డ్రోన్లతో వ్యవసాయం సమస్యాత్మకం

డ్రోన్లతో వ్యవసాయం సమస్యాత్మకం

ఆధునిక వ్యవసాయంలో ఒక విచిత్ర పద్ధతి ఉన్నది. ఒక సమస్య వస్తే, దానికి ఒక ‘టెక్నికల్’ పరిష్కారం చూపెట్టడం, ఆ పరిష్కారం నుంచి వచ్చే సమస్యలకు ఇంకొక కొత్త టెక్నికల్ పరిష్కారం కనిపెట్టడం. ఏతావాతా ఈ టెక్నికల్ పరిష్కారాల జాతరలో రైతుకి మిగిలేది ఏమీ ఉండదు. ఇంకొక కొత్త సమస్య తప్పితే. వ్యవసాయ ఆధునికీకరణ అంటే యాంత్రికరణగా మారింది. ఇప్పటి డిజిటలీకరణ వ్యవసాయంలో ఏ సమస్యకు   పరిష్కారం? రైతుల పరిస్థితితో నిమిత్తం లేదు. క్షేత్ర స్థాయిలో ఉండే పరిమితులు అసలే పట్టించుకోరు. రైతులకు నేరుగా సహాయపడే గుంటుక వంటి సాధారణ పరికరాలను సమకూర్చడానికి ఆపసోపాలు పడే అధికారులు, లక్షల ఖరీదు చేసే డ్రోన్లను ప్రోత్సహిస్తున్నారు. విత్తనం నాటే దగ్గర నుంచి, రసాయనాల పిచికారి, ఎరువులను జల్లడం, పైరు పర్యవేక్షణ, పశువుల పరిరక్షణ వంటి డ్రోన్ల ద్వార చేయవచ్చు అని ఊదరగొడుతున్నారు. 

పెద్ద కమతాలు, ఎకరాల కొద్దీ ఉండే ఏక పంట క్షేత్రాలలో వ్యవసాయం చేసే కంపెనీలకు కూలీల కొరత తగ్గించుకోవడానికి ఉపయోగపడే ఎలక్ట్రానిక్ పరికరాలు మన దేశంలో ప్రవేశపెట్టే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. వ్యవసాయంలో డ్రోన్లు రకరకాలుగా ఉపయోగపెట్టవచ్చు అంటున్నారు. విత్తనాలు నాటేందుకు, ఎరువులు చల్లేందుకు, కీటక నాశక రసాయనాలు  పిచికారి చేసేందుకు, పంటలకు చీడపీడ పడితే గమనించేందుకు, పంట ఫొటోలు తీయడానికి వగైర పనులు ఒక డ్రోన్ చేస్తుంది అని చెబుతున్నారు. 

డ్రోన్ల కోసం చట్టాలు సరళీకృతం

వ్యవసాయంలో డ్రోన్లను భారీ ఎత్తున ప్రోత్సహించడానికి  కేంద్ర ప్రభుత్వం 2018లో  నిర్ణయించింది. 2019లో రాయితీ పథకం కూడా ప్రకటించింది. అడ్డుగా ఉన్న చట్టాలను సరళీకృతం చేసింది. రైతు ఉత్పత్తి కంపెనీలకు భారీ ఎత్తున దాదాపు రూ.7.5 లక్షల వరకు రాయితీ అందించేందుకు ఈ పథకం రూపకల్పన జరిగింది. 2023లో కోఆపరేటివ్ సొసైటీ ఆఫ్ ఫార్మర్స్, ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్  కింద కస్టమ్ హైరింగ్ సెంటర్లు, గ్రామీణ పారిశ్రామికవేత్తలకు డ్రోన్లు కొనడానికి 40% ఆర్థిక రాయితీ ప్రకటించింది. దీని కింద గరిష్టంగా రూ.4 లక్షలు ఇస్తారు. వ్యవసాయ గ్రాడ్యుయేట్లు సీహెచ్సీలను స్థాపించి 50% సహాయం పొందవచ్చు. వారికి ఒక్కో డ్రోన్‌కు రూ.5 లక్షలు ఇస్తుంది. వ్యక్తిగతంగా కొనే చిన్న, సన్నకారు రైతులు, షెడ్యూల్డ్ కులాలు/షెడ్యూల్డ్ తెగ సభ్యులు, మహిళలు, ఈశాన్య రాష్ట్ర రైతులకు 50% సహాయం (గరిష్టంగా రూ.5 లక్షలు), ఇతర రైతులకు 40% (గరిష్టంగా రూ.4 లక్షలు) ఇస్తుంది. 

డ్రోన్ల రాయితీతో లాభమెవరికి?

రాయితీలు ఎల్లకాలం ఉండవు. రాయితీల కాలపరిమితి దాటినాక ఈ ఖర్చు పెరుగుతుంది. అన్నీ డ్రోన్లు చేస్తే, డ్రోన్ నడిపే ‘సాంకేతికత’ వ్యక్తి చేస్తే మరి రైతు ఏమి చేస్తాడు? రుణ మాఫీ వల్ల రైతులలో ‘సోమరితనం’ పెరుగుతున్నది అని మదనపడుతుంటారు ‘ఆధునిక’ ఆర్థికవేత్తలు. డ్రోన్ల వల్ల రైతు వ్యవసాయం నుంచి తప్పుకునే పరిస్థితి వస్తుంది. బహుశ ఉద్దేశ్యం కూడా అదే కావచ్చు. రుణ మాఫీ వల్ల ‘అప్పుల’ సంస్కృతి దెబ్బతింటుంది అని విశ్లేషిస్తున్న నీతి ఆయోగ్ ఆర్థికవేత్తలు,  డ్రోన్లకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీల గురించి కిమ్మనడం లేదు. డ్రోన్ల వల్ల రైతుకు ఇంకా పెద్ద ప్రమాదం ఉన్నది. డ్రోన్ల మీద ఆధారపడే రైతు తన వ్యవసాయ పరిజ్ఞానం కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా రైతును   నిలబెడుతున్నది తనకున్న పరిజ్ఞానం, నైపుణ్యం. ఇవి రెండు కోల్పోయిన తరువాత రైతు పొలంలో నిలుచునే పరిస్థితి ఉండదు.

డ్రోన్లతో పిచికారీ ప్రమాదకరం

మిగతా ఉపయోగాల మాట ఎలా ఉన్నా, డ్రోన్ల ద్వారావిష రసాయనాల పిచికారి చాలా ప్రమాదకరం. డ్రోన్లు విష రసాయనాల పిచికారికి ఉపయోగించడం రైతుకు, చేనుకు, ప్రకృతికి చేటు. చట్టపరంగా అనుమతి కూడా లేదు. భారతదేశంలో, Insecticide Act, 1968, చట్టం ప్రకారం ఏరియల్ స్ప్రే చేయాలంటే ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. పాశ్చాత్య దేశాలలో, 5 నుంచి 10 వేల హెక్టార్లు ఉండే పెద్ద కమతాలలో, సాధారణంగా ఏరియల్ స్ప్రే చేస్తారు. మన దగ్గర అట్లాంటి కమతాలు లేవు. వేల ఎకరాల తోటలలో చిన్న విమానాల ద్వారా చేస్తారు. 

కాఫీ, తేయాకు, జీడిపప్పు తోటలు ఉన్నా ఏరియల్ స్ప్రే గురించి ఆలోచన, అవసరం ఎప్పుడూ రాలేదు. కాగా, 1980వ దశాబ్దంలో, కేరళ రాష్ట్రంలోని కాసరగోడ్ ప్రాంతంలో ఉన్న జీడిపప్పు తోటలకు ఎండో సల్ఫాన్ విష రసాయనం విమానం ద్వారా పిచికారి కొన్ని సంవత్సరాలు చేశారు. పర్యవసానంగా, ఆ ప్రాంతంలో వన్యప్రాణులు, పాడి పశువులు, కొండ చిలువలు మొదలుకొని, తోటల మధ్యలో నివసిస్తున్న గ్రామ ప్రజలు కూడా విష రసాయనం బారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురై చనిపొయారు. అంతు తెలియని శారీరక రుగ్మతలు ఇప్పటికీ అక్కడ కనపడతాయి. ఒక డాక్టరు స్థానిక రోగాల తీరు గుర్తించి అక్కడి ప్రజలను జాగృతం చేస్తే వారు ఉద్యమించి, ఏరియల్ స్ప్రే పద్ధతిని ఆపించారు. 

ఆ తరువాత, ఎండో సల్ఫాన్ రసాయనం ప్రపంచవ్యాప్తంగా నిషేధించటానికి ఈ ఉద్యమం కారణం అయ్యింది. అయితే, ఒక ఇరవై ఏండ్లు అనధికారికంగా, అనుమతి లేకుండా ఒక ప్రభుత్వ సంస్థ ఆకాశ పిచికారి  చేయడం చర్చినీయాంశం అయ్యింది. డ్రోన్ల ద్వారా అత్యంత ప్రమాదకరమైన విషంతో కూడిన కీటక నాశక రసాయనాలు పంటల మీద గాల్లో ఎగురుతూ పిచికారి  చేసే వ్యాపారం అభివృద్ధి చేయటానికి కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకోవటం శోచనీయం. అటువంటి ఆలోచన విధానమే తప్పు. 

రసాయన కాలుష్యం విస్తరిస్తుంది

రసాయన పిచికారి డ్రోన్లతో ఏ ఎత్తులో చేసినా దాదాపు 90 శాతం గాలి వాటానికి దూరంగా వెళుతుంది. సాధారణంగానే, విష రసాయనాలు పిచికారి చేసే  రైతులు, రైతు కూలీలు అనారోగ్యానికి గురి అవుతున్నారు. అయితే డ్రోన్ల ద్వార పిచికారి చేస్తే ఇతరులు కూడా వీటి దుష్ప్రభావం బారిన పడతారు.  గాలి దిశ బట్టి రసాయనాల బారిన పడతారు. రసాయన తుంపర్లు పంట మీద కంటే పంట విస్తీర్ణం బయట ఎక్కువగా పడతాయి. 

 డ్రోన్ల వల్ల రసాయనాల కాలుష్యం విస్తీర్ణం పెరుగుతుంది. డ్రోన్ల ద్వార రసాయనాల పిచికారికి నీటి వాడకం  తక్కువ అని ఆయా కంపెనీలు ప్రకటిస్తున్నాయి. అంటే, డ్రోన్ల ద్వార పిచికారి చేసే రసాయనాల సాంద్రత, గాఢత ఎక్కువగా ఉంటుంది.  వాటి దుష్ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. పెద్ద పొలాల్లో ఏరియల్ స్ప్రే చేయడం  వల్ల గాలికి పొరుగున ఉన్న చిన్న, సన్నకారు రైతుల పంటల మీద పడవచ్చు. సహజ, సర్టిఫైడ్ సేంద్రియ వ్యవసాయ ప్రాంతాలు అనవసరంగా రసాయనాలతో ప్రభావితమవుతాయి. సేంద్రియ ధృవీకరణ పొందిన పొలాల్లో రసాయన అవశేషాలు కనిపిస్తే ఆయా రైతులు ఆర్థికంగా నష్టపోతారు. 

శాస్త్రీయమైన ఫలితాలు రాలేదు

ప్రపంచమంతటా డ్రోన్ల ఉపయోగం గురించిన పరిశోధనలు జరుగుతున్నాయి. పరిశోధనల ఫలితాలు రాకముందే కేంద్ర ప్రభుత్వం అత్యుత్సాహంగా అన్ని అనుమతులు ఇచ్చేసింది. జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలు తూతూమంత్రంగా కొన్ని క్షేత్ర స్థాయి పరిశోధనలు చేసి, సమావేశాలు పెట్టి డ్రోన్ల వల్ల ‘సాధించే’ అద్భుతాలు కొనియాడుతున్నారు. 

ఇప్పటి వరకు డ్రోన్ల వల్ల రైతుల ఆరోగ్యం మెరుగు అవ్వడం, పంట ఉత్పదాకత పెరగడం, ఆదాయం పెరగడం వంటి అంశాల మీద శాస్త్రీయమైన ఫలితాలు రాలేదు.  కేంద్ర వ్యవసాయ శాఖ డ్రోన్​తో విష రసాయనాల పిచికారికి సంబంధించి ఒక ప్రామాణిక పత్రం 2021 డిసెంబర్ 21న విడుదల చేసింది. ఈ పత్రంలోని సూచనలు పాటిస్తే డ్రోన్ల ఉపయోగానికి ప్రత్యేక అనుమతి అవసరం లేదు. అయితే, సైన్స్, పర్యావరణ సమస్యలను ఈ పత్రంలో పొందుపరచడంలో ప్రభుత్వం విఫలమైంది. నేను లేవనెత్తిన అనేక అంశాలకు ప్రభుత్వం నుంచి జవాబు లేదు.  ప్రాణి కోటికి వినాశకరం. ఇదొక సాంకేతిక అద్భుతంగా చిత్రీకరించి రైతులను డ్రోన్ల వాడకం వైపు ఆకర్షిస్తున్నారు. దీనిపై రైతులు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది.

నమ్మశక్యం కాని ఉపయోగాలు 

డ్రోన్ల ద్వారా  రైతుల ఆదాయం పెరుగుతుందా? కూలీల కొరతను అధిగమించడానికి ఉపయోగపడుతుందా? పంట ఖర్చులు తగ్గుతాయా? ఎరువులు, రసాయనాల వినియోగం తగ్గుతుందా? రైతుల ఆరోగ్యం మెరుగు అవుతుందా?  వ్యవసాయం గురించి కనీస పరిజ్ఞానం ఉన్నవాళ్లు డ్రోన్ల ‘ఉపయోగాల’ చిట్టాను నమ్మరు. నమ్మశక్యం కాని ఉపయోగాలను డ్రోన్లకు ఆపాదించి కేంద్ర ప్రభుత్వం పని కట్టుకుని ప్రచారం చేయడం, వ్యవసాయ సంక్షోభాన్ని పక్క దారి పట్టించడానికి కావచ్చు. వ్యవసాయం పేరిట కోట్ల రూపాయల పెట్టుబడి డ్రోన్ల ఉత్పత్తిదారులకు, నిర్వహించే పట్టణవాసులకు పోతుంది. రైతుకు మిగిలేది ఏమీ ఉండకపోవచ్చు. డ్రోన్లతో ఖచ్చితమైన పిచికారి ద్వారా రసాయనాల వినియోగం తగ్గుతుంది. తద్వారా ఖర్చు తగ్గుతుంది అంటున్నారు. కానీ, ఖర్చు 10 శాతానికి మించి తగ్గదు.

 

డా. దొంతి నరసింహారెడ్డి,పాలసీ ఎనలిస్ట్