పిల్లల భద్రత, విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి :డీజీపీ అభిలాష బిస్తూ

పిల్లల భద్రత, విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి :డీజీపీ అభిలాష బిస్తూ
  • ఉమెన్ సేఫ్టీ వింగ్ రాష్ట్ర డీజీపీ అభిలాష బిస్తూ

నల్గొండ, వెలుగు:  పిల్లలు సురక్షితంగా ఉంటేనే సమాజం సురక్షితంగా ఉంటుందని, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత, విద్య, విలువల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఉమెన్ సేఫ్టీ వింగ్ రాష్ట్ర డీజీపీ అభిలాష బిస్తూ పిలుపునిచ్చారు. శనివారం నల్గొండ జిల్లా కనగల్లు మండలం, చెర్లగౌరారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బాల పంచాయతీ' కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

చిన్నప్పటి నుంచే పిల్లలకు చదువుతో పాటు నైతిక విలువలు నేర్పించాలని, భవిష్యత్​లో వారు క్రీడలు, కళలు తదితర అన్ని రంగాల్లో రాణించి దేశాభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు. బాల పంచాయతీలో విద్యార్థులు తమ గ్రామంలోని చెత్త సమస్య, పాఠశాలకు బస్సు సౌకర్యం, కొత్త భవనం, ఆట స్థలం లాంటి అవసరాలను భయపడకుండా ధైర్యంగా ప్రస్తావించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. సీఎస్‌‌‌‌‌‌‌‌ఆర్ నిధుల ద్వారా పాఠశాల అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు.