మధిర, వెలుగు: ఎరువులు, పురుగుమందులు, విత్తన డీలర్లు చట్టాలకు లోబడి వ్యవహరించాలని మధిర వ్యవసాయ సహాయ సంచాలకులు ఎస్.విజయచంద్ర సూచించారు. మంగళవారం మధిర రైతు వేదికలో ఎరువులు, పురుగు మందులు, విత్తనాల డీలర్లు, సొసైటీ సీఈఓలతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువులను పీఓఎస్ మిషన్ ద్వారానే అమ్మాలని, ఏ రోజుకు ఆరోజు స్టాక్ రిజిస్టర్లలో నమోదు చేయాలని ఆదేశించారు. ప్రతి డీలరు లైసెన్సులను షాపుల్లో ప్రదర్శించాలని, నేమ్ బోర్డ్స్ పెయింట్‌తో రాయించాలని తెలిపారు. యాసంగిలో రైతులకు సరిపడా యూరియా అందించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
కౌలు రైతులు తమ వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారులకు అందజేసి పత్తిని అమ్ముకోవాలని సూచించారు. సమావేశంలో మధిర వ్యవసాయ అధికారి కె. సాయి దీక్షిత్, వ్యవసాయ విస్తరణ అధికారి జిష్ణు, డీలర్లు పాల్గొన్నారు.
