ఏపీ హైకోర్టు సీజేగా ధీరజ్ సింగ్‌ ప్రమాణస్వీకారం

ఏపీ హైకోర్టు సీజేగా ధీరజ్ సింగ్‌ ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులతో పాటు సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.  ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేస్తున్న పీకే మిశ్రా సుప్రీంకోర్టుకు బదిలీ అయిన విష‌యం తెలిసిందే.

జస్టిస్ ధీరజ్ సింగ్ బాంబే హైకోర్టు సీజేగా పని చేస్తూ పదోన్నతిపై ఏపీకి వచ్చారు. ఆయ‌న జ‌మ్మూక‌శ్మీరు చెందిన వారు. ఆయ‌న తండ్రి, సోద‌రుడు కూడా న్యాయ‌మూర్తులుగా ప‌నిచేశారు. న్యాయవర్గాల్లో అత్యంత సౌమ్యుడిగా, వివాదరహితుడిగా, సమర్థుడిగా ఆయ‌న‌కు పేరుంది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ కు ఈయన స్వయానా తమ్ముడు. 1964 ఏప్రిల్ 25న జన్మించిన జస్టిస్ ధీరజ్ సింగ్.. 1989 అక్టోబరు 18న ఢిల్లీ, జమ్ముకశ్మీర్ బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా పేరొందారు. 2011 లో సీనియర్ న్యాయవాదిగా హోదా పొంది.. 2013 మార్చి 8న జమ్ముకశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2022 జూన్ 10న బొంబై హైకోర్టుకు బదిలీ అయి సేవలందించారు. 

ఇటీవల కాలం వరకు బాంబే హైకోర్టులో నంబర్‌ టూ స్థానంలో కొనసాగారు.ప్రస్తుతం ఏపీ హైకోర్టుకు 6వ సీజేగా పదోన్నతిపై వచ్చారు.  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన 2026 ఏప్రిల్‌ 24న పదవీ విరమణ చేస్తారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో జమ్మూ కశ్మీర్‌ రాష్ట్ర కోటా నుంచి న్యాయమూర్తులెవ్వరూ లేరు.  కాబట్టి.. ఈలోగా ఆయన పదోన్నతిపై సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. అలాగే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే)గా వ్యవహరిస్తున్న జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి ఇకపై నంబర్‌ 2గా కొనసాగుతారు. త్వరలో ఆయన కూడా వేరే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశాలున్నాయని న్యాయవర్గాలు చెబుతున్నాయి.

AsloRead:WhatsApp లో మరో కొత్త ఫీచర్.. వాట్సప్ చాట్ల కోసం క్విక్ వీడియో మేసేజింగ్ 

గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్‌.. జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌కు పుష్ఫగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ప్రమాణం చేసిన అనంతరం.. బాధ్యతల స్వీకరిస్తున్నట్లు పత్రాలపై సంతకాలు చేశారు. సీఎం జగన్‌ నూతన సీజేగా ప్రమాణం చేసిన ధీరజ్‌సింగ్‌‌ను సత్కరించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రతిపక్షనేత చంద్రబాబు,హైకోర్టు న్యాయమూర్తులు, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు.. మంత్రులు తానేటి వనిత, అంబటి రాంబాబు, మండలి చైర్మన్ కొయ్యే మోసేన్ రాజు, డిప్యూటీ చైర్మన్ జకియా, ఉన్నతాదికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజేను అందరూ కలిసి అభినందనలు తెలిపారు.