
జయశంకర్ భూపాలపల్లి, మహాదేవ్‌పూర్, వెలుగు : సరస్వతి పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. శనివారం ఒక్కరోజే 2.5 లక్షల మంది పుష్కరాలకు వచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు. సుమారు 25 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినప్పటికీ నడిచివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. సరస్వతీ మాతకు గాజులు, కుంకుమ, పసుపు, చీర, సారెలు అర్పించారు. ఆలయంలో కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
గుడిలో విధులు నిర్వహిస్తున్న ఫారెస్ట్ సిబ్బంది ఒకరు ఫిట్స్ వచ్చి పడిపోగా రెస్క్యూ టీం సిబ్బంది తక్షణ సహాయక చర్యలు అందించారు. ఈ ఒక్క రోజే 370 బస్సుల్లో 60 వేల మంది భక్తులు కాళేశ్వరం చేరుకున్నారని ఆర్టీసీ సిబ్బంది చెప్పగా, 10 రోజుల్లో 5 వేల మందికి యునాని వైద్యం అందించామని ఆర్గనైజర్ కోట శ్రీనివాస్ తెలిపారు. -