ప్రతి ఒక్కరికి డిజిటల్ ​హెల్త్​ కార్డు .. దానితో ఆరోగ్యశ్రీ అనుసంధానం: సీఎం రేవంత్​రెడ్డి

ప్రతి ఒక్కరికి డిజిటల్ ​హెల్త్​ కార్డు .. దానితో ఆరోగ్యశ్రీ అనుసంధానం: సీఎం రేవంత్​రెడ్డి
  • ఆరోగ్యశ్రీకి తెల్లరేషన్​కార్డు మస్ట్​ అనే రూల్​ను సడలించండి
  • మెడికల్​ కాలేజీలున్నచోట నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్​ కాలేజీలుండాలి
  • అందుకు అవసరమయ్యే కామన్​ పాలసీని తీసుకురావాలి
  • బీబీనగర్​ ఎయిమ్స్​ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలి
  • ఏరియాల వారీగా ఎక్కడికక్కడ వైద్య సదుపాయాలు ఉండాలి
  • గవర్నమెంట్​ దవాఖాన్లకు ప్రతినెలా ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించండి
  • ప్రైవేటు ఆస్పత్రులకు 3 నెలలకోసారి చెల్లించేలా ఒప్పందం చేసుకోండి
  • వైద్య, ఆరోగ్య శాఖ రివ్యూలో అధికారులకు ఆదేశాలు

హైదరాబాద్​, వెలుగు:  రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ డిజిటల్​ హెల్త్​ ప్రొఫైల్​ కార్డు సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలను చేపట్టాలన్నారు. డిజిటల్​ హెల్త్​ ప్రొఫైల్​ కార్డును ఒక యూనిక్ నంబర్​తో అనుసంధానం చేయాలని, దాని వల్ల అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించే వీలుంటుందని చెప్పారు. ఈ హెల్త్​ ప్రొఫైల్​ కార్డుతో ఆరోగ్యశ్రీని అనుసంధానం చేయాలని సూచించారు. వైద్య, ఆరోగ్య శాఖపై సోమవారం సెక్రటేరియెట్​లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి సీఎం రేవంత్​ రెడ్డి రివ్యూ నిర్వహించారు. ఆరోగ్య శ్రీకి తెల్లరేషన్​ కార్డు తప్పనిసరి అనే నిబంధనను సడలించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సీఎం సూచించారు. ఈ నిబంధన కారణంగా ఆరోగ్యశ్రీ కార్డు కోసం తెల్లరేషన్​ కార్డు తీసుకునే వారి సంఖ్య పెరుగుతున్నదని అన్నారు. మెడికల్​ కాలేజీ ఉన్న ప్రతి చోట నర్సింగ్​, ఫిజియో థెరపీ, పారా మెడికల్​ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం కామన్​ పాలసీని తీసుకురావాలని అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. వరంగల్​, ఎల్బీ నగర్, సనత్​నగర్​, అల్వాల్​లో టిమ్స్​ సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలన్నారు. 

డాక్టర్ల కొరత లేకుండా మెడికల్​ కాలేజీలను ఆసుపత్రులకు అనుసంధానంగా ఉండేలా చూడాలని సూచించారు. రాష్ట్రంలో మెడికల్, నర్సింగ్, పారా మెడికల్​ కాలేజీల్లో ఇంకా ప్రారంభంకాని వాటి వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. కొడంగల్​లో మెడికల్​ కాలేజీ, నర్సింగ్​ కాలేజీల ఏర్పాటు అంశంపై పరిశీలన చేయాలని అధికారులకు ఆయన  సూచించారు. 

ఎయిమ్స్​ పూర్తిస్థాయిలో..

బీబీ నగర్​ ఎయిమ్స్​లో వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా అధికారులకు సీఎం రేవంత్​ ఆదేశించారు. ‘‘ఎయిమ్స్​ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. దీంతో ఉస్మానియా, నిమ్స్​ ఆస్పత్రులపై భారం తగ్గుతుంది. ఎయిమ్స్​ను సందర్శించి పూర్తిస్థాయి రిపోర్టు తయారు చేయండి. ఎయిమ్స్​లో పూర్తిస్థాయి వైద్య సేవల కోసం అవసరమైతే నేనే స్వయంగా కేంద్రమంత్రిని కలిసి వివరిస్త. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు వైద్యం కోసం కేవలం హైదరాబాద్​పైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టండి. ఏరియాల వారీగా ఎక్కడికక్కడ వైద్య సదుపాయాలు కల్పించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా చూడండి. సంబంధిత మెడికల్ కాలేజీల్లో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగేలా చర్యలు తీసుకోండి’’ అని అధికారులకు సీఎం రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. కాగా, ఉస్మానియా ఆసుపత్రి విస్తరణలోని సమస్యలను అధికారులు సీఎంకు వివరించారు. ఉస్మానియా హెరిటేజ్​ భవనానికి సంబంధించిన అంశం కోర్టులో ఉన్నందున, కోర్టు సూచనల ప్రకారం ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయం తీసుకుందామని అధికారులకు సీఎం సూచించారు. 

హాస్పిటల్స్​కు ఫార్మా కంపెనీలు హౌస్​ కీపింగ్​ సేవలివ్వాలి

మెడికల్​ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో హౌస్​ కీపింగ్​ మెయింటెనెన్స్​ నిర్వహణ బాధ్యతను పెద్ద ఫార్మా కంపెనీలు తీసుకోవాలని సీఎం రేవంత్​ రెడ్డి సూచించారు. ఆ సంస్థలు తమ సీఎస్​ఆర్​ నిధులను ఉపయోగించి హౌస్​ కీపింగ్​ సేవలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో ఏదో ఒక ఆసుపత్రిలో దీనిని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని అధికారులకు సూచించారు.. జూనియర్​ డాక్టర్స్, ఆశా వర్కర్స్​, స్టాఫ్​ నర్సులకు జీతాలను ప్రతి నెలా క్రమం తప్పకుండా అందించేలా చూడాలని చెప్పారు.  108, 102 సేవల పనితీరుపై సీఎం ఆరా తీశారు. వాటి సేవలను మరింత మెరుగుపరచాలని ఆదేశించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం ప్రిన్సిపల్​ సెక్రటరీ శేషాద్రి, సీఎం జాయింట్ సెక్రటరీ సంగీత సత్యనారాయణ, హెల్త్​ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తు, కమిషనర్​ కర్ణన్, డ్రగ్​ కంట్రోల్​ డైరెక్టర్​ జనరల్​ కమలాసన్​రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈవో విచాలాచ్చి తదితరులు పాల్గొన్నారు. 

ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వద్దు 

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ  అమలు తీరు, నిధులకు సంబంధించి అధికారులతో సీఎం రేవంత్​ చర్చించారు. ప్రతి నెలా ప్రభుత్వ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులను విధిగా విడుదల చేయాలని, ప్రైవేటు ఆసుపత్రుల ఆరోగ్యశ్రీ బిల్లులను ప్రతి మూడు నెలలకోసారి విడుదల చేసేలా ఒప్పందం కుదుర్చుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ మెడికల్​ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న టీచింగ్​ హాస్పిటల్స్​కు, ప్రభుత్వ హాస్పిటల్స్​కు పెండింగ్​లో ఉన్న రూ.270 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు.