టీఆర్ఎస్​ లోకల్​ లీడర్ల మధ్య విభేదాలు

టీఆర్ఎస్​ లోకల్​ లీడర్ల మధ్య విభేదాలు
  • టీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త ఆడియో కలకలం
  • పార్టీ  నుంచి సస్పెండ్ చేయాలన్న కార్పొరేటర్లు
  •  కౌంటర్ గా ప్రెస్ మీట్ పెట్టిన కార్పొరేటర్ భర్త

కరీంనగర్/కరీంనగర్‍ సిటీ, వెలుగు: మంత్రి గంగుల కమలాకర్​ను బద్​నాం చేసేందుకు ఆయనకు వ్యతిరేకంగా కార్పొరేటర్​ భర్త  మాట్లాడినట్లుగా ఉన్న ఆడియో కరీంనగర్​లో వైరల్​గా మారింది. ఈ ఆడియో బయటకు రావడంతో టీఆర్ఎస్​ లోకల్​ లీడర్ల మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. ఇంతకు ముందు కార్పొరేటర్​ కమల్జిత్​ కౌర్​ తన డివిజన్​లో నీళ్లు రావడం లేదని ఖాళీ బిందెలతో కార్పొరేషన్​ మీటింగ్​కు రావడం కలకలం సృష్టించింది. మంత్రిని కావాలనే బద్నాం చేస్తున్న కమల్జిత్​కౌర్​ భర్త సోహన్ సింగ్, ఆయన​వెనక ఉన్న మాజీ మేయర్​ రవీందర్​సింగ్​ను పార్టీ  నుంచి సస్పెండ్​ చేయాలని టీఆర్ఎస్​ కార్పొరేటర్లు డిమాండ్ ​చేయగా, తాను మాట్లాడిన దాంట్లో తప్పేం లేదని సోహన్​సింగ్ ​పేర్కొన్నారు. ఇటు ఈ వివాదం సాగుతుంటే మరోవైపు రవీందర్​సింగ్ ​ప్రెస్​మీట్​పెట్టి కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడారు. ​ 

ఆడియోలో ఏముందంటే..

సిటీలోని మార్కెట్ ఏరియా నీలకంఠం రోడ్డు తవ్వి అలాగే ఉంచడంపై రాజు అనే వ్యాపారి సోహన్ తో ఫోన్​లో మాట్లాడారు. ‘మంత్రి పనులు చేయకుండా సతాయిస్తున్నడు.. ఇప్పటికే ఆ రోడ్డు పూర్తిగా పందికొక్కులు తవ్వి పాడు చేశాయి. అక్కడున్న షాప్ వాళ్లకు వశపడ్తలేదు. మేమే జేసీబీ తెచ్చి తవ్వేశాం. మాకు మోరీ కట్టించాలి.. లేకపోతే కలెక్టర్ ఆఫీస్ ముందు  ధర్నా చేస్తాం అని  కమిషనర్ వెంట పడ్డాం. రెండు మూడు రోజుల్లో కలెక్టర్ తో మాట్లాడతానని  కమిషనర్ అంటే.. ఆయనేంది ఒప్పించేది అని రవీందర్ సింగ్ పోయి కలెక్టర్ ను కలిసిండు. వాళ్లు ఒప్పుకున్నరు. మన వాడలను  చిత్రహింసలు పెట్టాలని మంత్రికి ఉన్నది. ఆయన పెట్టుడు కాదు.. మనమే చిత్ర హింసలు పెడుతున్నం. ఒక్కో లూప్ పాయింట్ తీస్తున్నం.. నిద్ర లేకుండా చేస్తున్నం. వినాయకుడి నిమజ్జనం పూర్తి కాగానే తెల్లారి కలెక్టర్ ఆఫీస్ ముందట  వంటా వార్పు చేసి చిల్లర చిల్లర చేద్దామని ప్లాన్ వేసినం. దెబ్బకు కలెక్టర్ వచ్చి రోడ్డు, డ్రైయిన్ వేయాలే. రోడ్డుపై మట్టి తీస్తే పెద్దగా కనిపిస్తది అందుకే తీయలే. రోడ్డుపై రాకపోకలు బంద్ కావాలే. పెద్ద ఇష్యూ చేసేది ఉంది' అంటూ ఆడియోలో ఉంది.

బురద చల్లాలని చూస్తున్రు: డిప్యూటీ మేయర్‍

49, 51 డివిజన్లలో అభివృద్ది జరగడం లేదంటూ మంత్రి గంగుల కమలాకర్‍, మేయర్‍ వై.సునీల్‍రావుపై మాజీ మేయర్‍ సర్దార్‍ రవీందర్‍ సింగ్‍,  అతని అన్న కూతురు కమల్జిత్ కౌర్,  ఆమె భర్త సోహన్ సింగ్ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని డిప్యూటీ మేయర్‍ చల్ల స్వరూపరాణి మండిపడ్డారు. శనివారం టీఆర్‍ఎస్‍ కార్పొరేటర్లు విలేకరులతో  మాట్లాడారు. టీఆర్‍ఎస్‍ లో ఉంటూ సొంతపార్టీ మంత్రి, మేయర్‍ను బద్నాం చేస్తున్నారని, ఇంతకుముందు కూడా సోహన్ సింగ్  కొన్ని ఇళ్లకు నీటి సరఫరా కట్ చేయించి డ్రామా ఆడారన్నారు.  తన డివిజన్ లో అభివృద్ధి జరుగుతలేదంటూ కలెక్టరేట్ ముందు వంటావార్పుతో ధర్నా చేద్దామనుకున్న కుట్రకు సంబంధించిన ఆడియో లీకవడంతో సోహన్ సింగ్ అడ్డంగా దొరికారన్నారు. అనంతరం డిప్యూటీ మేయర్,​ మిగతా కార్పొరేటర్లు టీఆర్ఎస్​ జిల్లా అధ్యక్షుడు జీవీ వెంకటకృష్ణారావు, మంత్రి గంగుల కమలాకర్​ను కలిసి రవీందర్​సింగ్, సోహన్​సింగ్​ను పార్టీ నుంచి సస్పెండ్​ చేయాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు.  

తప్పేం మాట్లాడలే: సోహన్ సింగ్   

తప్పుగా మాట్లాడినట్లు నిరూపిస్తే తాను, తన భార్య రాజీనామా చేస్తామని సోహన్​సింగ్​ చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇదంతా మంత్రి చేయిస్తున్న కుట్రేనని మండిపడ్డారు. మాజీ  మేయర్ రవీందర్ సింగ్ కు సంబంధం లేకున్నా..  ఆయనకు సీఎం ఇస్తున్న  ప్రాధాన్యం చూసి ఓర్వలేకనే ఇవన్నీ చేస్తున్నారని అన్నారు. 
దేశాభివృద్ధి కేసీఆర్ తో సాధ్యం 
 మాజీ మేయ‌‌ర్ ర‌‌వీంద‌‌ర్ సింగ్‌‌

దేశాభివృద్ధి కేసీఆర్‌‌తోనే సాధ్యమని క‌‌రీంన‌‌గ‌‌ర్ మాజీ మేయ‌‌ర్ ర‌‌వీంద‌‌ర్ సింగ్ అన్నారు. శనివారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల స‌‌మావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని బంగారు  తెలంగాణ చేసిన‌‌ట్లుగానే  దేశం కూడా బంగారు భార‌‌త్  కావాలంటే  కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. బీజేపీ  పాల‌‌న‌‌లో దేశంలో అభివృద్ధి కుంటుప‌‌డింద‌‌న్నారు. క‌‌రీంన‌‌గ‌‌ర్ ఎంపీ  బండి సంజయ్‍కుమార్‍ చేస్తున్నది ప్రజా సంగ్రామ యాత్ర కాదని కమీష‌‌న్ల యాత్ర అని ఎద్దేవా చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాదా.. గ్రానైట్ వ్యాపార‌‌స్థులపై  ఈడీ దాడులు ఏమయ్యాయని ప్రశ్నించారు. క‌‌రీంన‌‌గ‌‌ర్ కార్పొరేట‌‌ర్‌‌గా ఉన్నప్పుడు నీ ఆస్తులు ఎంత, ఎంపీగా గెలిచిన త‌‌రువాత ఇప్పుడు  నీ ఆస్తులు ఎంతో ప్రకటించాలన్నారు. బండి సంజ‌‌య్ ఆస్తుల వివ‌‌రాలు స‌‌మ‌‌యం వ‌‌చ్చిన‌‌ప్పుడు బ‌‌య‌‌ట‌‌పెడతానని అన్నారు.