కుంటాల మండలలో రసాభాసగా రేషన్ కార్డుల పంపిణీ

 కుంటాల మండలలో రసాభాసగా రేషన్ కార్డుల పంపిణీ
  • ..కాంగ్రెస్, బీజేపీ నేతల వాగ్వాదం
  • ఎమ్మెల్యే పటేల్ సమక్షంలోనే ఘటన

కుంటాల, వెలుగు: కుంటాల మండల కేంద్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ వివాదాస్పదంగా మారింది. ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ హాజరైన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. రేషన్ బియ్యం పంపిణీలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని మోదీ ఫొటో లేకుండా కార్డులు ప్రింట్ చేయడం ఏమిటని వేదికపై అధికారులను నిలదీశారు. 

ఇందుకు స్పందించిన కాంగ్రెస్ నాయకులు పదేండ్ల నుంచి పేదలకు రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కార్డుల మంజూరు తమ ఘనతేనని కాంగ్రెస్, బియ్యం అధిక మొత్తంలో తామే ఇస్తున్నామని బీజేపీ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో పోటాపోటీగా నినాదాలు చేశారు. పరస్పర వాగ్వాదానికి దిగారు. ఇరు పార్టీల నాయకులు సభా వేదిక వద్దకు వచ్చి అనుకూల, ప్రతికూల నినాదాలు, కేకలతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దీంతో కార్డుల పంపిణీ చేపట్టారు. 

అనంతరం ఎమ్మెల్యే దౌనెల్లి గ్రామంలో శివాలయం నిర్మాణ పనులు ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్లు కమల్ సింగ్, శ్రీకాంత్, ఎంపీడీవో వనజ, జడ్పీ మాజీ చైర్మన్ జట్టు అశోక్, సొసైటీ చైర్మన్ సట్ల గజ్జరాం, డీసీసీబీ డైరెక్టర్ టి.వెంకటేశ్, నాయకులు ఆప్క గజ్జరాం, రమణారావు, వెంగల్ రావు, నవీన్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు