
గత రెండు దశాబ్దాలుగా కర్ణాటకలోని ధర్మస్థల ఆలయ పట్టణంలో జరిగిన సామూహిక సమాధులు, అదృశ్యాలు, మహిళలు, విద్యార్థులపై జరిగిన నేరాలకు సంబంధించిన రిపోర్టులు లేదా స్పందలను ప్రచురించకుండా మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెల్స్ నిషేధిస్తూ బెంగళూరు సివిల్ కోర్టు జారీ చేసిన గ్యాగ్ ఆర్డర్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది.
తీవ్రమైన వైఫల్యం, తప్పిదం ఆరోపణలు ఉన్న ఈ విషయం పై ప్రజల తెలుసుకునే హక్కును అరికట్టలేమని జస్టిస్ ఎం నాగప్రసన్న అభిప్రాయపడ్డారు. ఈ గ్యాగ్ ఆర్డర్ ధర్మస్థల మంజునాథేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి & బీజేపీ ఎంపీ డి వీరేంద్ర హెగ్గడే సోదరుడు హర్షేంద్ర కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై జారీ చేసింది. హెగ్గడే కుటుంబం ధర్మస్థల ఆలయాన్ని అలాగే దాని అనుబంధ సంస్థలను నిర్వహిస్తుంది.
ధర్మస్థల సామూహిక సమాధుల ఆరోపణలకు సంబంధించిన 8,842 ఆన్‌లైన్ లింక్‌లను వెంటనే తొలగించాలని లేదా డీ-ఇండెక్సింగ్ చేయాలని సివిల్ కోర్టు ఉత్తర్వులు ఆదేశించాయి. అలాగే, హెగ్గడే కుటుంబానికి వ్యతిరేకంగా కంటెంట్ ప్రచురించడం కూడా నిషేధించింది. కుడ్లా రాంపేజ్ అనే యూట్యూబ్ ఛానల్ దాఖలు చేసిన పిటిషన్‌కు పై హైకోర్టు ఈ ఉత్తర్వును కొట్టివేసి, కేసును కొత్తగా పరిశీలించడానికి కింద కోర్టుకు పంపింది.
జూలైలో లైంగిక వేధింపుల సంకేతాలు ఉన్న చాల మంది మహిళల మృతదేహాలను బలవంతంగా ఖననం చేశారని ఆరోపిస్తూ ఒక పారిశుధ్య కార్మికుడు చేసిన ఫిర్యాదు ఆధారంగా ధర్మస్థలలో ప్రథమ సమాచార నివేదిక (FIR) నమోదు అయ్యింది. జూలై 19న ఈ కేసును దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిగా, హోంమంత్రి జి. పరమేశ్వర దర్యాప్తును సమీక్షించారు. ఈ కేసు గురించి సమాజాన్ని తప్పుగా ప్రభావితం చేసే సోషల్ మీడియా పోస్ట్‌లను కూడా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.