గంపగుత్తగానా..ప్రాజెక్టుల వారీగానా.. కృష్ణా నీళ్ల పంపిణీపై ఇరిగేషన్​ వర్గాల్లో చర్చ

గంపగుత్తగానా..ప్రాజెక్టుల వారీగానా.. కృష్ణా నీళ్ల పంపిణీపై ఇరిగేషన్​ వర్గాల్లో చర్చ
  • బచావత్ ​కేటాయింపులకు రక్షణనిస్తే తెలంగాణ పరిస్థితి ఏంటి
  • సరిగా కొట్లాడకుంటేమళ్లీ అన్యాయమే!

హైదరాబాద్, వెలుగు: కృష్ణా నీళ్ల పంపిణీ ఎట్లా ఉండబోతుంది? ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేస్తారా.. ఒక రాష్ట్రానికి ఇన్ని నీళ్లని గంపగుత్తగా ఇస్తారా అనే చర్చ ఇరిగేషన్​ వర్గాల్లో జోరుగా సాగుతున్నది. తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పున:పంపిణీని కేంద్ర కేబినెట్ ​బ్రజేశ్​కుమార్​ ట్రిబ్యునల్​(కేడబ్ల్యూడీటీ–2)కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ​స్టేట్ ​వాటర్ ​డిస్ప్యూట్స్ యాక్ట్​–1956లోని సెక్షన్​5(1) ప్రకారం ట్రిబ్యునల్​కు రిఫర్ ​చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. దీనికి సంబంధించిన టర్మ్స్​ ఆఫ్ ​రెఫరెన్స్​(టీవోఆర్) రావాల్సి ఉంది. 2013లో బ్రజేశ్ ​కుమార్ ​ట్రిబ్యునల్​తన నివేదిక ఇవ్వగా అందులో బచావత్​ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ–1) తీర్పును రివ్యూ చేయబోమని తేల్చిచెప్పింది. ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల్లోనూ పాత కేటాయింపులకు రక్షణ ఉంటుందని సీడబ్ల్యూసీ ఉన్నతాధికారులు చెప్తున్నట్టుగా సమాచారం. ఇదే జరిగితే తెలంగాణకు న్యాయబద్ధమైన వాటా దక్కుతుందా అనే చర్చ సాగుతోంది. నీటి కేటాయింపులను తేల్చాల్సిందిగా ట్రిబ్యునల్​కు రిఫర్​ చేయడం తెలంగాణ విజయమేనని.. కానీ న్యాయబద్ధమైన వాటా దక్కించుకునేందుకు ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేయాలని రిటై ర్డ్ ​ఇంజనీర్లు సూచిస్తున్నారు.

జస్టిస్​ బచావత్ ​నేతృత్వంలోని కృష్ణా మొదటి ట్రిబ్యునల్​1976లో ప్రాంతాల వారీగా నీటి కేటాయింపులు చేసింది. ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలను కేటాయించగా, అందులో రాయలసీమకు 144.70 టీఎంసీలు, కోస్తాంధ్రకు 367.34 టీఎంసీలు, తెలంగాణకు 298.96 ఇచ్చారు. అప్పటికి తెలంగాణలో ప్రాజెక్టులు లేకపోవడంతో మైన్​ర్ ఇరిగేషన్ అవసరాల కోసమంటూ ట్రిబ్యునల్​ చొరవ తీసుకొని 89.15 టీఎంసీలు కేటాయించింది. రాష్ట్ర విభజన తర్వాత రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతానికి కేటాయించిన నీళ్లను కలిపి 512 టీఎంసీలు ఏపీకి, తెలంగాణకు 299 టీఎంసీలు తాత్కాలిక ప్రాతిపదిక కేటాయించారు. ఈ నీళ్లలో ఏ ప్రాజెక్టుకు ఎంత అని కాకుండా.. రాష్ట్రానికి గంపగుత్తాగా (ఎన్​బ్లాక్) ఉపయోగించుకోవడానికి అనుమతి ఇవ్వడంతో ఏపీ ప్రభుత్వం శ్రీశైలం నీళ్లను రాయలసీమకు మళ్లించుకుంటోంది. ఎన్​బ్లాక్ ​అగ్రిమెంట్​ప్రకారం తాము రాష్ట్రంలో ఎక్కడైనా నీళ్లు ఉపయోగించుకొనే అవకాశం ఉందని ఏపీ వాదిస్తోంది. రేపు కొత్త ట్రిబ్యునల్​ సైతం ప్రాజెక్టుల వారీగా కాకుండా గంగగుత్తగానే నీటి కేటాయింపులు చేసే అవకాశమున్నట్టుగా చర్చ జరుగుతోంది.

పాలకుల వివక్షతో నష్టం

నిజాం పాలనలో మహబూబ్​నగర్​ జిల్లాకు సాగునీటిని అందించేందుకు భీమా (100.70 టీఎంసీలు), అప్పర్​ కృష్ణా (54.50 టీఎంసీలు), తుంగభద్ర లెఫ్ట్​కెనాల్​ పొడిగింపు (19.20 టీఎంసీలు) ప్రాజెక్టులు ప్రతిపాదించారు. గ్రావిటీ ద్వారా ఈ 174.30 టీఎంసీల నీళ్లు వచ్చే అవకాశం ఉండేది. ఈ ప్రాజెక్టు నిర్మించాలని ప్రతిపాదించిన ప్రాంతాలు ఇండియన్​ యూనియన్​లో హైదరాబాద్​స్టేట్​విలీనం తర్వాత కర్నాటకలోకి వెళ్లాయి. 1956లో హైదరాబాద్​ స్టేట్​ ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి ఉమ్మడి ఏపీ ఏర్పాటు చేయడంతో పాలమూరు ప్రాజెక్టులను పట్టించుకోలేదు. ఉమ్మడి రాష్ట్ర పాలకుల వివక్ష కారణంగా ఆర్డీఎస్​కు ఇంకో 24 టీఎంసీలు, నాగార్జున సాగర్​కు ఇంకో 32 టీఎంసీలు దక్కాల్సి ఉండేది.. గ్యాప్​ ఆయకట్టుకు 7.26, నిర్మాణంలో ఉన్న పాలమూరు – రంగారెడ్డి సహా ఐదు ప్రాజెక్టులకు 225.60 టీఎంసీలు, చేపట్టాల్సిన ప్రాజెక్టులకు 206.50 టీఎంసీలు, జూరాలకు అదనపు కేటాయింపులుగా 9 టీఎంసీలు కలుపుకొని 747.12 టీఎంసీలు రాష్ట్రానికి అవసరం. ఇవి కాకుండా తాగు నీటి కోసం 15.06 టీఎంసీలు, పరిశ్రమలకు 9.29 టీఎంసీలు అదనంగా అవసరం. మొత్తంగా కృష్ణా బేసిన్​లో తెలంగాణ అవసరాలు 771.47 టీఎంసీలని తెలంగాణ ప్రభుత్వం బ్రజేశ్ ​కుమార్​ట్రిబ్యునల్​కు అధికారికంగా నివేదించింది. 

కొట్లాడెటోళ్లు లేక కోల్పోయినం

కృష్ణా బేసిన్​లో తెలంగాణ జనాభా 2 కోట్ల మంది కాగా, ఏపీ జనాభా 78 లక్షలు మాత్రమే.. ఏపీలో మొత్తం సాగు భూమి 15.3 లక్షల హెక్టార్లు కాగా తెలంగాణలో 36.5 లక్షల హెక్టార్ల సాగు భూమి ఉంది. ఇందులో తీవ్ర దుర్భిక్ష, వర్షాభావ భూమి తెలంగాణలో 33 లక్షల హెక్టార్లు ఉండగా, ఏపీలో 12.5 లక్షల హెక్టార్లు మాత్రమే ఉంది. కృష్ణా బేసిన్​లో తెలంగాణ క్యాచ్​మెంట్​52,232 చదరపు కి.మీ.లు కాగా ఏపీలో క్యాచ్​మెంట్​24,018 చదరపు కి.మీ.లు మాత్రమే.. ఈ లెక్కన ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల నికర జలాల్లో న్యాయబద్ధంగా తెలంగాణకు 574.6 టీఎంసీలు, ఏపీకి 236.4 టీఎంసీలు దక్కాల్సి ఉంది. బ్రజేశ్​ ట్రిబ్యునల్​అదనంగా గుర్తించిన 194 టీఎంసీల మిగులు జలాల్లో తెలంగాణకు 137.4 టీఎంసీలు, ఏపీకి 56.6 టీఎంసీలు దక్కాల్సి ఉంటుంది. మొత్తంగా ఏపీకి 293 టీఎంసీలు, తెలంగాణకు 712 టీఎంసీలు దక్కాల్సి ఉంటుంది. కానీ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నీటి హక్కుల గురించి కొట్లాడేటోళ్లు లేకపోవడంతో నీటి వాటాలు రివర్స్​అయ్యాయి.

తెలంగాణకు 700 టీఎంసీలు ఇవ్వాలే

కేంద్ర ప్రభుత్వం కృష్ణా జలాల పంపిణీ అంశాన్ని బ్రజేశ్ ట్రిబ్యునల్​కు రిఫర్​ చేయడం అభినందనీయం. తెలంగాణకు కృష్ణాలో న్యాయంగా 700 టీఎంసీల నికర జలాలు దక్కాల్సి ఉంది. కేంద్రం ఇచ్చే టీవోఆర్​లో ఈ మేరకు మార్గదర్శకాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి న్యాయబద్ధమైన వాటా ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తూ ఉన్నాం. ప్రధాని మోదీకి, జలశక్తి శాఖ మంత్రులు, సీడబ్ల్యూసీ చైర్మన్​కు పలుమార్లు లేఖలు రాశాం. ఇప్పటికైనా కేంద్రం ట్రిబ్యునల్​ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు కృష్ణా జలాల కేటాయింపుల్లో అన్యాయం జరిగింది. దానిని ఇప్పటికైనా సరి చేయాలి. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేస్తే నీటి అక్రమ వినియోగాన్ని కట్టడి చేయడం సాధ్యమవుతుంది.
- దొంతుల లక్ష్మీనారాయణ, 
కన్వీనర్, తెలంగాణ ఇంజనీర్స్​ ఫోరం