సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లాలో డిస్ట్రిక్ట్మినరల్ఫౌండేషన్ట్రస్ట్(డీఎంఎఫ్ టీ) ఫండ్స్పక్కదారి పడుతున్నాయి. జిల్లాలో మైనింగ్ ద్వారా వచ్చే మినరల్ ఫండ్స్ ను ఎఫెక్టెడ్ప్రాంతాలకు కేటాయించాలన్న రూల్ఉన్నప్పటికీ అందుకు విరుద్ధంగా ఇతర పనుల కోసం మళ్లిస్తున్నారు. నలుగురు ఎమ్మెల్యేల క్యాంప్ఆఫీసుల కోసం ఏకంగా రూ. 1.3 కోట్లు కేటాయించారు. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ల నిర్మాణం కోసం రూ. కోటి కేటాయించింది. వీటికి అదనంగా సూర్యాపేట జిల్లాలో డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్ నుంచి ఒక్కో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు ఒక్కో రకంగా కేటాయించారు. సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో బాత్ రూమ్, గేట్ కోసం రూ.10 లక్షలు కేటాయించగా, డైనింగ్ హాల్ కోసం రూ.10 లక్షలు, ఇన్నర్ రోడ్స్ కు రూ.20 లక్షలు, సీసీ టీవీ, సోలార్ ఫెన్సింగ్ కు రూ.5 లక్షలు, ఎలక్ట్రికల్ వర్క్స్కోసం రూ. 10 లక్షలు కేటాయించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీటింగ్ హాల్ కోసం రూ.5 లక్షలు, కిచెన్ కు రూ.5 లక్షలు, సెక్యూరిటీ రూమ్ కు రూ. 5 లక్షలు, క్యాంప్ ఆఫీస్ గేట్‌కు రూ.5 లక్షలు, కోదాడ క్యాంప్ ఆఫీస్ లో కరెంట్ పనుల కోసం రూ.10 లక్షలు, హుజూర్ నగర్ క్యాంప్ ఆఫీస్ లో మీటింగ్ హాల్ కు రూ. 20 లక్షలు, కరెంట్ పనుల కోసం రూ. 10 లక్షలు కేటాయించారు. ఇందులో సూర్యాపేట, కోదాడలో ఇప్పటికే పనులు ప్రారంభించారు.
ప్రభావిత ప్రాంతాల డెవలప్మెంట్ వదిలి..
డీఎంఎఫ్‌టీ ఫండ్స్ మైనింగ్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేయాలి. గనుల్లో తవ్వకాలు చేపట్టేటప్పుడు బ్లాస్టింగ్ తో ఇండ్లు దెబ్బతినడం, పొల్యూషన్ తో ప్రజలు అనారోగ్యానికి గురవుతుంటారు. అలాంటి ప్రభావిత గ్రామాల్లో నష్టనివారణ చర్యలు చేపట్టడానికి మాత్రమే ఈ ఫండ్స్ వినియోగించాలని రూల్స్ ఉన్నాయి. 2018 కంటే ముందు జిల్లా కలెక్టర్ ట్రస్ట్‌కు చైర్మన్ గా ఉండేవారు. ప్రభావిత ప్రాంతాల్లో 70 శాతం, జిల్లాలో 30 శాతం ఫండ్స్ వినియోగించాలన్న రూల్ఉండేది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక జిల్లా మంత్రి చైర్మన్ గా వ్యవహరిస్తుండగా ప్రభావిత ప్రాంతాలకు 40 శాతం, జిల్లాలో 60 శాతం ఫండ్స్ వినియోగించుకునేలా జీవో జారీ చేసింది. ఈ ఫండ్స్‌ను మైనింగ్ ప్రభావిత గ్రామాల్లో విద్య, వైద్యం, వాటర్, రోడ్లకు తప్ప మరే ఇతర కార్యక్రమాలకు వాడరాదని చట్టంలో పేర్కొన్నప్పటికీ ఆఫీసర్లు అవేమీ పట్టించుకోవడం లేదు. ఎలాంటి తీర్మానం లేకుండానే ఫండ్స్ కేటాయిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
