- ఐదు రోజుల నుంచి రిజిస్ట్రేషన్లు డెడ్స్లో
- తహసీల్దార్ ఆఫీసుల్లో తిప్పలే తిప్పలు
- గురువారం చాలాచోట్ల ఒక్కటి కూడా కాలే
- స్లాట్ బుక్ చేసుకుని రోజుల తరబడి తిరుగుతున్నరు
- మూడు రోజుల్లో పెరగనున్న ల్యాండ్ మార్కెట్ రేట్లు
- పరేషాన్ అవుతున్న అమ్మకం, కొనుగోలుదార్లు
కరీంనగర్ / నెట్వర్క్, వెలుగు: ధరణి సర్వర్ డౌన్ అయింది. ఈ నెల 24 నుంచి పోర్టల్ సతాయిస్తున్నది. ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణ సర్కార్ ల్యాండ్ మార్కెట్ రేట్లు పెంచుతుండడంతో స్టేట్వైడ్అన్ని జిల్లాల్లో భూముల క్రయ, విక్రయాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో వ్యవసాయ భూములకు సంబంధించి స్లాట్ బుక్ చేసుకొని తహసీల్దార్ ఆఫీసులకు పోతున్న అమ్మకం, కొనుగోలుదారులకు ఐదు రోజులుగా చుక్కలు కనిపిస్తున్నాయి. 15 నిమిషాల్లో పూర్తి కావాల్సిన రిజిస్ట్రేషన్ కు నాలుగైదు గంటలు పడుతోంది. కొన్ని చోట్ల ఒక్కోరోజు 20 నుంచి 30 స్లాట్లు బుక్ చేస్తే, కనీసం 4,5 రిజిస్ట్రేషన్లు కూడా అయితలేవు. చాలాచోట్ల స్లాట్‌బుక్ చేసుకున్న తేదీలోకాకుండా రెండు, మూడు రోజులు ఆలస్యంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. గురువారం చాలా మండలాల్లో ఒక్కటంటే ఒక్క రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. దీంతో కొనుగోలు, అమ్మకం దారులు ఆఫీసుల ముందు పడిగాపులు పడుతున్నారు.
ఇదీ ప్రాసెస్..
భూములు అమ్ముకునే వాళ్లు ధరణి సిటిజన్ లాగిన్ ద్వారా రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుంటారు. సిటిజన్ లాగిన్ లోనే భూమి వివరాలతో పాటు అమ్మే, కొనేవారి వివరాలు, సాక్షుల డీటైల్స్, రిజిస్ట్రేషన్ డేట్ ఆన్లైన్ చేస్తారు. తర్వాత రిజిస్ట్రేషన్ కు అయ్యే స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే తహసీల్దార్ లాగిన్ కు వస్తుంది. తహసీల్దార్ లాగిన్ లో అమ్మకందారు, కొనుగోలుదారు, సాక్షుల సంతకాలు, ఫొటోలు తీసుకొని ధరణి ఆపరేటర్ ఫార్వర్డ్ చేస్తారు. భూముల వివరాలు ఆఫ్ లైన్, ఆన్ లైన్ లో తహసీల్దార్ మళ్లీ వెరిఫై చేసి అంతా ఓకే ఉంటే ఆపరేటర్ లాగిన్ కు వెళ్తుంది. ఆ తరువాత రిజిస్ట్రేషన్ చేసుకునే ల్యాండ్ వివరాలు, అమ్మకం, కొనుగోలుదారులు, సాక్షుల ఫోటోలు, సంతకాలతో కూడిన ప్రింట్ వస్తుంది. తహసీల్దార్ డిజిటల్ సైన్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. సైట్ స్పీడ్ గా ఉండి.. ఎలాంటి అవాంతరాలు లేకుంటే ఈ మొత్తం ప్రాసెస్15 నిమిషాల నుంచి 20 నిమిషాల్లో పూర్తవుతుంది.
రాష్ట్రమంతా గిట్లనే ఉంది
గురువారం రాష్ట్రమంతా ఇదే పరిస్థితి కనిపించింది.- మెదక్ జిల్లా నిజాంపేట్ తహసీల్దార్ ఆఫీస్ లో గురువారం 12 స్లాట్ లు బుక్ కాగా ఒక్క రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. ఈ నెల 24 నుంచి సర్వర్ ప్రాబ్లంతో ఈ తహసీల్దార్ ఆఫీసులో 30 రిజిస్ట్రేషన్లు పెండింగ్‌పడ్డాయి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ తహసీల్దార్ ఆఫీసులో 14 స్లాట్ బుక్ అయితే.. ఒక్క రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు. నిర్మల్ జిల్లా నర్సాపూర్.జి తహసీల్దార్ ఆఫీసులో 17 స్లాట్లు బుక్‌చేస్తే ఒక్కటి కూడా కాలేదు. పాలమూరు జిల్లా మిడ్జిల్ లోనూ ఇదే పరిస్థితి. గురువారం 30 స్లాట్లను బుక్ చేసుకోగా ఒక్క రిజిస్ట్రేషన్ కూడా జరగలేదు. బుధవారం 19 స్లాట్లు బుక్ కాగా, వాటిని కూడా పెండింగ్‌లో పెట్టారు. క్రయ, విక్రయదారులు, సాక్షులు సాయంత్రం వరకు పడిగాపులు కాసి వెళ్లిపోయారు. కరీంనగర్ జిల్లా గంగాధరలో 30 స్లాట్స్బుక్ చేసుకోగా, 4 రిజిస్ట్రేషన్స్ జరిగాయి. ఇల్లందకుంట మండలంలో 14 కు గాను 3, సైదాపూర్ 26 స్లాట్స్ కు గాను 4, తిమ్మాపూర్ లో 10కిగాను 6, వీణవంక లో 12 కి గాను కేవలం రెండు మాత్రమే అయ్యాయి. జనగామ తహసీల్దార్ ఆఫీస్ లో 27కి 7, నాగర్ కర్నూలు తహసీల్దార్ ఆఫీసులో 30కిగాను 2 , పెద్దపల్లి తహసీల్దార్ ఆఫీసులో 31కిగాను 5, సిద్దిపేట రూరల్ మండలంలో 20కిగాను 8 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ధరణి పోర్టర్లోకి కొత్త మాడ్యూల్స్చేరుస్తున్నందునే సర్వర్ డౌన్ అవుతోందని ఆఫీసర్లు చెబుతుండగా, ఫిబ్రవరి 1 నుంచి భూముల మార్కెట్వ్యాల్యూ పెరగనున్నందున ప్రభుత్వమే ఇలా చేయిస్తోందని పబ్లిక్ ఆరోపిస్తున్నారు.
గంటలో కావాల్సింది.. నాలుగు రోజులు పట్టింది
హైదరాబాద్‌కు చెందిన - మల్రాజు రజితాదేవికి మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలో వ్యవసాయ భూమి ఉంది. రిజిస్ట్రేషన్ కోసం ఈ నెల 24న హైదరాబాద్ నుంచి స్లాట్ బుక్ చేసుకుని వచ్చారు. ధరణి పోర్టల్ స్లోగా ఉండడంతో సోమ, మంగళవారాలు రిజిస్ట్రేషన్ కాలేదు. బుధవారం రిపబ్లిక్‌డే కావడంతో ఇక్కడే ఉండిపోయారు. మొత్తం మీద నాలుగురోజులు ఎదురుచూస్తే గురువారం రిజిస్ట్రేషన్ అయింది. గంటలో కావాల్సిన రిజిస్ట్రేషన్ కోసం నాలుగు రోజులు పట్టిందని, సర్వర్ డౌన్ కారణంగా చాలా ఇబ్బంది పడ్డామని ఆమె చెప్పారు.
30 స్లాట్లలో ఒక్కటీ రిజిస్ట్రేషన్ కాలే
మెదక్ జిల్లా శివ్వంపేట తహసీల్దార్ ఆఫీసులో గురువారం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ కోసం 30 స్లాట్లు బుక్ అయ్యాయి. ఈ నెల 24, 25కు సంబంధించి 16 స్లాట్స్ పెండింగ్ పడ్డాయి. దీంతో 46 రిజిస్ట్రేషన్ల కోసం ఉదయం నుంచే అమ్మకం, కొనుగోలు దారులు, సాక్షులు తహసీల్దార్ ఆఫీసు ముందు బారులు తీరారు. సర్వర్ సతాయించడంతో గురువారం సాయంత్రం వరకు సోమ, మంగళవారాల స్లాట్లకు సంబంధించిన 16 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. గురువారం చేయాల్సిన 30 రిజిస్ట్రేషన్లలో ఒక్కటీ కాకపోవడంతో వచ్చినవాళ్లంతా నిరాశగా వెనుదిరిగారు.
గంటల కొద్దీ పడిగాపులు
స్లాట్ బుక్ చేసుకుని ఆఫీస్ కు వచ్చే కొనుగోలు, అమ్మకందారులకు ఐదు రోజులుగా ఎదురు చూపులు తప్పడం లేదు. పోర్టల్ లాగిన్ కాకపోవడంతో సమస్య మొదలవుతోంది. లాగిన్ అయ్యాక డాక్యుమెంట్లు ప్రింట్ తీయడం.. ఫొటోలు.. థంబ్ తీసుకునే టైమ్ లోనూ సైట్ స్లో అయిపోతోంది. దీంతో ఒక్కో రిజిష్ట్రేషన్ కు నాలుగైదు గంటలకు పైగా పడుతోంది. సర్వర్ ప్రాబ్లమ్ తో ఫొటోలు తీసుకోవడం లేదు. దీంతో ప్రాసెస్ మొత్తం ఆగిపోతోంది. మళ్లీ సర్వర్ ఓపెన్ అయితే ఫొటోలు అప్ లోడ్ చేయడం.. మధ్య మధ్యలో ఆగిపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గురువారం ఒక్కో రిజిస్ట్రేషన్టైంలో నాలుగైదు సార్లు సర్వర్ సతాయించింది. దీంతో ఉదయం 10 గంటలు వచ్చినవాళ్లు సాయంత్రం ఐదింటి వరకు ఉండిపోయారు. మామూలు రోజుల్లో 20 దాకా రిజిస్ట్రేషన్లు జరిగితే ఐదు రోజుల నుంచి 4, 5 రిజిస్ట్రేషన్లు కూడా కాలేదు.
మూడు రోజులైంది
వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కోసం ఈ నెల 25న స్లాట్ బుక్ చేసుకున్నాను. రిజిస్ట్రేషన్ కోసం బుధవారం తహసీల్దార్ ఆఫీస్ కు వస్తే సర్వర్ డౌన్‌కారణంగా పనికాలేదు. మళ్లీ గురువారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఆఫీస్ కి వచ్చాం. మధ్యాహ్నం వరకు కూడా మా రిజిస్ట్రేషన్ కాలేదు. గంటల తరబడి వెయిట్చేయడానికి సాక్షులు ఇబ్బందిపడ్డారు. 20 నిమిషాల్లో కావాల్సిన రిజిస్ట్రేషన్ మూడు రోజులు చేస్తే ఎట్లా? ఫీజులు మాత్రం పెంచుతున్నారు. మా ఇబ్బందులను మాత్రం పట్టించుకోవట్లేదు.
- బోనకుర్తి తిరుమల్, కాట్నపల్లి, చొప్పదండి మండలం, కరీంనగర్
ఇంకెన్ని రోజులు తిప్పుకుంటరు
నాకు కాల్వశ్రీరాంపూర్ మండలం పందిళ్లలో సాగు భూమి ఉంది. నేను గోదావరిఖనిలో ఉంటాను. నా భూమి రిజిస్ట్రేషన్ కోసం మూడు రోజుల నుంచి తహసీల్దార్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా, సర్వర్లు పనిచేస్తలేవని చెప్తున్నరు. పొద్దటి నుంచి సాయంత్రం దాకా చూసి వెళ్లిపోయి.. మళ్లీ తెల్లారి పొద్దున వస్తున్నా. ఇంకా ఎన్ని రోజులు తిప్పించుకుంటరో అర్థమైతలేదు. - అబ్దుల్ ఘనీ, కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి
సైట్ స్లో ఉన్నది
ధరణి పోర్టల్ స్లో కావడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సజావుగా సాగడం లేదు. మామూలుగా రోజుకు 30 వరకు రిజిస్ట్రేషన్స్ జరుగుతాయి. కానీ మూడు రోజుల నుంచి సర్వర్ డౌన్ అయి, 4, 5 రిజిస్ట్రేషన్లే అవుతున్నాయి. వచ్చే నెల నుంచి మార్కేట్ రేట్లు పెరుగుతున్నాయి. స్లాట్ బుక్ చేసుకున్నవాళ్లకు ఇప్పటి రేట్ల మేరకే రిజిస్ట్రేషన్లు చేస్తం. రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. - రాజ కుమార్, తహసీల్దార్, లక్సెట్టిపేట, మంచిర్యాల
