కాంగ్రెస్​లో తెగని పంచాయితీ..జిల్లా అధ్యక్షుడిపై వీడని పీఠముడి

కాంగ్రెస్​లో  తెగని పంచాయితీ..జిల్లా అధ్యక్షుడిపై వీడని పీఠముడి

జనగామ, వెలుగు :  జనగామ జిల్లా కాంగ్రెస్​ పంచాయతీ రోజు రోజుకు ముదురుతోంది. పీసీసీ మాజీ చీఫ్​ పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్​ రెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇరువురి అనుచరులు బాహాటంగానే విమర్శలు చేసుకుంటున్నారు. లీడర్ల వర్గ పోరుతో పార్టీ క్యాడర్​ నారాజ్​ అవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీని బలోపేతం చేయాల్సిన వారు ఒకరి పై ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. 

వీడని పీఠముడి

అన్ని జిల్లాల్లో కాంగ్రెస్​ హైకమాండ్​  జిల్లా అధ్యక్షుల ఎంపికను ఇటీవల పూర్తి చేసింది. జనగామలో నెలకొన్న వర్గ పోరుతో ఇక్కడి అధ్యక్షుడి ఎంపికను వాయిదా వేస్తూ వస్తోంది. తొలి విడతలో కొన్ని జిల్లాల అధ్యక్షుల ఎంపికను పూర్తి చేసిన హైకమాండ్​ జనగామ మినహాయించి మిగిలిన అన్ని జిల్లాల ప్రెసిడెంట్లను ప్రకటించింది. జిల్లా అధ్యక్ష స్థానంపై మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్​ రెడ్డి భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈయన పేరు దాదాపుగా ఫైనల్​ అయిందన్న ఊహాగానాలు నెలకొన్నాయి. కానీ గత నెలలో వచ్చిన అధ్యక్షుల జాబితాలో పేరు లేకపోవడంతో అనుచరులు షాక్​కు గురయ్యారు. పార్టీ కార్యక్రమాల నిర్వాహణకు తిరుగు లేకుండా ఉంటుందనే వ్యూహాలతో ఎలాగైనా అధ్యక్ష పీఠం దక్కించుకోవాలనే పట్టుదలతో కొమ్మూరి పావులు కదుపుతున్నారు.

 కానీ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. తన సీనియారిటీ పలుకుబడితో కొమ్మూరి అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఆపుతున్నట్లు పార్టీ శ్రేణుల్లో జోరు గా చర్చ  జరుగుతోంది..  ఇదే టైంలో తన ప్రధాన అనుచరుడు ప్రస్తుత జిల్లా వర్కింగ్​ ప్రెసిడెంట్​ మాసాన్​ పల్లి లింగాజీకి జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని పొన్నాల ప్రయత్నిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో పొన్నాల కొమ్మూరి వర్గాల మధ్య లొల్లి మరింత ముదిరింది.

శ్రేణుల్లో గందరగోళం

జనగామలో ఇదివరకు పొన్నాల, కొమ్మూరి, జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి వర్గాలు ఉండగా ఇప్పుడు రాఘవరెడ్డి వరంగల్​ పశ్చిమ ఎమ్మెల్యే టికెట్​ ను ఆశిస్తూ అక్కడ తన కార్యక్రమాలను చేపడుతున్నారు. దీంతో జనగామ అధ్యక్ష పదవి పైనేతలు ఆశలు పెట్టుకున్నారు. హైకమాండ్​  ఇచ్చే పిలుపులను కొమ్మూరి, పొన్నాల వర్గాలు ఎవరికి వారుగా నిర్వహిస్తున్నారు. ఇది ఇటీవల సీఎల్పీ లీడర్​ మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర సాక్షిగా తీవ్రంగా గొడవ పడే స్థాయికి చేరింది. 

పొన్నాల వర్గం ప్రెస్​ మీట్​ పెట్టి కొమ్మూరిని పార్టీ నుంచి సస్పెండ్​ చేశామంటే.. పొన్నాలనే బహిష్కరిస్తున్నట్లు కొమ్మూరి వర్గం ప్రెస్​మీట్​  పెట్టి చెప్పింది.    భట్టి తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇదే క్రమంలో ఏకంగా నర్మెట మండల కేంద్రంలో కార్నర్​ మీటింగ్​ ను సైతం నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మరుసటి రోజు జనగామ జిల్లా కేంద్రంలోని జరిగిన పార్టీ పాదయాత్రకు కొమ్మూరి వర్గం పూర్తి  దూరంగా ఉంది. గొడవలు జరిగే అవకాశం ఉందన్న అంచనాతో భట్టి సూచనలతో దూరంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. 

శ్రేణుల్లో భరోసా కరువు

అధ్యక్షుడి ఎంపిక పై హైకమాండ్​ సాగదీత వైఖరి కారణంగా జిల్లాలో పార్టీ శ్రేణులకు కనీస భరోసా కరువైంది. జనగామ నియోజకవర్గంలో పొన్నాల లక్ష్మయ్య తన సొంత గడ్డ అని, సీనియారిటీ కోటాలో టికెట్​ తెచ్చుకుంటాననే ధీమాలో ఉన్నారు. ఇదే టైంలో పొన్నాల వయోభారంతో ఉన్నాడని, గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్​లో చేరిన సందర్భంగా ఇచ్చిన హామీతో వచ్చే ఎమ్మెల్యే ఎన్నికల్లో టికెట్​ ఆశిస్తున్నట్లు కొమ్మూరి వర్గం చెబుతోంది. ఈ ఇరువురు తమకంటే తమకే టికెట్​ వస్తుందని ప్రచారం చేసుకుంటూ శ్రేణుల్లో గందరగోళాన్ని ఏమాత్రం తగ్గకుండా కంటిన్యూ చేస్తున్నాయి. ఇక పాలకుర్తి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీ చేసిన జంగా రాఘవరెడ్డి కొన్ని నెలల క్రితం చేతులెత్తేశారు.

 పాలకుర్తి నుంచి బరిలో నిలిచేది లేదని తేల్చేసి వరంగల్​ పశ్చిమలో తన కార్యకలాపాలు నిర్వహిస్తుండడంతో ఇక్కడి నుంచి ఎవరు బరిలో ఉంటారనేది క్లారిటీ లేకుండా పోయింది. ఎన్​ఆర్​ఐని  రంగంలోకి దించుతారనే ప్రచారం జరుగుతున్నా ప్రస్తుతం కార్యకర్తల బాగోగులకు పట్టించుకునే వారు లేకుండా పోయారు. స్టేషన్ ఘన్​పూర్​ నియోజకవర్గంలోనూ ఆధిపత్య పోరు నెలకొంది. ఇక్కడ గత ఎన్నికల్లో  బరిలో నిలిచిన సింగపురం ఇందిర, డాక్టర్ బొల్లెపల్లి కృష్ణ మధ్య టికెట్​ పోటీ నెలకొంది. హైకమాండ్​ స్పందించి పార్టీని గాడిలో పెట్టాలని కాంగ్రెస్​  శ్రేణులు కోరుతున్నాయి.