ఒక్కడె చాలు నిశ్చల బలోన్నతుడెంతటి కార్యమైన దా
జక్కనొనర్ప గౌరవు లసంఖ్యులు పట్టిన ధేనుకోటులం
చిక్కగనీక తత్ప్రబల సేన ననేక శిలీముఖంబులన్
మొక్కవడంగ జేసి తుది ముట్టడె యొక్క కిరీటి భాస్కరా
నిశ్చలమైన బలం కలిగినవాడు, ఉన్నత వ్యక్తిత్వం కలవాడు ఒక్కడైనా ఎంతటి గొప్ప కార్యమైనా చక్కగా పూర్తి చేయగలడు. ఎందరో కౌరవ వీరులు పట్టుకుపోతున్న గోవులను అర్జునుడు ఒక్కడే తన బాణాలతో ఆ బలమైన సైన్యాన్ని ఓడిపోయేలా చేసి ఆ పని జయప్రదంగా ముగించలేదా... అంటాడు భాస్కర శతక కారుడు మారద వెంకయ్య ఈ పద్యంలో మనలో బలం, ధైర్యం ఉంటే ... ఒక పనిని పూర్తి చేయడానికి ఏ ఒక్కరి సహాయమూ అవసరం లేదు. ఒక పనిని పూర్తి చేయలేకపోతే.. దానికి ఇతరులను సాకుగా చూపకూడదు. నిశ్చలమైన, దృఢమైన ఆత్మ విశ్వాసం కలిగి ఉంటే విజయం తప్పక వరిస్తుంది.
ఒక్కోసారి జీవితంలో మనకు ఎవ్వరూ సహాయం చేయడం లేదని అనిపిస్తుంది. ఏదో మంచి పని చేద్దామంటే ఎవరూ సహకరించడం లేదని అనుకుంటాం. కానీ సమర్థునికి ఎవరి సహాయం అక్కర్లేదు. ఆత్మవిశ్వాసం కలిగిన వాడు తోడు కోసం చూడకుండా, ఎంతటి కార్యమైనా సాధించగలడు. ఇతరుల సహకారం కోసం ఎదురుచూడకుండా, స్వశక్తి మీద నమ్మకంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతున్నాడు.
ఒక మంచి పనిని ప్రారంభించి పూర్తి చేయాలనుకున్నప్పుడు ఆటంకాల గురించి ఆలోచించకూడదు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా నిశ్చలమైన, ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నవాడు విజయం సాధిస్తాడు. ‘ఎవరూ సహకరించలేదు‘ అని నిందించడం మానేసి, చేయాలనుకున్న పనిని ఎలా పూర్తి చేయాలో ఆలోచించాలి. అనుకున్న మంచి పనిని చిత్తశుద్ధితో పూర్తి చేయడం గొప్ప ఆత్మసంతృప్తిని ఇస్తుంది.
అనగనగా ఒక ఊరిలో పరంధామయ్య అనే ఒక రైతు ఉన్నాడు. అతడికి ముగ్గురు కొడుకులు ఉన్నారు. భార్యాబిడ్డలతో ఆ రైతు ఒక పూరిపాకలో నివాసం ఉంటున్నాడు. ఆ ఇల్లు కట్టుకుని అప్పటికి పాతిక సంవత్సరాల పైనే అయింది. ఎండకు, వానకు ఆ ఇంట్లోనే ఉంటున్నారు.
వానాకాలం వస్తుంటే మాత్రం రైతు భయపడుతుండేవాడు. అనుకున్నట్లుగానే ఆ సంవత్సరం వానాకాలంలో ఏకబిగిన వర్షాలు పడటం మొదలైంది. వర్షపు నీరు కురిసి ఇల్లంతా నీటిలో మునిగిపోయింది. దానితో ఆ రైతు తన ఇంటికి మరమ్మతులు చేసుకోవాలనుకున్నాడు. అందుకోసం పొరుగు గ్రామం నుంచి పనివారిని పిలిచాడు. వారం రోజులు గడిచిపోతున్నా పనివారు రావటం లేదు. మళ్లీ వర్షం వస్తుందేమోనని భయపడుతున్నాడు రైతు.
ఇక లాభం లేదనుకుని మరో గ్రామం నుంచి పనివారిని అడిగాడు. వారు కూడా వస్తామని చెప్పి, వారం గడిచినా రాలేదు. ఇలా పదిహేను రోజులు గడిచిపోయాయి. ఆ రైతు అదృష్టం బాగుండి ఈ పదిహేను రోజులూ వర్షం కురవలేదు. ఎంత త్వరగా ఇంటిని బాగు చేసుకుంటే అంత మంచిదని భావించాడు.
ఒకనాడు సంతకు వెళ్లి తాటాకులు, కర్రలు... ఇంటి కప్పుకి కావలసినవన్నీ కొని తీసుకువచ్చాడు. తన ముగ్గురు కొడుకులను పిలిచాడు. ఒక్కొక్కరికి ఒక్కో పని అప్పచెప్పాడు. వారం రోజుల్లో తన ఇంటిని కొత్త ఇంటిగా మార్చుకున్నాడు. ఇక వర్షం వచ్చినా భయం లేదనుకున్నాడు. ఎవరి మీదైనా ఆధారపడితే పనులు జరగవని గ్రహించిన ఆ రైతు, తన కుమారుల సహాయంతో ఆ పని పూర్తి చేసుకున్నాడు.
భగీరథుని కథ తెలిసిందే...
దేవ లోకం నుంచి గంగానదిని భూమి మీదకు తెప్పించటం కోసం భగీరథుడు ఒంటరిగానే కఠోర తపస్సు చేశాడు. ఆతడి తపస్సుకు మెచ్చిన గంగ భగీరథుని వెంట భూమి మీదకు రావడానికి అంగీకరించింది. అలా భగీరథుడు ఒంటరిగానే తను అనుకున్న పనిని నెరవేర్చుకోగలిగాడు.
పక్షులు తమ గూళ్లను ఒంటరిగానే నిర్మిస్తాయి. ఆడ పక్షులు గుడ్డు పెట్టే సమయానికి మగ పక్షులు గూళ్ల నిర్మాణం పూర్తి చేస్తాయి. ఎవరో వచ్చి వాటికి గూడు నిర్మించాలనుకోవు. వాటి స్వశక్తి మీద ఆధారపడతాయి.
‘ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా’ అన్నాడు శ్రీశ్రీ. సాధ్యమైనంతవరకు ఇతరుల మీద ఆధారపడకుండా, మన పనిని మనం చేసుకోవడమే ఉత్తమమని పండితులైనవారందరూ చెబుతున్నారు.
- డా. పురాణపండ వైజయంతి-
