
తెలంగాణ రాష్ట్ర బిల్లుపై ఉభయసభల్లో ‘ది బిల్ ఈజ్ పాస్డ్’ అని మూడు సార్లు అన్నప్పుడు ప్రతి యోధుడి గుండె ఉప్పొంగింది. 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొత్త చరిత్రకు నాంది పలికింది. త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ ఈ ప్రాంత బిడ్డలకు, అట్టడుగు వర్గాల ప్రజలకు అంకితమని కేసీఆర్ అంటున్నపుడు ఎంతో అమాయకంగా అందరి జీవితాలు బాగుపడతయని ఎదురుచూసినం. పాలకుడిగా కొంత సమయం తీసుకుంటడని భావించినం. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ కాదు ఫక్తు రాజకీయ పార్టీ అనగానే అందరి అంచనాలు తలకిందులైనయి. ఇతర పార్టీలో నుంచి టీఆర్ఎస్ లో చేరిన వాళ్లు ఇపుడు కేసీఆర్‌కు ఇష్టులైండ్రు. తెలంగాణ ద్రోహులు క్యాబినెట్లో ఉన్నరు. వీరికి తెలంగాణ యువత ఆశయాలు అర్థం కావు. తెలంగాణ బాధ, గాయాలు ఎట్ల అర్థమయితది.
ప్రతి దాన్ని రాజకీయ కోణంలో చూస్తున్న మాస్టర్ స్ట్రాటజిస్ట్ కేసీఆర్. కేసీఆర్ ఉద్యమ సమయంలో మాట్లాడిన మాటలు ఆ సందర్భం, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన చెప్పిన మాటలు అందరం నమ్మినం. రాష్ట్రం వచ్చాక చింతమడక దొర తెలంగాణ చింతను తొలగిస్తడని ఆశలు పెట్టుకున్నం. దశాబ్దాల ఉద్యమం ఓ కొలిక్కి వచ్చిందని, కొత్త రాష్ట్రం ఏర్పడిందని కొత్త పంచాయితీలు ఎందుకు అని అందరూ కొంత కాలం ఎదరుచూసిండ్రు.
రైతుకు శాపంగా ధరణి
అబద్ధాల ప్రచారంగా దశాబ్ది ఉత్సవాలు మారాయి. ఈ తొమ్మిదేండ్లలో ఐదున్నర లక్షల కోట్ల అప్పులతో రూ.2 లక్షల కోట్లు అవినీతి జరిగిందని అంచనా. కేసీఆర్ తన తొమ్మిదేండ్ల పాలనలో.. శతాబ్ది అంతా కష్టపడ్డా సరిదిద్దలేని విధంగా అన్ని రంగాల్లో తెలంగాణను ధ్వంసం చేశారు. ఉద్యమ కారులు తమకు జరిగిన అన్యాయంతో.. ఇందుకా మనం ఉద్యమం చేసింది అని ఆవేదన చెందుతున్నారు. ఆకాశంలో ఉన్న దేవుడితో అయిన కొట్లాడి నా భూమిని కాపాడుకుంట అని అనుకున్న రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ దొర తీసుకొచ్చిన ధరణి పెద్ద శాపంగా మారింది. భూ రికార్డుల వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. తెలంగాణ ఉద్యమంలో భూముల కోసం ఎన్నో ఆందోళనలు పోరాటాలు జరిగాయి. ఇపుడు ధరణిలో తప్పులు, భూమి గల్లంతు కావటం, ఒకరి భూమి మరొకరి పేరు మీద ఉండటం వంటి ఎన్నో లోపాలు ఉన్నాయి. రైతులు వాటిని సరి చేసుకునేందుకు అరిగోస పడుతున్నరు.
దళిత బంధులో ఎమ్మెల్యేల దోపిడీ
దళిత బంధు లోకల్ ఎమ్మెల్యేలకు కానుకగా మారింది. నిజమైన లబ్దిదారుడికి స్కీమ్‌లో సగమే దక్కుతుంది. సాక్షాత్తూ సీఎం కేసీఆర్ పార్టీ మీటింగ్ లో చెప్పటం అంటే ఎమ్మెల్యేల దోపిడీ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తిరుగుబాటు ధోరిణిలో ఉన్న ఎమ్మెల్యేలను గాడిలో పెట్టేందుకు. తమ వైపుకు తిప్పుకునేందుకు కోవర్ట్ ఆపరేషన్ జరుగుతుందని అనుమానాలు సీఎం వ్యాఖ్యలతో అర్థమయింది. బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన కవిత లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కుంది. ఈ స్కామ్ విచారణ డైలీ సీరియల్ గా సాగుతుంది. దీంతో కేసు దర్యాప్తుపై ప్రజల్లో ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. రాష్ట్రం వస్తే ఎవరికి ఏ సమస్యలు ఉండవన్న కేసీఆర్‌కు ధర్నా చౌక్ లో రోజూ ఆందోళనలు జరుగుతున్నయన్న విషయం తెలియదా? వారి సమస్యలు, వారి ఆర్తనాదాలు ప్యాలెస్‌లాగా కట్టుకున్న అంబేద్కర్ సెక్రటేరియెట్‌లో ఉన్న పాలకులకు వినపడటం లేదా.
పేదలకు ఇంటి జాగా లేదు.. పెద్దలకు వేల ఎకరాలు
ఇండ్ల జాగాల కోసం ఎదురుచూస్తున్న పేదలు, పోడు పట్టాల కోసం తండ్లాడుతున్న గిరిజనులపై పోలీసులు కేసులు పెడుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నాలెడ్జ్ సెంటర్‌కు, హెటిరో పార్థసారథి రెడ్డికి, మైహోం రామేశ్వరావుకు, డొల్ల కంపెనీలకు, అస్మదీయుల ఫౌండేషన్లకు కోట్ల విలువైన భూములు అప్పనంగా ఎందుకు అప్పగిస్తున్నారు. అడవులను నరికేస్తున్న ప్రైవేట్ కంపెనీలు, వ్యక్తులు, మాఫియా.. గ్రీన్ చాలెంజ్ లో చిన్న చిన్న మొక్కలు నాటుతూ పాలకుల దగ్గర మార్కులు కొట్టేస్తున్నాయి. పేదలకు వైద్యం అందివ్వాల్సిన దవాఖానాల భూములను తాకట్టు పెట్టి వేల కోట్ల అప్పులు తీసుకునే దుస్థితికి రాష్ట్రం చేరింది. పెద్ద పెద్ద బిల్డింగ్‌ల ఫొటోలతో ప్రచారంచేస్తూ పబ్లిక్‌ను ఊహాలోకంలో విహరింపచేస్తున్నారు. ఉస్మానియా టవర్స్ ఏమైయినయి.. తొమ్మిదేండ్ల తరువాత పాలకులకు నిమ్స్ విస్తరణ యాదికొచ్చిందా.. ఈ తొమ్మిదేండ్లలో రాష్ట్ర ప్రజలను నయవంచనకు గురిచేస్తూ.. కేసీఆర్ ఫ్యామిలీ రాజ్యాన్ని ఏలుతోంది. ఇపుడు వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నరు. ఉద్యమంలో ఒక్క చాన్స్ ఇయ్యండన్న కేసీఆర్ మాటలతో తొమ్మిదేండ్లు అందరూ మోసపోయిండ్రు.. గోసపడుతున్నరు. ఇపుడు దేశమంతా ఎన్నికలకు ఖర్చు పెట్టేంత సంపాదించుకున్నరు కేసీఆర్.
తెలంగాణ ఆకాంక్ష పాలకులకు, ప్రతిపక్షాలకు మధ్య విడిపోయింది. అయ్యో నన్ను పట్టించుకున్నవారు ఉన్నరా అని బేలగా తెలంగాణ తల్లి చూస్తుంది. రాష్ట్ర ప్రజలకు బంగారు తెలంగాణ కాదు.. సామాజిక న్యాయం ఉన్న, అమరులు కోరుకున్న తెలంగాణ కావాలి. వట్టి మాటల కంటే ఆచరణ ఇపుడు ముఖ్యం. ఆచరణ లేకపోతే అబద్ధాల చక్రవర్తి ఇలాంటి వేడుకలు మరిన్ని చేసుకుంటూనే ఉంటడు. ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమం మరోసారి చేస్తే తప్ప సామాజిక తెలంగాణ సాధ్యం కాదు.
వర్సిటీల ర్యాంకులు కిందకు
కేజీ టు పీజీ ఉచిత విద్య రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు అందుతుందని అందరూ అనుకున్నరు. కానీ రాష్ట్రంలో చదువు భారం అయింది. ఫీజులు కట్టలేక పబ్లిక్ ఇబ్బంది పడుతున్నరు. ఫీజులను కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నది. యూనివర్సిటీలు అభివృద్ధికి నోచుకోలేదు. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌ను భర్తీ చేయలేదు, ప్రతి ఏటా యూనివర్సిటీల ర్యాంకింగ్ కిందకి వెళ్తుంది తప్ప ముందుకు పోవటం లేదు. ఇక, పేపర్ల లీకేజీతో నిరుద్యోగులు గొల్లున ఏడుస్తున్నరు. నీళ్లు, నిధులు, నియామకాల్లో ప్రధాన అంశమైన కొలువులను ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం అయింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ అయిన జాబ్‌లు 50వేలు కూడా లేకపోవటం గమనార్హం. దీంతో నిరుద్యోగులు లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లు, వర్సిటీల్లో ఏండ్ల పాటు చదివిన కష్టం పేపర్ లీకేజ్‌తో వృథా అయింది. ఆదివాసీలకు పోడు పట్టాలు అందలేదు. రైతు బంధు భూస్వాములకు వరంగా మారింది.
డాక్టర్ చెరుకు సుధాకర్ గౌడ్, తెలంగాణ ఉద్యమ కారుడు