
- జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద
హుజూర్ నగర్, వెలుగు : జిల్లా కోర్టులో మౌలిక వసతుల పెంపునకు కృషి చేస్తానని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద అన్నారు. శుక్రవారం హుజూర్ నగర్ కోర్టు సముదాయాన్ని తొలిసారి ఆమె సందర్శించారు. బార్ అసోసియేషన్ నాయకులు జిల్లా ప్రధాన న్యాయమూర్తికి ఘనస్వాగతం పలికి పరిచయ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కోర్టులో సిబ్బంది కొరతను గుర్తించానని, త్వరలో వారి నియమించేందుకు చర్యలు చేపడతానన్నారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు మానసికంగా అలసిపోతుంటారని, దానిని అధిగమించేందుకు ఇండోర్ క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తిని మహిళా అడ్వకేట్లు ఘనంగా సన్మానించారు. అంతకుముందు రామస్వామి గుట్ట వద్ద నూతన కోర్టుల నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి రాధాకృష్ణ చౌహన్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మారుతీప్రసాద్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఆయేషాసరీనా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాముల రామిరెడ్డి, న్యాయవాదులు సిబ్బంది పాల్గొన్నారు.