
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి శనివారం పలువురు భక్తులు వెండి కలశాలు, వెండి ఏకహారతి, వెండి ధూప హారతిని సమర్పించారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ కు చెందిన బిరదవోలు వరశ్రీ అనే భక్తురాలు స్వామివారికి ఏడు కిలోల వెండితో చేసిన 11 కలశాలు, ఒక ఏకహారతి, ఒక ధూప హారతి స్వామివారికి సమర్పించగా, హైదరాబాద్ కు చెందిన డాక్టర్ బీవీఎస్ రాంప్రసాద్ సుమారుగా కిలో వెండితో చేసిన రెండు కలశాలు అందజేశారు. దాతలు ప్రధానాలయ ముఖ మంటపంలో స్వామివారి ఉత్సవమూర్తుల పాదాల చెంత పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో భాస్కర్ రావు చేతుల మీదుగా వెండి కలశాలు, హారతి పాత్రలను ఆలయానికి అందజేశారు.
స్వామివారి సేవలో గుజరాత్ హైకోర్టు జడ్జి..
యాదగిరిగుట్ట నరసింహస్వామిని గుజరాత్ హైకోర్టు జడ్జి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ దర్శించుకున్నారు. గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ముఖమంటపంలో స్వామివారి ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చకులు స్వాగతం పలికి దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ ఈవో భాస్కర్ రావు లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేసి నారసింహుడి ఫొటోను బహూకరించారు.