ఆధ్యాత్మికం: సహజ స్వభావం... శత్రువుల కష్టాలను ఆనందిస్తే ఏమవుతుందో తెలుసా..

ఆధ్యాత్మికం: సహజ స్వభావం... శత్రువుల కష్టాలను ఆనందిస్తే ఏమవుతుందో తెలుసా..

ధనధాన్యపుత్త్రబాంధవ
జనలాభంబులును తలప సరిగావు 
సుఖంబున దాను దనరి శత్రువులు ఘనతర 
దుఃఖములనుండ గని యలరుటకున్‌‌

( ఆంధ్ర మహాభారతము, అరణ్యపర్వం. పంచమాశ్వాసము 348 వ పద్యం)


తనకు ధనం ఉండవచ్చు. ధాన్యాలు ఉండవచ్చు. బంధువులు తనతో సహకరించవచ్చు. ఇది గొప్ప సంతోష యోగం కాదు. తాను సౌఖ్యాలతో విలసిల్లుతున్నప్పుడు తన విరోధులు విపరీతంగా కష్టాలు అనుభవిస్తుండగా చూడటమే నిజమైన సంతోషయోగం. తనకు కలిగే మేలు కంటే శత్రువులకు కలిగే కీడు మాత్రమే అచ్చమైన ఆనందాన్ని కలిగిస్తుంది.. అంటూ కర్ణుడు.. దుర్యోధనుడికి దుర్బోధ చేయటం ప్రారంభించాడు.

ఇంకా... 

కౌరవులకు అధినేతవైన ఓ దుర్యోధన సార్వభౌమా! సుకుమార సుందరమైన జిలుగు పట్టువస్త్రాలు కాక, ముదురు నారచీరలు ధరించి భయంకరమైన అడవిలో నివసిస్తూ, కందమూలఫలాలు తింటూ, నికృష్ట జీవితాన్ని గడుపుతున్నాడు అర్జునుడు. ఇక మనమా, దేదీప్యమానంగా వెలుగొందే భోగభాగ్యాలను అనుభవిస్తున్నాం. మనం ఇప్పుడు అర్జునుడి దైన్యాన్ని కనులారా చూడటం కంటె మన జీవితాలకు ఇంకొక ధన్యత్వం కలుగుతుందా... అంటూ తన దురాలోచనలను కొనసాగించాడు కర్ణుడు.

తాము బాగున్నప్పటికీ, తమ శత్రువు కష్టాలు పడుతూ, నాశనం అయిపోవాలని కోరుకుంటారు దురాలోచన కలిగినవారు. ధర్మరాజుతో కపట ద్యూతం ఆడి, వారిని అడవులపాలు చేసినప్పటికీ, ఇంకా ద్వేషం తగ్గని దుర్యోధనుడు.. వారు ద్వైతవనంలో ఉన్నారని తెలుసుకొని, ఏ విధంగానైనా వారిని అవమానించాలనుకున్నాడు.  అందుకు కర్ణుడి దుష్ట సలహా తోడయ్యింది.

గోవులను సంరక్షించేందుకు ద్వైతవనానికి వెళ్లడానికి ధృతరాష్ట్రుడి అనుమతి తీసుకుని, మందీమార్బలంతో ద్వైతవనానికి చేరుకున్నాడు. అక్కడ ఒక సరోవరం సమీపంలో కుటీరం నిర్మించమని సేవకులకు చెప్పాడు. అది చిత్రసేనుడనే గంధర్వుడు నివసించే ప్రాంతం. దుర్యోధనుడు అహంకారంతో చిత్రసేనుడితో యుద్ధానికి తలపడ్డాడు. వారి చేతిలో భంగపడ్డాడు. 

ఘోష యాత్ర సమయంలో... దుర్యోధనాదులంతా వారి వారి భార్యలతో గంధర్వుల చేతికి చిక్కినట్లు కౌరవ సైన్యం ద్వారా తెలుసుకున్నాడు ధర్మరాజు.  వారిని రక్షించమని శరణు వేడారు .  అది విన్న ధర్మరాజు తక్షణమే వెళ్లి వారిని విడిపించి రమ్మని భీమునితో పలికాడు. అందుకు భీముడు, ‘అన్నయ్యా! వారు పుట్టినది మొదలు మనకు ఎంతో కీడు తలపెట్టారు. వారు హాని చేయని రోజు ఒక్కటి కూడా లేదు.

 అటువంటివారికి సహాయం చేయడం వలన మనకు నష్టమే కదా’ అన్నాడు. అందుకు ధర్మరాజు, ‘భీమా! శరణాగతులను రక్షించడం రాజ ధర్మం. నువ్వు ఎంతో బలం కలిగినవాడివి. నీ ఎదుట ఎవ్వరూ నిలబడలేరు. అందువల్ల నువ్వు... అర్జున, నకుల, సహదేవులను వెంట పెట్టుకుని వెళ్లి, మన దాయాదులైన దుర్యోధనాదులను విడిపించి రా’ అని పలికాడు. అన్నగారి మాటలకు మారుమాటాడకుండా.. భీముడు... తన ముగ్గురు తమ్ములతో కలిసి వెళ్లి, కౌరవులను విడిపించి హస్తినకు పంపాడు. 

పాండవుల నాశనం చూడాలనే దుర్బుద్ధితో వచ్చిన కౌరవులను... చివరకు ఆ పాండవునే రక్షించారు. 
అనగనగా ఒక మహర్షి ఉండేవాడు. ఆయన రోజూ ఒక నదిలో స్నానం చేసి ఒడ్డున కూర్చుని సూర్యునికి నమస్కరించేవాడు. . ఒకరోజున ఆయన చేతిలోకి నీటిని తీసుకుని  నమస్కరిస్తూ ఉండగా నీటిలో  ఒక తేలు కనపడింది.  ఆయన తేలును రక్షించాలని చేతిలోకి  తీసుకున్నాడు. ఆ తేలు  ఆయనను గట్టిగా కుట్టి బాధించింది. ఆ మహర్షి తేలును దూరంగా వదిలేశాడు. మళ్లీ చేతిలోకి తీసుకున్నాడు.  మళ్లీ  ఇలాగే జరిగింది. ఈ విధంగా చాలాసార్లు జరగటం చూసిన ఒక బాలుడు మహర్షి దగ్గరకు వచ్చి, ‘స్వామీ! అది ప్రతిసారి మిమ్మల్ని కుడుతుంటే మీరు దానిని ఎందుకు రక్షించాలని చూస్తున్నారు’ అని  ప్రశ్నించాడు. అందుకు ఆ మహర్షి నవ్వుతూ, ‘చూడు నాయనా! కుట్టడం తేలు లక్షణం, ప్రాణులను రక్షించడం సాధువు లక్షణం. అది దాని స్వభావం. ఇది నా స్వభావం. మన స్వభావాన్ని మనం విడిచిపెట్టకూడదు’ అని చిరునవ్వుతో సమాధానమిచ్చాడు. ఆ మాటలు విని ఆ బాలుడు అక్కడ నుండి వెళ్లిపోయాడు.

‘తేలు – మహర్షి’ కథలో – తేలుకి కుట్టడం, మహర్షికి రక్షించడం అలవాటు. కౌరవులకు అన్యాయాలు చేయడం, ధర్మరాజుకి ధర్మబద్ధంగా ఉండడం అలవాటు. ఎవ్వరూ వారి స్వభావాన్ని విడిచిపెట్టలేరని పెద్దలు చెబుతారు. పుట్టుకతో వచ్చిన బుద్ధులు, పుడకలతోనే పోతాయనే సామెత తెలిసిందే.

- డా. పురాణపండ వైజయంతి-