- వచ్చిన వరద వచ్చినట్టే దిగువకు విడుదల
- కడెంకూ 1.10 లక్షల క్యూసెక్కులు.. శ్రీరాంసాగర్‌కు 76 వేలు
- నారాయణపూర్ నుంచి లక్ష క్యూసెక్కులు విడుదల
- జూరాలకు 1.04 లక్షల క్యూసెక్కులు.. దిగువకు 1.10 లక్షలు విడుదల
- శ్రీశైలానికి సీజన్‌లో ఫస్ట్‌టైమ్ లక్ష క్యూసెక్కుల వరద
- ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కుంభవృష్టి
- దక్షిణాది జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
హైదరాబాద్/ బాల్కొండ/ మంచిర్యాల/ నిర్మల్/ గద్వాల, వెలుగు: గోదావరిలో కీలక ప్రాజెక్టు అయిన శ్రీపాద ఎల్లంపల్లికి ఎగువ నుంచి భారీ వరద వస్తోంది. స్థానికంగా కురుస్తున్న వర్షాలు, కడెం నుంచి వస్తున్న వరదలతో నిమిష నిమిషానికి వరద ప్రవాహం పెరుగుతున్నది. గురువారం రాత్రి 10.30 గంటల సమయానికి ప్రాజెక్టుకు 4,65,155 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 30 గేట్లను ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తున్నారు. అటు గాయత్రి, నందిపంప్హౌస్ల నుంచి నీటిని మిడ్‌మానేరుకు 15,750 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నారు.
హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 275 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. మరోవైపు కడెం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుకు 1.10 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 40 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఎగువన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకూ వరద ప్రవాహం పెరుగుతున్నది. ప్రస్తుతం ఎస్సారెస్పీకి 76 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రికార్డయింది. ప్రాణహిత నదికి వరదలు వస్తుండడంతో మేడిగడ్డ వద్ద కూడా 3.13 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తున్నది. దిగువన ఇంద్రావతి, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ వాగులు, వంకల ఉధృతితో సమ్మక్కసాగర్ బ్యారేజీ నుంచి 9.60 లక్షల క్యూసెక్కుల ప్రవాహం దిగువకు పోతున్నది.
శ్రీశైలం ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కులకు పైగా..
కృష్ణా ప్రాజెక్టుల్లోనూ వరద అంతకంతకూ పెరుగుతున్నది. నారాయణపూర్ నుంచి తొలిసారిగా లక్ష క్యూసెక్కులను దిగువకు వదలుతున్నారు.
ఆల్మట్టికి 83 వేల క్యూసెక్కుల ఫ్లడ్ వస్తుండగా.. 97 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో నారాయణపూర్‌కు 95 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 1.10 లక్షల క్యూసెక్కులను విడిచిపెడుతున్నారు. గురువారం రాత్రి వరకు జూరాలకు 1.04 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా 1.10 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. కోయిల్‌సాగర్, నెట్టెంపాడు లిఫ్ట్‌ల ద్వారా నీటిని ఎత్తిపోస్తూనే.. 17 గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. 89,715 క్యూసెక్కులను విడుదల చేస్తుండగా.. శ్రీశైలం ప్రాజెక్టుకు సీజన్‌లో తొలిసారి లక్ష క్యూసెక్కుల వరద వస్తున్నది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 1.12 లక్షల క్యూసెక్కుల వరద నమోదవుతున్నది. నాగార్జునసాగర్‌కూ 19,850 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఇటు మీడియం ప్రాజెక్టులకు కూడా వరద మొదలైంది. మత్తడివాగుకు 9 వేల క్యూసెక్కులు, వట్టివాగుకు 32 వేల క్యూసెక్కులు, కుమ్రం భీమ్ ప్రాజెక్టుకు 30 వేల క్యూసెక్కులు, చనాక కొరాట బ్యారేజీకి 95 వేల క్యూసెక్కులు, జగన్నాథపూర్లోని పెద్దవాగు ప్రాజెక్టుకు 1.46 లక్షల క్యూసెక్కుల, తాలిపేరుకు 25 వేల క్యూసెక్కుల చొప్పున వరద వస్తున్నది.
జోర్దార్ వర్షాలు..
రాష్ట్రంలో వర్షాలు జోర్దార్ పడ్తున్నయ్. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కుంభవృష్టి కురుస్తున్నది. రెండు నెలలుగా గర్జించని మేఘాలు.. కేవలం రెండు రోజుల్లోనే కరువు తీరేలా వర్షాన్ని కురిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం ప్రభావంతో మూడు రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా శుక్రవారం నుంచి పొడి పరిస్థితులుంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
కేవలం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకే ఎల్లో అలర్ట్జారీ చేసింది. కాగా, తాజాగా పడుతున్న వర్షాలతో లోటు పూడుకుంటున్నది. మొన్నటివరకు 34 శాతం వరకు లోటు వర్షపాతం ఉండగా.. ఇప్పుడది 11 శాతానికి తగ్గింది. 21 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. మరో 12 జిల్లాల్లో మాత్రం లోటు వర్షపాతం కొనసాగుతున్నది. ముఖ్యంగా హనుమకొండ, జనగామ, వరంగల్ జిల్లాల్లో 40 శాతానికిపైగా లోటుంది. అత్యధికంగా హనుమకొండ జిల్లాలో 47 శాతం లోటుండగా.. వరంగల్, జనగామ జిల్లాల్లో 44 శాతంగా ఉంది. సూర్యాపేట, ఖమ్మం, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లోనూ 30 శాతానికిపైగా లోటు వర్షపాతం ఉన్నది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఇంకా చెప్పుకోదగిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతోనే ఈ ప్రభావం కనిపిస్తున్నది.
తపాల్పూర్లో 16.3 సెంటీమీటర్లు..
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడ్డాయి. అత్యధికంగా మంచిర్యాల జిల్లా తపాల్పూర్లో 16.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జగిత్యాల జిల్లా కోల్వాయిలో 15 సెంటీమీటర్లు, ఆదిలాబాద్ జిల్లా భరంపూర్‌లో 13.2, మంచిర్యాల జిల్లా హాజీపూర్‌లో 11.3, జగిత్యాల జిల్లా వెల్గటూరులో 11.2, గుళ్లకోటలో 11.1, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్‌లో 10.5, నిర్మల్ జిల్లా కద్దం పెద్దూరులో 10.4, పెద్దపల్లి జిల్లా ఆకెనపల్లిలో 10.1 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ సిటీలో ఉదయం నుంచి ముసురు పట్టింది. అప్పుడప్పుడు జల్లులు పడ్డాయి. అత్యధికంగా హెచ్‌సీయూలో 1.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉప్పల్‌లో 1.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
