వికారాబాద్/ చేవెళ్ల వెలుగు : జిల్లాలో భూముల క్రయ విక్రయాల్లో రెండు రోజులుగా రిజిస్ట్రేషన్లు నెమ్మదిగా నడుస్తుండగా అమ్మకం, కొనుగోలు దారులు తహసీల్దార్ ఆఫీసుల ముందు ఎదురుచూడక తప్పని పరిస్థితి ఉంది. ఉదయం నుంచి రాత్రి పదకొండు దాకా కూర్చుంటే ఒకటి రెండు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయని వాపోతున్నారు. రోజూ 15 నుంచి 25 రిజిస్ట్రేషన్లు అయ్యే ప్రతి తహసీల్దార్ ఆఫీసులో మూడు రోజులుగా ఒకటి లేదా రెండు అంతకుమించితే నాలుగు రిజిస్ట్రేషన్లు అవుతుండగా చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూముల వాల్యూవేషన్పెంచనుందనే ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి నుంచి అమల్లోకి వస్తాయని రెవెన్యూ శాఖ అధికారులే చెబుతుండగా, అగ్రిమెంట్లు, ఒప్పంద పత్రాలు రాసుకున్నవారు భూములను ఆఫ్ రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు తహసీల్దార్ ఆఫీసుల వద్ద క్యూ కడుతున్నారు.
కొత్త రూల్స్వస్తే ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుందనే భయంతో రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేసుకొని ఆఫీసుల వద్ద ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం సర్వర్లు డౌన్ చేసి ఫిబ్రవరి తర్వాత విక్రయాలపై అదనంగా రాబడి పెంచుకోవాలనే ప్రయత్నమని కొందరు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ అధికారాలు ఇచ్చిన విషయం తెలిసిందే . కాగా స్లాట్ బుక్ చేసిన కొనుగోలుదారులు రెండు రోజులుగా జిల్లాలోని పెద్దేముల్, బషీరాబాద్, యాలాల, కోట్ పల్లి, ధారూరు, వికారాబాద్, పరిగి, నవాబు పేట తహసీల్దార్ ఆఫీసుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. భూముల విలువ మదింపు ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో ముగుస్తుందని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ను ఫోన్ లో వివరణ కోరగా అందుబాటులో లేరు.
