
గోదావరిఖని, వెలుగు: నీట్‌లో ర్యాంకులు సాధించి ఎంబీబీఎస్‌లో సీటు సాధించిన సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ఆర్జీ 1 జీఎం లలిత్ కుమార్ మెరిట్ స్కాలర్ షిప్ చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. జీఎం ఆఫీస్‌లో జరిగిన కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్‌లో థియేటర్ అసిస్టెంట్‌గా పనిచేసే సుధాకర్ కూతురు శ్రీహర్షిత, ఎస్అండ్పీసీ సెక్యూరిటీ గార్డు దేవాజీ కుమార్తె వైష్ణవి, స్టాఫ్‌నర్స్ టి.మణెమ్మ కొడుకు చందన్‌కుమార్‌కు రూ.16 వేల చొప్పున చెక్కులను జీఎం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థులను సింగరేణి ఉద్యోగుల పిల్లలు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. వీరి చదువు పూర్తయ్యే వరకు ఏటా రూ.16 వేల చొప్పున ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ డెలిగేట్ రాజు, ఏజెంట్చిలుక శ్రీనివాస్, ఐఈడీ ఏజీఎం ఆంజనేయులు, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, డీవైపీఎం వేణు, సీనియర్ పీవోలు శ్రావణ్ కుమార్, హన్మంత రావు, అధికారులు పాల్గొన్నారు.