
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న ఆలయం సోమవారం భక్తులతో రద్దీగా మారింది. పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తొలుత ధర్మగుండంలో పవిత్రస్నానాలు ఆచరించారు. అనంతరం తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ధర్మదర్శనం, ప్రత్యేక దర్శనం, కోడెమొక్కు క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం స్వామిని దర్శించుకునేందుకు వీలుగా ఆదివారం సాయంత్రమే భక్తులు వేములవాడకు భారీగా చేరుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో రమాదేవి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
రాజన్న సేవలో హాకీ క్రీడాకారిణి
వేములవాడ రాజన్నను నిజామాబాద్ జిల్లాకు చెందిన హాకీ నేషనల్ ప్లేయర్ యెండాల సౌందర్య దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అర్చకులు ఆశీర్వచనం, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఘనంగా కోజాగరి పౌర్ణమి వేడుకలు
వేములవాడ రాజన్న ఆలయంలో సోమవారం రాత్రి కోజాగరి పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాల మధ్య కౌముదినీ పూజ నిర్వహించారు. మహాలక్ష్మీ పూజ, క్షీరచంద్ర పూజ (కోజాగరి వ్రతం) నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు కోజాగరి వ్రత విశిష్టతను భక్తులకు వినిపించారు. అనంతరం ఆలయ ఆవరణలో పెద్దపాత్రలో ఉంచిన పాలలో దర్శనమిచ్చిన చంద్రుడుని భక్తులు తిలకించి తరించారు.