టీమిండియా క్రికెట్ కు ఎనలేని సేవలందించి అత్యద్భుత కెప్టెన్ గా మన్ననలు అందుకున్న మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు. ఆయన సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఈ మాజీ కూల్ కెప్టెన్ ఇప్పుడు తనకిష్టమైన పనులు చేస్తూ బిజీ అయిపోయాడు. దీపావళి పర్వదినం సందర్భంగా తన సినిమా ప్రొడక్షన్ ఆఫీసు ఓపెన్ చేసి మొదటి సినిమాను ప్రకటించాడు. నిర్మాణ సంస్ధకు ‘D ఎంటర్టైన్మెంట్’ అని పేరు పెట్టాడు. చెన్నైలో ఈ ప్రొడక్షన్ ఆఫీసు ఉంది. మొదటి సినిమాను తమిళంలో నిర్మించనున్నాడు. ధోని సతీమణి సాక్షి కథను అందించారు. రమేశ్ తమిళమని దర్శకత్వం వహించనున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ మూవీని తెరకెక్కించనున్నట్లు సమాచారం.
గ్రౌండ్ లో బ్యాట్ తో వీరవిహారం చేసే ధోనీ సినిమా రంగంలో ఎలాంటి విజయాలు సాధిస్తారో చూడాలి. సాక్షి రాసిన కాన్సెప్ట్ చదివిన మరుక్షణమే అది ఎంతో ప్రత్యేకమైనదని తెలిసిందని తమిళమణి తెలిపారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండే అవకాశం ఉందని, ఈ సినిమాను తెరకెక్కించడానికి తాము ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామన్నారు.
