గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య

గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య

హనుమకొండ జిల్లా : ధర్మసాగర్ మండలం కరుణాపురం మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనిఖీ చేశారు. గురుకుల పాఠశాలలోని భోజనశాల, వంటగదిని పరిశీలించారు. కూరలు సరిగా వండలేదని హాస్టల్ సిబ్బందిని మందలించారు ‘ పప్పు ఇలానే ఉంటుందా..? మన ఇంట్లో అయితే ఇలాగే చేసుకుంటామా...?’ అని హాస్టల్ సిబ్బందిపై మండిపడ్డారు. నిన్న శుభ్రంగా లేని  వంటగది.. ఈరోజు ఎలా శుభ్రంగా ఉందని ప్రశ్నించారు. ఆ తర్వాత విద్యార్థులతో కూర్చుని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న స్పెషల్ ఆఫీసర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డీసీఓను కోరారు. భోజనం మెనూ పాటించని డిప్యూటీ వార్డెన్ ను తక్షణమే బదిలీ చేయాలని ఎమ్మెల్యే రాజయ్య ఆదేశించారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సలహాలు ఇచ్చారు. బాగా కష్టపడి చదువుకుని తల్లిదండ్రుల కలలను నెరవేర్చి.. ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు.