మేడారంలో ముందస్తు మొక్కులు.. భారీగా తరలివస్తున్న భక్తులు

మేడారంలో ముందస్తు మొక్కులు..   భారీగా తరలివస్తున్న భక్తులు

గ్రేటర్​వరంగల్‌‌‌‌/జనగామ/తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర దగ్గర పడడంతో ముందస్తుగా మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. శనివారం వనదేవతల దర్శనానికి పోటెత్తారు. ముందుగా జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి, కల్యాణకట్ట వద్ద తలనీలాలు ఇచ్చారు. ఎత్తు బంగారంతో క్యూలైన్లలో గద్దెల వద్దకు చేరుకొని వనదేవతలకు సారె, బెల్లం సమర్పించారు. ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్​రావు వనదేవతలను దర్శించుకున్నారు.

ఎత్తు బెల్లం, సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ఎండోమెంట్ అధికారులు ఆయనకు స్వాగతం పలికి, పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో అధికారులు జంపన్న వాగులోని ట్యాపులన్నింటికీ నీటి సప్లయ్​ఇచ్చారు. జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు నిరంతరం కొనసాగుతున్నాయి. ఎండోమెంట్ అధికారులు భక్తుల కోసం క్యూ లైన్లలో చలువపందిళ్లు ఏర్పాటు చేశారు.

బైక్‌‌‌‌ అంబులెన్స్‌‌‌‌ సేవలు షురూ..

మహా జాతర కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బైక్​ అంబులెన్స్(108)లను మంత్రి సీతక్క శనివారం మేడారం గిరిజన మ్యూజియంలో జెండా ఊపి ప్రారంభించారు. అంతకు ముందు మేడారం హరిత హోటల్​లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. 21 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న మహాజాతరలో తాగునీటి కొరత లేకుండా చూడాలన్నారు.  

టాయిలెట్స్ ఎప్పటికప్పుడు క్లీన్​ చేయాలని సూచించారు. పార్కింగ్, మరుగుదొడ్లను సూచిస్తూ బోర్డులు  ఏర్పాటు చేయాలన్నారు. 24 /7 వైద్య సేవలు అందుబాటులో ఉండాలని, సరిపడా మెడిసిన్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అనంతరం మేడారం ఇంగ్లీష్ మీడియం స్కూల్​లో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా మీడియా ప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనంలో  మంత్రి సీతక్క పాల్గొన్నారు. సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాన్ని, మీడియా టీషర్ట్​లను  జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీశ్​తో కలిసి ఆవిష్కరించారు.  జాతరను విజయవంతం చేయడంలో మీడియా కీలక పాత్ర పోషించాలన్నారు.  జాతరలో మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా మీడియా సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. అనంతరం మేడారం జాతర రూట్ మ్యాప్​, వీడియోలను రిలీజ్ చేశారు.