తెరిపిచ్చిన వాన.. క్యూ కట్టిన భక్తులు

తెరిపిచ్చిన వాన.. క్యూ కట్టిన భక్తులు
  • కిటకిటలాడిన యాదగిరిగుట్ట 
  • స్వామివారి దర్శనానికి 2.30 గంటల టైం

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షం ఆదివారం తెరిపివ్వడంతో.. హైదరాబాద్ సహా రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు యాదగిరిగుట్టకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.  కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, సత్యనారాయణస్వామి వ్రత మండపాలు, కొండపైన బస్ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు, ప్రధానాలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయాయి. స్వామివారి ధర్మదర్శనానికి రెండున్నర గంటలు, స్పెషల్ దర్శనానికి అరగంటకు పైగా సమయం పట్టింది.

భక్తులు స్వామి,అమ్మవార్ల నిత్యకల్యాణం, సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవ పూజలతో మొక్కులు చెల్లించుకున్నారు.  పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం ఆలయానికి రూ.28,00,324 ఆదాయం సమకూరింది. ప్రసాద విక్రయం ద్వారా రూ.11,25,400, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.3.50 లక్షలు, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.2,78,500, బ్రేక్ దర్శనాలతో రూ.2,69,400, వీఐపీ దర్శన టికెట్ల ద్వారా రూ.2.10 లక్షల ఇన్ కమ్ వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు వెల్లడించారు.