కొన్నిచోట్ల ఆక్రమణలు.. మరికొన్నిచోట్ల పూడ్చివేత

కొన్నిచోట్ల ఆక్రమణలు.. మరికొన్నిచోట్ల పూడ్చివేత
  • నిర్వహణను గాలికొదిలిన ఇరిగేషన్ ఆఫీసర్లు
  • చివరి ఆయకట్టుకు అందని నీరు

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లాలో ఎస్సారెస్పీ కాలువల ఆనవాళ్లు కనిపించడం లేదు. కొన్ని యథేచ్ఛగా ఆక్రమిస్తుండగా.. మరికొన్ని మట్టితో పూడుకుపోయాయి. ఇరిగేషన్ ఆఫీసర్లు నిర్వహణను గాలికొదిలేయడంతో... నీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాకు స్టేజ్–1లో డీబీఎం–48, స్టేజీ–2లో డీబీఎం 57,59,60,61,63 కాలువల ద్వారా ఎస్సారెస్పీ నీళ్లు అందుతుండగా.. ఆయా కెనాల్స్ కు సంబంధించిన పిల్ల కాలువలన్నీ మూసుకుపోయాయి. ఓవైపు భూముల రేట్లు పెరిగిపోవడంతో రియల్టర్లు కాలువలను ఆక్రమించేస్తున్నారు.

పట్టించుకోని ఆఫీసర్లు..

జిల్లాకు సాగు నీరు అందించాలని అప్పట్లో ఎస్సారెస్పీ పిల్ల కాలువలు నిర్మించారు. జిల్లాలోని మొత్తం 15 మండలాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. ప్రస్తుతం ఈ కాలువలు కబ్జాకు గురికావడం, మట్టితో పూడుకపోవడంతో ఒకదానికొకటి కనెక్షన్ లేకుండా పోయాయి. దీంతో నీరు విడుదలైన సమయంలో నీళ్లన్నీ వృథాగా వెళ్లిపోతున్నాయి. ఆఫీసర్లకు ఈ విషయం తెలిసినా పట్టించుకోవడం లేదు.

యధేచ్ఛగా కబ్జా..

ఎస్సారెస్పీ కాలువలను రియల్టర్లు యధేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ తదితర ప్రాంతాల్లో భూముల రేట్లు పెరగడంతో కాలువలను ధ్వంసం చేసి, చదును చేస్తున్నారు. తమ వెంచర్లకు కాలువల ద్వారా రోడ్లు వేసుకుంటున్నారు.  మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని ఎస్పీ ఆఫీసుకు వెళ్లే రూట్​లో ఎస్సారెస్పీ కాలువ కనుమరుగైంది. ఈదులపూసపల్లి వెళ్లే రోడ్ లోని అంబేద్కర్​ కాలనీ సమీపంలోనూ కెనాల్స్ కానరాకుండా పోయాయి. శనగపురం శివారు, మంగలికాలనీ, మల్యాల వెళ్లే రోడ్డులో కాలువలను పూడ్చేశారు. మరిపెడ టౌన్​లో కెనాల్స్ కు ఇరువైపులా ఉన్న మట్టిని గుట్టుగా తరలించారు. అనంతాద్రి ఆలయం వెళ్లే రూట్​లో పంట పొలాలు ఇండ్ల స్థలాలుగా మారడంతో మైనర్ కాలువలు కనిపించడం లేదు. తొర్రూరు పట్టణంలో అగ్రికల్చర్​ మార్కెట్ సమీపంలో ఎస్సారెస్పీ కాలువలను మూసేశారు.

చర్యలు తీసుకుంటాం..

జిల్లాలో ఎస్సారెస్పీ కాలువలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం. కబ్జాకు గురైన ప్రాంతాల్లో సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తాం. అవసరమైతే పోలీస్ కేసులు నమోదు చేయిస్తాం. కాలువలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు.

- వెంకటేశ్వర్​రావు, 
ఇరిగేషన్ ఎస్ఈ, మహబూబాబాద్