూజలు, కైంకర్యాల ద్వారా ఆదివారం ఒక్కరోజే ఆలయానికి రూ.35,40,126 ఆదాయం వచ్చింది. ఇందులో ప్రసాద విక్రయం ద్వారా రూ.15,40,420, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.4.84 లక్షలు, వీఐపీ దర్శనాల ద్వారా రూ.5.40 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.2,47,800 ఇన్‌కం వచ్చినట్లు ఆఫీసర్లు వెల్లడించారు.