
- సూర్యాపేట జిల్లా బూరుగడ్డలో ఘటన
హుజూర్ నగర్, వెలుగు: సూర్యాపేట జిల్లా బూరుగడ్డలోని ప్రభుత్వ భూమి సర్వేపై వివాదం నెలకొంది. రైతులకు, అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. హుజూర్ నగర్ సెగ్మెంట్ లో వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. కలెక్టర్, అధికారులు హుజూర్ నగర్ మండలం బూరుగడ్డలోని సర్వే నంబర్ 604లో ప్రభుత్వ భూమి164.10 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు.
అయితే.. ఇందులోకి కొంత భూమిని 1978,1984లో 60 మంది రైతులకు 60 ఎకరాలకుపైగా పట్టాలు ఇచ్చింది. మిగిలిన100 ఎకరాలకు హద్దులు నిర్ధారించేందుకు సర్వే చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మంగళవారం తహసీల్దార్ నాగార్జున రెడ్డి, ఎస్ఐ ముత్తయ్య ఆధ్వర్యంలో పోలీస్, రెవెన్యూ అధికారులు వెళ్లగా కబ్జాలోని రైతులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఓ రైతు సమీపంలోని ట్రాన్స్ ఫార్మర్ ను పట్టుకునేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
రైతులు తమ ఆధారాలను తెచ్చుకునేందుకు సమయం ఇవ్వాల్సిందిగా కోరడంతో రెవెన్యూ అధికారులు వెనుతిరిగారు. పలువురు రైతులు మాట్లాడుతూ.. వారసత్వంగా సాగు చేసుకుంటున్న భూములకు సర్వే చేయనిచ్చేది లేదని స్పష్టంచేశారు. వారం తర్వాత మళ్లీ వచ్చి సర్వే చేస్తామని తహసీల్దార్ నాగార్జున రెడ్డి తెలిపారు.