అక్షర ప్రపంచం..చూడగలగాలే కానీ...

అక్షర ప్రపంచం..చూడగలగాలే కానీ...

టేకులపల్లి గోపాలరెడ్డి (వేణు) తన జీవితచరిత్రను తానే ‘జీవన స్రవంతి’ అనే నవలగా బ్రెయిలీ లిపిలో రచించాడు. ఆ నవలను తానే చదువుతుంటే విని, మనమందరం చదువుకునే రీతిలో పుస్తకంగా తెచ్చింది ధూళిపాల అరుణ.

అది తెలంగాణలోని కామారెడ్డి జిల్లా పోచారం గ్రామం. వేణుకు నాలుగేళ్ల ప్రాయంలో కండ్లకలక వచ్చింది. తెలిసీ తెలియక చేసిన వైద్యం వికటించింది. చూపును కోల్పోయాడు. ఆడుతూ పాడుతూ అందరు పిల్లలు కేరింతలు కొడుతుంటే ఇంటికే పరిమితమయ్యాడు. ఒంటరితనంతో బాధ పడుతున్న వేణుకు నాన్న రమాకాంత్ కొనిచ్చిన రేడియో ప్రియనేస్తం, సర్వస్వం. 


రేడియో వేణును మనసున్న మనిషిగా తీర్చిదిద్దింది. మానవతను హృదయంలో నింపింది. వార్తల ద్వారా లోకజ్ఞానం అందించింది. రేడియో నాటకాలలో శారదా శ్రీనివాసన్ కంఠస్వరం, మాట్లాడేతీరు, రసాభి వ్యక్తీకరణ వేణును అమితంగా ఆకర్షించేవి. ఆమె అతనికి ఊహాసుందరి అయ్యింది.

రమాకాంత్... వేణును ఆలస్యంగా హైదరాబాద్​లోని అంధుల పాఠశాలలో చేర్చాడు. అక్కడ ప్రకాశ్ అనే టీచర్​ అతనికి బ్రెయిలీ లిపి నేర్పాడు. ఆ టీచర్​కు కూడా చూపు ఉండదు. చూపులేని మరో వ్యక్తి సూర్యనారాయణ అతని ప్రాణానికి ప్రాణమయ్యాడు.


హైదరాబాద్​లో నడక చూపులేని వాళ్లకు ఎంతో కష్టం! రోడ్డు మీద వెళ్లే ఏ వెహికల్​ అయినా తగిలే ప్రమాదం ఉంది. ఇదేకాదు తెరచి ఉంచిన డ్రైనేజీ హోల్స్​ వల్ల కూడా ప్రమాదమే. చూపులేని వారికి తోడు ఒక కర్ర మాత్రమే. ఒక్క మాటలో చెప్పాలంటే నిర్జీవమైన ఆ కర్ర వాళ్లకి దారి దీపం. జీవితంలో చాలా సందర్భాలలో ప్రమాదపు అంచులదాకా వెళ్లి తిరిగి వచ్చాడు వేణు. రమాకాంత్ క్యాన్సర్ తో మరణించడంతో, వేణు చదువు రెండేండ్లకే అర్ధాంతరంగా ముగిసింది. అయితే సూర్యనారాయణ సలహాతో 8వ తరగతి బోర్డు పరీక్ష ప్రైవేటుగా రాయడానికి సిద్ధమయ్యాడు. పుస్తకాలు తెచ్చుకున్నాడు. ఆ పుస్తకాలను స్నేహితులు చదివి వినిపించేవారు. వేణు బ్రెయిలీలో నోట్సు రాసుకునేవాడు. సైబర్ సాయంతో పరీక్షలు రాసి, పాసయ్యాడు.


వేణు కోరుకున్న, తనను కోరుకున్న సాధనను పెండ్లి చేసుకోనివ్వకుండా కులంపేరు చెప్పి కుటుంబ సభ్యులు అడ్డుపడ్డారు. పేదరాలైన రెడ్డి కులం అమ్మాయి దీప్తితో పెండ్లి చేశారు. వేణు చూపులేని వాడు. నిస్సహాయుడు. కనుక సాధన సుఖంగా ఉండాలని కోరుకోవడం తప్ప... ఏమీ చేయలేకపోయాడు.


తన చదువు విషయంలో వేణుకు తల్లి, తోబుట్టువుల నుంచి సహాయ నిరాకరణ ఎదురైంది. దీప్తి వేణుకి మెట్రిక్యులేషన్ పుస్తకాలను చదివి వినిపించేది. ఇప్పుడు వేణు కంటిచూపు, ఇంటి దీపం ఆమెనే. వేణు హైదరాబాద్​కు వెళ్లి వికలాంగుల శరణాలయంలో ఉంటూ మెట్రిక్, ఆ తరువాత పి.యు.సి. పరీక్షలు రాసి ఉత్తీర్ణుడయ్యాడు. డిగ్రీలో అడ్మిషన్ పొందాడు. మరోవైపు సాయంత్రం కళాశాలలో ప్రాచ్య విద్యలూ అభ్యసిస్తున్నాడు.


ఇంట్లో దీప్తితో అన్ని పనులూ చేయించుకుంటూ పనిమనిషిలా చూసినవారే ఆమెపై గొలుసు దొంగతనం చేసిందని నేరారోపణ చేశారు. వేణు వెళ్లాక తెలిసింది. చివరకు ఆ గొలుసు మరొకడి దగ్గర దొరికింది. దీప్తి నిర్దోషిగా బయటపడింది. అయినా ఇక అక్కడ ఉండబుద్ధి కాలేదు దీప్తికి. వేణు వెంట నీడలా హైదరాబాద్​కు నడిచింది. వేణుకు అప్పటినుండి కళ్ళూ, కాళ్లూ అన్నీ దీప్తి అయింది. 
ఒక గది అద్దెకు తీసుకున్నారు. వేణుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నెలకు రెండొందల రూపాయల స్కాలర్​షిప్​ ఆలంబన. డిగ్రీ అయిపోయింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మే తెలుగులో సీటు వచ్చింది. రవ్వా శ్రీహరి, సినారె, జి.వి. సుబ్రహ్మణ్యం వంటి వాళ్లకు శిష్యుడయ్యాడు. నందిని సిద్ధారెడ్డికి సహాధ్యాయి అయ్యాడు. లెక్చరర్ అయ్యాక సహోద్యోగి అయ్యాడు. పనికిరాడు అని విసరివేసిన వేణును సానపట్టి జాతిరత్నంగా మార్చిన 13 ఏండ్ల విద్యార్థిదశ వరకే ఉంది ఈ నవలలో. 


ధూళిపాల అరుణ అన్నట్లు ‘‘జీవితంలో ఇక ఏదీ సాధించలేమని, తమకు తప్ప ఇతరులెవ్వరికీ ఎలాంటి కష్టాలు లేవని నిరాశా నిస్పృహలతో నిరాసక్తంగా నడక సాగించేవారికి ఈ నవల ఒక ఆదర్శం. వచనమే అయినా ఈ నవలలో ఎన్నో కవితాత్మక వాక్యాలు ఉంటాయి. మనల్ని కట్టిపడేసే సంఘర్షణలు, వర్ణనలు ఉంటాయి. సందర్భానుగుణంగా నది, ప్రకృతి, సంస్కృతి, సంప్రదాయం, అభ్యుదయం, విప్లవం, సంగీతం, సాహిత్యం, ప్రణయం, పరిణయం, జీవితాలు, మనస్తత్వాలు, ఆటలు, పాటలు, సంతోషాలు, విషాదాలు,  ప్రయాణాలు, మానవ పరిణామాలు, కుటుంబం, విశ్వం -అన్నింటి గురించీ ఉంటుంది. కొన్ని సందర్భాలలో ప్రతివాక్యం రసాత్మకం. ముఖ్యంగా - సాధన గురించి కలలు కంటున్నప్పుడు, సాధన దూరం అవుతున్నపుడు ఆ వర్ణనలు, వాక్యాలు, సంఘర్షణలు దీన్ని గొప్ప నవలగా తీర్చిదిద్దాయి. విజ్ఞానము తరగని గని. ఎంత తవ్వినా జ్ఞాన స్వర్ణం లభిస్తూనే ఉంటుంది. ఈ విశాల విశ్వంలో చూడగలిగితే అంతా నూతనత్వమే’’ అని ఈ గ్రంథం ద్వారా తెలుసుకుంటం. 


ఇంత గొప్ప నవల రాసిన టేకులపల్లి గోపాలరెడ్డికి హృదయపూర్వక అభినందనలు.
 

-ఎ. గజేందర్ రెడ్డి