
విమానాలు జారిపోతున్నయ్.. అదుపుతప్పి పక్కకు పోతున్నయ్.. ల్యాండింగ్ అంటేనే ప్రయాణికుల్లో దడ పుట్టిస్తున్నయ్.. దేశవ్యాప్తంగా గత 72 గంటల్లో 5 విమానాలు రన్‌వేపై ప్రమాదం అంచు వరకు వెళ్లాయి. ప్రయాణికులకు చుక్కలు చూపించాయి. మొత్తంగా దేశంలో విమానాల సేఫ్టీ స్టాండర్డ్స్‌పై అనుమానాలకు తెరలేపాయి. పైలెట్ల ట్రైనింగ్‌పై సందేహాలు పెంచాయి.
డీజీసీఏ ఉందా?
వరుస ‘రన్‌వే’ ప్రమాదాలు జరుగుతుండటంతో పైలెట్ల ట్రైనింగ్ సరిగాలేదేమోనని నిపుణులు అనుమానిస్తున్నారు. వర్షాలు కురిసే సమయంలో పైలెట్లకు ఇచ్చే ట్రైనింగ్‌ను స్పైస్ జెట్, ఎయిరిండియా పట్టించుకోలేదని అంటున్నారు. వరుస ప్రమాదాలు జరుగుతుంటే డీజీసీఏ ఏం చేస్తోందని ప్రశ్నిస్తున్నారు. ప్రయాణికుల ప్రాణాలపై విమానయాన శాఖకు శ్రద్ధ ఉంటే నిబంధనలు పాటించని విమానయాన సంస్థలపై చర్యలు తీసుకోవాలంటున్నారు.
స్పైస్‌జెట్ స్పందించలేదు
సాధారణంగా వర్షాకాలంలో విమానాలు ల్యాండ్ అయ్యేటప్పుడు ప్రమాదం జరగకుండా పైలట్లకు అప్రోచ్ అండ్ ల్యాండింగ్ యాక్సిడెంట్ రిడక్షన్ ట్రైనింగ్ ఇస్తారు. గత మూడ్రోజుల్లో జరిగిన ప్రమాదాల్లో 4 స్పైస్‌జెట్, రెండు ఎయిర్ ఇండియా విమానాలున్నాయి. దీనిపై స్పైస్‌జెట్ ప్రతినిధిని అడగ్గా స్పందించలేదు. ఎయిర్ ఇండియా సీఈవో అందుబాటులో లేరు.
ఏప్రిల్ 29న స్పైస్‌జెట్
ఏప్రిల్ 29. షిర్డీ. స్పైస్‌జెట్ బోయింగ్ 737–800 ల్యాండ్ అవుతోంది. 164 మంది ప్రయాణికులున్నారు. విమానం ల్యాండ్ అవుతూనే జారిపోయింది. 50 మీటర్లు పక్కకెళ్లి ఆగింది. ప్రయాణికుల గుండె ఆగినంత పనైంది. కానీ అందరూ క్షేమంగా దిగారు.
జూన్ 30న ఎయిరిండియా
జూన్ 30న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ బోయింగ్ 737-–800 దుబాయ్ నుంచి మంగళూరు వచ్చింది. 181 మంది ప్రయణికులున్నారు. రన్‌వేపై దిగుతుండగా విమానం అదుపుతప్పింది. దాని ముక్కు భూమిని రాసుకుంటూ వెళ్లి రన్‌వే చివరన ఆగింది. ప్రయాణికులకు ఏం కాలేదు. మొబైల్ మెట్లతో అందరినీ దించారు.
జూన్ 30న మరో స్పైస్‌జెట్
జూన్ 30న సూరత్‌లో మరో స్పైస్‌జెట్ విమానం ప్రమాదం అంచు వరకు వెళ్లింది. ఆ విమానం భోపాల్ నుంచి 43 మందితో విమానం సూరత్ వచ్చింది. అప్పటికే ఆ ప్రాంతంలో బాగా వర్షం పడుతోంది. గాలి కూడా వీస్తోంది. దీంతో ల్యాండ్ అయ్యేటప్పుడు విమానం జారింది. ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. రన్‌వే పాడవడంతో ఎయిర్‌పోర్టును రాత్రి మూసేశారు. విమానాలను అహ్మదాబాద్ దారి మళ్లించారు.
జులై 1న కోజికోడ్‌లో
ఈసారి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బోయింగ్ 737–800. సౌదీ అరేబియాలోని డమ్మమ్ నుంచి 180 మంది ప్రయాణికులతో బయలుదేరింది. కోజికోడ్ ఎయిర్‌పోర్టులో కష్టంగా దిగింది. ల్యాండ్ అయ్యేటప్పుడు దాని తోక గ్రౌండ్‌ను తాకుతూ పోయింది. ప్రయాణికులకు ఏం కాలేదు.
జులై1న ముంబైలో
ఇంకో స్పైస్‌జెట్ విమానం రన్‌వేపై జారిపోయింది. అప్పటికే భారీగా వర్షం కురుస్తున్న ముంబై ఎయిర్‌పోర్టులో దిగుతుండగా పట్టుతప్పింది. రన్‌వే నుంచి పక్కకు వెళ్లింది. ప్రమాదం జరగడంతో రన్‌వేను తాత్కాలికంగా మూసేశారు.
జులై 2న.. కోల్‌కతాలో..
ఇది మరో స్పైస్‌జెట్ విమాన ప్రమాదం. పుణే నుంచి కోల్‌కతా వచ్చిన ఎస్‌జీ 275 రన్‌వే నుంచి పక్కకు పోయింది. ఇక్కడా ఒకే కారణం. వర్షం పడి రన్‌వే తడవడంతో ఏరోప్లేన్ జారిపోయింది. పైలెట్లు వెంటనే స్పందించి విమానాన్ని కంట్రోల్‌లోకి తెచ్చారు. కానీ రన్‌వే పక్కలకుండే లైట్లు పగిలిపోయాయి.