
- భూరికార్డులను ఆ కంపెనీకి చెందిన టెర్రాసిస్‌కు అప్పగించిన సర్కారు
- టెర్రాసిస్ టెక్నాలజీస్‌ను టేకోవర్ చేసిన ఫిలిప్పీన్స్ కంపెనీ
- ఇప్పటికే ధరణిపై వేలాది ఫిర్యాదులు
- భూములమ్ముకోలేక రైతుల అవస్థలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వ్యవసాయ భూముల రికార్డుల నిర్వహణకు ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి సాఫ్ట్‌వేర్ భద్రతపై అనుమానాలు తలెత్తుతుతున్నాయి. లక్షలాది మంది రైతులకు సంబంధించిన భూరికార్డుల మెయింటేనెన్స్‌ను ఒక దివాళా జాబితాలో ఉన్న సాఫ్ట్‌వేర్ సంస్థ చేతిలో పెట్టడం, ఆ సంస్థను ఇటీవల ఫిలిప్పీన్స్ సంస్థ టేకోవర్ చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ధరణి పోర్టల్‌ను ప్రభుత్వమే నిర్వహిస్తున్నట్లు చెప్తున్నా.. భూరికార్డుల ప్రక్షాళన టైం నుంచి ఇప్పటిదాకా ఆ పోర్టల్‌ను ఓ ప్రైవేట్ సాఫ్ట్‌వేర్ కంపెనీ మెయింటేన్ చేస్తుండడం, అది కూడా పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సంస్థ కావడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో అనేక దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థలు ఉండగా.. బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టి డిఫాల్టర్ జాబితాలో ఉన్న ఐఎల్ఎఫ్ఎస్ అనుబంధ టెర్రాసిస్ కంపెనీ చేతుల్లో రైతుల భూరికార్డులు పెట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ధరణిలో తమ పేర్లు లేవని, సర్వే నంబర్లు, భూముల విస్తీర్ణం మాయమైందని కొన్ని నెలలుగా వేలాది మంది తహసీల్దార్, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో భూముల డేటా ప్రైవసీ ప్రశ్నార్థకంగా మారింది. భవిష్యత్‌లో ఎప్పుడైనా భూరికార్డుల ట్యాంపరింగ్ జరిగితే బాధ్యులు ఎవరని, సామాన్య రైతుల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నాలుగేళ్లుగా ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీ చేతుల్లోనే
రాష్ట్ర ప్రభుత్వం 2017 సెప్టెంబర్‌లో భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టింది. మాన్యువల్‌గా ఉన్న రికార్డులన్నింటినీ ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఐఎల్ఆర్ఎంఎస్) అనే పోర్టల్‌లో ఎంట్రీ చేశారు. ఇదే పోర్టల్ అనధికారికంగా అప్పట్లో ధరణిగా చలామణీ అయ్యింది. తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులు ఈ పోర్టల్‌లో లాగిన్ అయి భూరికార్డులను ఎంట్రీ చేసి కొత్త పాస్ బుక్స్ జారీ చేశారు. అయితే ఈ పోర్టల్ నిర్వహణను ప్రభుత్వం అప్పట్లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్(ఐఎల్ఎఫ్ఎస్) అనే సాఫ్ట్‌వేర్ సంస్థకు అప్పగించింది. వివిధ ప్రభుత్వ రంగ వెబ్‌సైట్స్‌ను మెయింటేన్ చేస్తున్న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ), టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి దిగ్గజ సంస్థలు ఉండగా.. ఐఎల్ఎఫ్ఎస్‌కు రికార్డుల నిర్వహణను అప్పగించడంపై అప్పట్లో విమర్శలు వినిపించాయి. ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీ తన అనుబంధ టెర్రాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ ద్వారా రాష్ట్రంలోని ధరణి పోర్టల్‌తోపాటు బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ సిస్టమ్‌లను నిర్వహిస్తోంది.
99 వేల కోట్లు ఎగ్గొట్టిన ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీ?
ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీ బ్యాంకులకు సుమారు రూ.99 వేల కోట్లు ఎగ్గొట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. రెండేళ్లుగా విడతలవారీగా అప్పులు చెల్లిస్తూ వస్తున్న ఈ సంస్థ.. ఇటీవల టెర్రాసిస్ టెక్నాలజీస్‌లోని 52.26 శాతం వాటాను రూ.1,275 కోట్లకు ఫిలిప్పీన్స్‌కు చెందిన ఫాల్కన్ గ్రూప్‌నకు అమ్మేసింది. అంటే మన భూముల రికార్డులు విదేశీ కంపెనీ చేతిలోకి వెళ్లినట్లే. ఆర్థికంగా దివాళా తీసిన సంస్థకు.. సుమారు 70 లక్షల మంది రైతులకు సంబంధించిన కోటిన్నర ఎకరాల భూముల రికార్డులు, ప్రభుత్వ, ఎండోమెంట్, వక్ఫ్, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్లకు చెందిన మరో కోటి ఎకరాల భూముల వివరాలను అప్పగించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ భూముల డేటా బేస్ రక్షణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పోర్టల్‌పై ఎన్నో ఫిర్యాదులు
భూరికార్డుల ప్రక్షాళన సమయంలో వివిధ కారణాలతో సుమారు 15 లక్షల ఎకరాల భూములను పార్ట్ బీలో చేర్చారు. ఏ చిన్న సమస్య ఉన్నా పట్టాదారు పాస్ బుక్ ఇవ్వకుండా పక్కనపెట్టేశారు. దీంతో వీరి పేర్లు, ఈ భూముల వివరాలు ధరణి పోర్టల్‌లో నమోదు కాలేదు. వీరంతా తహసీల్దార్, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. తమ ఆధీనంలో భూమి ఉన్నా ధరణిలో ఎక్కకపోవడంతో అవసరానికి అమ్ముకోలేని దుస్థితి నెలకొంది. పిల్లల చదువులకు, పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులు తీర్చలేక ఆర్థిక ఇబ్బందులతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. మరో వైపు వేలాది సర్వే నంబర్లలోని పట్టాభూములు, మాజీ సైనికుల భూములను ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చింది. ఒక సర్వే నంబర్‌లో కొంత భూమి ప్రభుత్వానిది ఉంటే.. మొత్తం సర్వే నంబర్‌ను ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్టులో చేర్చడంతో ఆ సర్వే నంబర్‌లోని భూమి కలిగిన రైతులు అమ్ముకోలేని దుస్థితి నెలకొంది.
సమాచారం ఎందుకు దాస్తున్నరు?
ధరణి రూపకల్పనకైన ఖర్చు, కేటాయించిన బడ్జెట్, సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన సంస్థ వివరాలు, ఆ సంస్థకు చేసిన చెల్లింపుల సమాచారం, ధరణి పోర్టల్ కోసం పని చేస్తున్న సిబ్బంది, వారి జీతభత్యాల వివరాలు ఇవ్వాలని ఆర్టీఐ కింద భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆర్టీఐ యాక్టివిస్ట్ గంగాధర కిశోర్ కుమార్ ఈ ఏడాది ఫిబ్రవరిలో సీసీఎల్ఏ ఆఫీసులో దరఖాస్తు చేశారు. ఈ సమాచారమంతా ఇవ్వదగినదే అయినప్పటికీ.. దరఖాస్తుదారు అడిగినవి హైపోథెటికల్ క్వశ్చన్స్ కిందికి వస్తాయని, ఈ సమాచారం ఇవ్వలేమని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (పీఐఓ) రిప్లై ఇచ్చారు. దీంతో కిశోర్ కుమార్.. ఫస్ట్ అప్పిలేట్ ఆఫీసర్‌కు దరఖాస్తు చేశారు. అక్కడ కూడా సమాచారం అడిగితే రేపు మాపూ అంటూ జాప్యం చేస్తున్నట్లు తెలిపారు. భూరికార్డుల నిర్వహణ అంతా పారదర్శకంగా ఉంటే ధరణి పోర్టల్ నిర్వహణ గురించిన సమాచారం ఎందుకు దాస్తున్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు.
హ్యాక్ అయితే ఎవరిది బాధ్యత?
హైదరాబాద్‌లో అనేక సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉన్నాయి. అయినా ప్రభుత్వం దివాళా తీసిన ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీని ఎంచుకోవడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. డిజిటల్ రికార్డులకు చట్టబద్ధత కల్పించిన ప్రభుత్వం.. మాన్యువల్ రికార్డులను మాయం చేసే కుట్ర చేస్తోంది. ఒకవేళ వెబ్ సైట్ హ్యాక్ అయితే ఎవరు బాధ్యత వహిస్తారు. ఇప్పుడు ధరణిలో వచ్చే అనేక సమస్యల పరిష్కారానికి మాన్యువల్ రికార్డే ఆధారమవుతోంది. ఇప్పటికైనా ఆర్వోఆర్ చట్టాన్ని సవరించి మాన్యువల్ రికార్డును కూడా నిర్వహించాలి. జమా బందీ చేపట్టాలి.
- మన్నె నర్సింహారెడ్డి, కన్వీనర్, ధరణి భూసమస్యల వేదిక
హియరింగ్ పేరుతో సతాయిస్తున్రు
ధరణి పోర్టల్‌తో లక్షలాది మంది రైతుల జీవితాలు ముడిపడి ఉన్నాయి. అలాంటి పోర్టల్‌ను ఎవరు రూపొందించారు? ఎవరు మెయింటేన్ చేస్తున్నారు? ఎంత ఖర్చు చేశారు? ఎవరు పనిచేస్తున్నారనే సమాచారం తెలుసుకోవాలని ఎవరికైనా ఉంటుంది. ఆ వివరాలు అడిగితే హైపోథెటికల్ ప్రశ్నలంటూ సీసీఎల్ఏ అధికారులు సమాధానం పంపారు. దీంతో ఫస్ట్ ఆప్పిలేట్ అధికారికి అప్లికేషన్ పెడితే.. హైదరాబాద్‌లో హియరింగ్‌కు రావాలని నాకు రెండుసార్లు నోటీసులు పంపారు. పైగా ‘మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ పట్టుకురండి’ అంటూ చూచించారు.
- గంగాధర కిశోర్ కుమార్, ఆర్టీఐ యాక్టివిస్ట్, భద్రాద్రి కొత్తగూడెం